నేటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం ప్రారంభం

Update: 2020-06-08 04:33 GMT

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. కరోనా లాక్‌డౌన్‌లో నిలిచిన శ్రీవారి దర్శనం 80 రోజుల తర్వాత ప్రారంభమైంది. ఈరోజు ఉదయం నుంచి శ్రీవారి దర్శనాన్ని టీటీడీ పున:ప్రారంభించింది. మూడు రోజుల పాటు ట్రైల్ రన్ క్రింద ఉద్యోగులు, తిరుమల స్థానికులను టీటీడీ దర్శనానికి అనుమతించనుంది. ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ రోజుకు ఆరు నుంచి ఏడువేల‌ మందికి దర్శనం కల్పించడానికి ఉన్న అవకాశాలు, పరిమితులను పరీక్షించనున్నారు. అలిపిరి నుంచి ఆనంద నిలయం దాకా ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు. ఎవరిని కొండమీదకు అనుమతించబోతున్నారు.

గతంలో తిరుమలకు వెళ్ళాలంటే ముందస్తు అనుమతి అవసరం ఉండేది కాదు. స్వామివారి దర్శనానికి వెళ్ళకపోయినా తిరుమల‌ క్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. దర్శనం అనుమతి పొందిన వారిని అందులోనూ ఆరోగ్యవంతులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు. అలిపిరి వద్ద క్షుణ్ణమైమ తనిఖీతో పాటుగా ఆరోగ్య పరిస్థితిపై కూడా స్కానింగ్ నిర్వహించబోతున్నారు.

ఇప్పటిదాకా భక్తు లను అలిపిరి టోల్గేట్ దగ్గర భద్రత సిబ్బంది భౌతికంగా తనిఖీ చేసేవారు. ఇకపై భక్తులు స్వయంగా తమ జేబులు పూర్తిగా బయటకు తీసి, మహిళలు హ్యాండ్ బ్యాగ్ లు తెరచి చూపించాలి. తితిదే సిబ్బంది హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ తో పరిశీలిస్తారు. భక్తుల లగేజీ సహా వాహనాలను అలిపిరి దగ్గరే శానిటైజ్ చేస్తారు. దర్శనం టికెట్లు ఉన్నవారినే కొండ పైకి అనుమతిస్తారు.

రోజుకు సుమారు 3 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్లో ముందు గానే జారీ చేస్తున్నారు. వాటికోసం ముడొందల రూపాయలు చెల్లించాలి. ఆన్ లైన్ లోనూ దర్శనం చేసుకోవచ్చు లేదంటే ముందురోజు తిరుపతికి వచ్చి ఆధార్ కార్డుతో పాటు ఐరిస్ ద్వారా సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 వరకు గంటల వారీగా కోటా మేరకు టికెట్లు వచ్చేలా సాఫ్ట్ వేర్ మార్చారు. గంటకు 500 చొప్పున రోజుకు 6 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. అలాగే ఉచిత దర్శనాల కోసం కూడా 3వేల టిక్కెట్టు అందుబాటులో ఉంచనున్నారు. వాటిని కూడా ఆన్ లైన్ లోనైనా పొందవచ్చు, లేదంటే తిరుపతిలోని కౌంటర్ల వద్దనైనా పొందవచ్చు. ఇతర రాష్ర్టాల నుంచి టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని బుక్ చేసుకోవాలంటున్నార టీటీడీ అధికారులు.

11వ తేది‌ నుంచి ప్రతిరోజూ ఓ గంట పాటు విఐపిలను అనుమతించనున్నారు. అయితే విఐపి పరిధిలోని వారిని మాత్రమే అనుమతిస్తామంటున్నారు టీటీడీ అధికారులు. ఎవరి సిఫారుసులకూ దర్శనం ఉండదంటున్నారు. విఐపి వస్తే వారికి అనుమతి ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంలో అందరూ సహకరించాలని కోరుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం నడకదారిలో వెళ్ళే భక్తులను ఈనెల 11వ తేది నుంచి అనుమతించనున్నారు. అయితే అలిపిరి నడక మార్గాన్ని మాత్రమే తాత్కాలికంగా ఓపెన్ చేస్తున్నారు. టిక్కెట్లు పొందిన వారిని అనుమతిస్తారు.

శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని  ప్రయాణం మొదలు పెట్టడం మంచిదని అంటున్నారు టీటీడీ అధికారులు. దూరప్రాంతాల భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లనుగానీ, ఉచిత ప్రవేశ దర్శనం గానీ బుక్ చేసుకోవడం వల్ల తిరుపతిలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయంటున్నారు.

Tags:    

Similar News