VaraLakshmi Vratham Puja 2020: ప్రధాన పుణ్యక్షేత్రాలలో వరలక్ష్మీ వ్రతం ఇలా
VaraLakshmi Vratham Puja 2020: సంపదలిచ్చే తల్లి, వరాల వేలుపు మహాలక్ష్మిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే రోజు ఈ రోజు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల మహిళలు శ్రీమహా లక్ష్మిణి ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో భక్తి శ్రద్దలతో 'వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసంలో వచ్చే పండుగల్లో మంగళగౌరీ వ్రతం, అలాగే వరలక్ష్మి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున ముత్తయిదువులంతా సామూహికంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తమ కుటుంబానికి సకల శుభాలు, ఐశ్వర్యాలు కలగాలని మహాలక్ష్మి దేవి అమ్మవారికి పూజిస్తారు.
ఇప్పటికే కర్నూలు జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో ఉదయం 9 గంటలకు వరలక్ష్మి వ్రతాలను నిర్వహణించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే అన్ లైన్ సేవగా వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆన్లైన్ వరలక్ష్మి వ్రతాల రిజిస్ట్రేషన్ టికెట్లు 200 దాటాయి. భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జిత సేవలను పరోక్షంగా జరుపుకునేందుకు ఈ సౌలభ్యాన్ని కలిగించామని ఆలయ అధికారులు తెలిపారు. వరలక్ష్మి వ్రతాన్ని శ్రీశైలం టీవీ, యూట్యూబ్ ద్వారా శ్రీశైల దేవస్థానం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే భక్తులు 1,116/- ను సేవ రుసుముగా www.srisailamonline.com ద్వారా చెల్లించే వీలు కల్పించారు. క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి వాటితో చెల్లించే వెసులుబాటును దేవస్థానం కల్పించారు.
ఇక విజయవాడలోనూ శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురుస్కరించుకుని ఆలయాన్ని అలంకరించారు. ఈ రోజును సాక్షాత్తు ఆ దుర్గమ్మ వరలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు దేవస్ధానం వారిచే వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహించనున్నారు. కోవిడ్ ద్రుష్ట్యా ప్రతీ ఏడాది నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలు ఈ ఏడాది రద్దు చేసారు. భక్తులకు పూజలకు అనుమతి నిరాకరించారు. వరలక్ష్మీ దేవి వ్రతంలో భక్తులకు పరోక్ష పూజల ద్వారా గోత్రనామాలతో జరిపేందుకు దుర్గగుడి అధికారులు అవకాశం కల్పించారు.
చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. అంతే కాదు ఈ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తికి భార్య. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది.
అయితే ఈ పూజలు ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. అంతే కాదు పెళ్లి కాని కన్నె పిల్లలు కూడా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఈ పూజలో పాలుపంచుకుంటారు.
పురాణ గాధ
స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించారు. ఈ లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.