IPL 2025: ఇదేం కామెంటరీ బాబోయ్.. మ్యాచ్ గురించి మాట్లాడకుండా అంతా సోదీ!
IPL 2025: ఐపీఎల్ హిందీ కామెంటరీ స్థాయిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్!

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ హిందీ వ్యాఖ్యానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేక్షకులు చెప్పే మాటల ప్రకారం, ఈసారి వ్యాఖ్యానం కేవలం వినోదానికి మాత్రమే పరిమితమైపోయింది. క్రీడా విశ్లేషణ, ఆటగాళ్ల టెక్నిక్, మ్యాచ్ పరిస్థితులపై చర్చలు రావాల్సిన చోట, అనవసరమైన కవితలు, బోరెత్తించే జ్ఞాపకాలు మాత్రమే ఎక్కువయ్యాయి. ఇది ప్రస్తుత తరం అభిమానులకు ఆమోదయోగ్యం కాకుండా మారింది.
వీరందరిపై కోపంగా ఉన్న అభిమానులు, వ్యాఖ్యాతలే కాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేసే బ్రాడ్‌కాస్టింగ్ సంస్థపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే, టీవీపై ఏం వినిపించాలి, ఎలా వినిపించాలి అన్నది చాలా వరకు ఆ సంస్థ నిర్ణయమే. తమకు ఇష్టమైన స్టైల్‌ను నాటకీయంగా మలిచి దాన్ని వినియోగదారులకు వినోదం పేరిట అందిస్తున్నారు. కానీ గేమ్‌ను పక్కాగా అర్థం చేసుకోవాలని చూస్తున్న ప్రేక్షకులకు ఇది అసంతృప్తిని కలిగిస్తోంది.
హిందీ వ్యాఖ్యాతలుగా ఉన్న వారు చాలామంది మాజీ క్రికెటర్లే అయినా, వాళ్ల అనుభవం మాటల్లో కనిపించడం లేదు. మెచ్యూరిటీ, విశ్లేషణా దృక్పథం కాకుండా, హీరోలపై అధికంగా అభిమానభావాలు చూపిస్తూ, ఆటకు సంబంధం లేని విషయాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇది కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల ఆశలకు న్యాయం చేయడం కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత, కామెంటరీ విన్నే ఆట ఎలా ఆడాలో నేర్చుకోవాలనే ఆసక్తితో చూస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇది నెగెటివ్‌గా మారుతోంది. అభిమానుల చెమట చిందించి, పెద్దగా ఆదాయం తెస్తున్న ఈ టోర్నీలో కామెంటరీకి కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇక నుంచైనా వ్యాఖ్యాతల తీరు మారుతుందా?