తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
* వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు * ఆలయాల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు * తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు * ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు * శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. సమస్త కోర్కెలు తీర్చి, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనుక ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునుంచే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు పోటెత్తుతున్నారు భక్తులు. మరోవైపు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తజనం అధికసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఆలయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు.
తిరుమల వెంకన్న సన్నిధిలో..
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తిరుమలలో తొలిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు అధికారులు. స్వామివారికి అభిషేకం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేతో పాటు ఏపీ మంత్రులు బాలినేని, అవంతి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వేమారెడ్డి ప్రభాకర్‌రెడ్డి దర్శించుకున్నారు. అలాగే ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్, జస్టిస్ సీవీ నాగార్జున్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ లక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే.. తెలంగాణ మంత్రి హరీష్‌రావు కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భద్రాచలం శ్రీరాముని ఉత్తరద్వార దర్శనం..
భద్రాచలంలో రాములోరి వైకుంఠ ఏకాదాశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు శ్రీరాముని ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య సీతా సమేతుడైన శ్రీరామ చంద్రమూర్తి ఉత్తర ద్వారం గుండా అందరికీ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భద్రాద్రిలో కోలాహలం నెలకొంది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకున్నారు.
విజయనగరం రామతీర్థంలో..
విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి.. తమ మొక్కులు చెల్లించుకుంటున్నారకు. శ్రీకాకుళం నారాయణ తిరుమల, కల్యాణ వెంకటేశ్వర ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. తెలంగాణలోనూ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా గీతా భవన్‌లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. భద్రాచలంలో రాములవారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తున్నారు.
తిరుపతిలో..
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కోవిడ్ సమయంలో దేవాలయాల్లో పరిమిత సంఖ్యలో కనిపించిన భక్తులు.. వైకుంఠా ఏకాదశి రోజు మాత్రం పెద్దఎత్తున కనిపిస్తున్నారు. తిరుపతిలోని ఆలయాల దగ్గర తెల్లవారు జామునుంచే భక్తులు బారీలు తీరారు.
ద్వారకా తిరుమలలో..
పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల, చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. గరుడవాహనంపై స్వామి,అమ్మవార్ల ఉత్సవమూర్తులను దర్శించుకుంటున్న భక్తులు తర్వాత మూల విరాట్‌ను దర్శిస్తున్నారు. అటు ఆలయంలో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు అధికారులు.
వరంగల్ లో..
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వరంగల్‌లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారు జామునుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. గీతా గోవిందం వెంకటేశ్వరస్వామి ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. అటు పలు వైష్ణవ ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.