పవిత్ర కార్తీకం..ఆధ్యాత్మిక సంరంభం!
కార్తీక మాసం వస్తే ఆధ్యాత్మిక సౌరభాలు.. దీపాల సందళ్ళు.. ఆలయ సందర్శనలు.. శివనామ స్మరణలు.. ప్రతి రోజు ప్రత్యేకమే. ప్రతి తిథీ విశిష్టమే!
ఆధ్యాత్మికంగా పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈరోజు నుంచి ప్రారంభం అయింది. తెలుగు మాసాలు..తిథుల లెక్కల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. ఆధ్యాత్మికంగా విశిష్టతలు సంతరించుకున్నదే. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పుకునే కార్తీకం విష్ణుమూర్తికీ ఇష్టమైన మసమే అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ మాసం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. ఆధ్యాత్మికతను ఇష్టపడని వారికి ఈ మాసంలో భక్త జనకోటి చేసే పూజలు.. అందుకోసం పాటించే విధానాలలో శాస్త్రీయత కనిపిస్తుంది. అవును.. కార్తీక మాసంలో దేవుని మీద నమ్మకంతో చేసే ప్రతి కార్యక్రమం సకల మానవాళికి ఆచరించదగ్గ కార్యక్రమం. దేవుని నమ్మినా.. నమ్మకపోయినా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా పాటించే విధి విధానాలలో ఎంతో ప్రయోజనం ఉంటుంది.
కార్తీక మాసం ఆధ్యాత్మిక విశిష్టత..
తెలుగు మాసముల ప్రకారం ఎనిమిదో నెల కార్తీకం. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు కలుస్తాడు కాబట్టి దీనిని కార్హ్తీకం అంటారని చెబుతారు. దీపావళి అమావాస్య వెళ్ళిన తరువాత వచ్చే పాడ్యమి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. ఈ నెలలో ముందే చెప్పినట్టు శివుడ్నీ..కేశవుడ్నీ ఇద్దర్నీ పూజిస్తారు. ఈనెల అంతా భక్తులు వేకువ జామున నిద్ర లేవడం.. నదీ స్నానాలు చేయడం.. ఆలయ సందర్శన చేయడం.. దీపారాధన జరపడం చేస్తారు. అదే విధంగా.. ఉపవాస దీక్షలూ చేస్తారు. ఈనెలలో చేసే స్నానజపాదులు పున్యగతులను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక ఈనెలలో వచ్చే సోమవారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ రోజులు అత్యంత పవిత్రం అని భావిస్తారు. అందుకే ఆరోజుల్లో ఉపవాస దీక్షలు చేస్తారు.
దీపం పరబ్రహ్మం..
కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకోవలసినది దీపారాధన. ప్రతి రోజూ రెండు పూటలా దీపాన్ని వెలిగించి భక్తితో భగవంతుడిని ప్రార్థిస్తారు. దీపాన్ని ఎలా వెలిగించాలి అనే దానిలోనూ నియమాలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు దీపారాధన చేయకూడదు. దానికి పురాణాల్లో ఒక విధానాన్ని నిర్దేశించారు. తెల్లవారుజామునే స్నానాదులు ముగించి (వీలైతే నదీ స్నానం శ్రేష్టం) సూర్యోదయం కంటే ముందే తులసి కోట ముందు దీపారాధన చేయాలి. ఇలా ఉదయాన్నే ఉంచిన దీపం విష్ణువుకు చెందుతుందని చెబుతారు. అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం తులసి మాతకు చెందుతుందని అంటారు. అసలు దీపారాధన చేసేది విష్ణువు కోసమే. ప్రతి నెలలోనూ విష్ణువుకు ఒక పేరు ఉంటుంది. కార్తీక మాసంలో దామోదరుడుగా పిలుస్తారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్లి, కార్తిక శుద్ధ ఏకాదశినాడు నిద్రలేస్తాడని అంటారు. అందుకే కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి ప్రత్యేకమైనడిగా చెబుతారు. ఇక దీపాల విషయానికి వస్తే కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మలో చేసిన పాపాలూ తొలిగిపోతాయని అంటారు. కార్తీక పౌర్ణిమ రోజు 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తికి దీపారాధన చేసిన ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతారు. దీపం పరబ్రహ్మ స్వరూపంగా చెబుతారు. చీకట్లు పారద్రోలే దీపం..భక్తుల కష్టాలనూ పారద్రోలుతుందని నమ్ముతారు. ఇక ఆలయాల్లో సాయం సంధ్యా సమయంలో ఆకాశాదీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని స్తంభం పై ఎత్తుగా ఉంచుతారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న ఆకాశదీపం.. శాస్త్రీయంగానూ చాలా ఉపయోగకరం. కార్తీకమాసం వర్షాకాలం వెళ్లిపోయాకా వస్తుంది. వర్షాలతో ప్రకృతి అంతా నీటిలో నానిపోతుంది. అయితే, ఇదే సమయంలో వివిధ రకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వాటిని దీపాలు ఆకర్షిస్తాయి. ఆ దీప కాంతి వేడికి అవి అక్కడే ఆగిపోతాయి. అందుకే దీపాల్ని వెలిగించడం ఉపయోగకరం. ఆకాశదీపం కూడా అదే విధానం.. దైవం చెడునుంచి రక్షించేది అనేగా భావిస్తాం. దీపం కూడా ఆ పని చేస్తుంది. పూర్వం ఆలయాలు దాదాపుగా ఊరికి అటు చివర్ ఇటు చివర ఉండేవి. చిన్న చిన్న ఊళ్లు ఉండేవి. అక్కడి ఆలయాల్లో ఎత్తుగా వెలిగించి ఉంచే దీపం ఊరంతా కాంతిని పంచడమే కాకుండా కీటకాలను అక్కడే ఆకర్షించి ఊళ్లలోకి వెళ్ళకుండా చేస్తాయి.
పుణ్యస్నానాలు..
ఇక కార్తీక మాసంలో చెప్పుకోవలసింది పుణ్యస్నానాల గురించి. వేకువ జామునే నదీ స్నానం శ్రేష్టం అని చెబుతారు. అందుకే నదుల్లో స్నానాలు చెయదానీ భక్తులు ఉత్సాహం చూపిస్తారు. కార్తీక మాసంలో చలి మొదలవుతుంది. ఆ చలిలో నదీ జలం గోరు వెచ్చగా ఉంటుంది. చలిలో ఆ నీటిలో స్నానం చేయడం శరీరానికి ఎంతో మంచిది. నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా.. ఆ తాజా నీటిలో స్నానం చేస్తే శరీర కండరాలన్నీ చలిని తట్టుకోవడానికి సిద్ధం అయిపోతాయి. భక్త జనకోటి చేసే నదీ స్నానాల్లో ఆధ్యాత్మికత తో పాటు శాస్త్రీయత ముడిపడి ఉంది.
ఉపవాస దీక్షలు..
కార్తీక మాసంలో ప్రతి సోమవారమూ భక్తులు ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉదయాన్నే దేవునికి దీపం వెలిగించి ప్రారంభించే ఉపవాసం సాయంత్రం నక్షత్ర దర్శనం వరకూ కొనసాగిస్తారు. నక్షత్ర దర్శనం తరువాత ఫలహారం తో ఉపవాసాన్ని విరమిస్తారు. కనీసం వారానికి ఒకసారైనా ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుందని ఆధునిక ప్రపంచంలో డాక్టర్లు చెబుతున్నారు. కార్తీకంలో చేసే ఉపవాస దీక్షలు అలా ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తున్నాయి.
వనభోజనాలు..
కుటుంబ సభ్యులు.. బంధు మిత్రులు అందరితో కల్సి ఒకరోజంతా ప్రకృతి సమక్షంలో ఆనందంగా గడిపి రావడమే వనభోజనాలు. కార్తీక మాసంలో ఈ వనభోజనాల ద్వారా అందరి మధ్య సత్సంబంధాలు మరింత గట్టి పడతాయి. అంతే కాదు ప్రకృతి ఒడిలో ఒక రోజంతా గడిపితే వచ్చే మానసిక ఉల్లాసం ఇక ఏవిధమైన వినోడంలోనూ రాదు. అందుకే కార్తీక మాసం వనభోజనాల కోసం ఎక్కువగా ప్రజలు ఆరాట పడతారు.
ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా ఉసిరిచెట్టుకు ఎనిమిది దీపాలు పెట్టి, ఎనిమిది ప్రదక్షిణలు చేసి... తులసిని పరదేవతా స్వరూపంగా పూజిస్తే.. తులసి అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో పేర్కొన్నారు. అలాగే..కార్తీక మాసంలో శివనామస్మరణతో ఆలయ దర్శనం..ప్రత్యేకమైన తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం రుద్రాభిషేకాలూ, రుద్రపూజలూ, లక్ష బిల్వ దళాల పూజలూ, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలూ నిర్వహించడం ద్వారా మాసమంతా ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతూ ఉంటాయి.
కార్తీక మాస ప్రారంభం సకల శుభాలకు వేదిక. ఈనెలలో చేసే ప్రతి కార్యక్రమం విశిష్టమైనదే. ఉదయాన్నే స్నానం చేసి దీపం వెలిగించడం దగ్గర నుంచి సాయంత్రం దీపం వెలిగించి చేసే ప్రార్థనల వరకూ ప్రతి రోజూ ఆధ్యాత్మికత తో పాటు మానసికంగా కూడా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అందుకే కార్తీక మాసం అత్యంత ప్రాధాన్యత గల మాసంగా వెలుగులీనుతోంది.