Hemavathi Siddeshwara Alayam History: అబ్బుర పరిచే 'హేమావతి'

Hemavathi Siddeshwara Alayam History: దేశంలో ఉన్న హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలా ఎంతో ప్రాముఖ్య ఉన్న ఆలయాల్లో ఈ సిద్దేశ్వరాలయం కూడా ఒకటి

Update: 2020-07-16 06:24 GMT
Hemavathi Siddeshwara Alayam History

Hemavathi Siddeshwara Alayam History: దేశంలో ఉన్న హిందూ ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అలా ఎంతో ప్రాముఖ్య ఉన్న ఆలయాల్లో ఈ సిద్దేశ్వరాలయం కూడా ఒకటి. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలయ విశిష్టత

గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలాతో కొలువైన సిద్ధేశ్వరుడి జటాజూటాన సూర్య,చంద్రులు కనిపిస్తారు. ఎడమ చేత బ్రహ్మకపాలాన్ని, దక్షిణ హస్తాన జపమాలను ధరించి అర్థనిమీలిత నేత్రుడై ఉంటాడు స్వామి. ఇలా శివుడు విగ్రహరూపంలో ఆశీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలో ఇదొక్కటే నంటారు స్థానికులు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే......ఆలయంలో సిద్ధేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నంది ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్టుగా కాకుండా ప్రక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై కనిపించే చోళ రాజుల శిల్ప కళా చాతుర్యం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. రామాయణ, మహాభారత గాథలు ఇక్కడ జీవం ఉట్టి పడేలా చెక్కారు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు, కోటి నందులు ఉండేవని చెబుతారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఇప్పటికీ త్రవ్వకాలలో అక్కడక్కడా సందులు, లింగాలు బయటపడు తుంటాయి. సిద్ధేశ్వరాలయానికి ఉన్న మరో ప్రత్యేకత....... శివరాత్రి రోజున గర్భగుడిలోని మూల విరాట్ సిద్ధేశ్వర స్వామి నుదుట సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. పడమటి ముఖ ద్వారం కలిగిన ఈ ఆలయ ప్రాగణంలో ఉన్న కోనేరులో ఇరవై ఏళ్ల క్రితం వరకు నీరు సప్త వర్ణాల్లో కనిపించేదని, ఇందులో స్నానం చేసి స్వామి వారిని ఆరాధిస్తే సంతానంకలుగు తుందని సర్వ రోగాలు నయ మవుతాయని భక్తులు విశ్వసించే వారు. ఇప్పటికీ అనేక మంది వ్యాధి పీడితులు ఈ కోనేటిలో స్నానం చేస్తుంటారు.

చారిత్రక ప్రాముఖ్యము

ఇందులోని శిల్ప కళ చాల విశిష్టమైనది. ఏడవ శతాబ్దానికి చెందిన ఆలయమిది. ఈ ప్రాంతాన్ని అప్పట్లో నొళంబ రాజులు పాలించారు. అందుకే ఈ స్వామిని నొళంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు. హెంజేరు సామ్రాజ్యంలో అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని చిత్ర దుర్గ, కోలారు, తమిళనాడు లోని ధర్మపురి, సేలం జిల్లాలోని 32 వేల గ్రామాలు ఉండేవని ఇక్కడ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఈ స్వామి నొళంబ రాజ వంశీకుల కులదైవం. వీరి వంశానికి చెందిన చిత్ర శేఖర, సోమ శేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తున్నది. తమకు సంతానం కలిగితే విగ్రహ రూపాన శివాలయం నిర్మిస్తామని వారు మొక్కు కున్నారట. అనంతర కాలంలో వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. సిద్దేశ్వరుడితో పాటు వారు మరో నాలుగు శివలింగాలను దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, సోమేశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. వాటిలో మూడు ఆలయ ప్రాంగణలోనే ఉండగా, నాలుగోది ఊళ్లోని మరో శివాలయంలో ఉంది. భైరవ రూప ధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వరాలయంగా పేరు వచ్చింది.

పూజలు.... అభిషేకాలు

ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు ధూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు తాము పండించిన పంటల నుంచి కొంత భాగాన్ని మొక్కుబడిగా ఇందులో వేస్తారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మిక. ఈ ఆలయానికి భక్తులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి కూడా వస్తుంటారు. రోజూ త్రికాల పూజలు నిర్వహిస్తారు. ఏటా శ్రావణ మాసంలో నిర్వహించే ఎడగ జాతరకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో 45 రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక, మార్గశిర పౌర్ణమి దినాల్లో లక్ష దీపోత్సవం, పూల రథోత్సవం, సిరిమాను ఉత్సవం, వసంతోత్సవాలను వేడుకగా చేస్తారు. ఇక మహా శివరాత్రి సందర్భంగా అయితే ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. నిత్యం ఆ సిద్ధేశ్వరుడికి రుద్రాభిషేకం, పంచామృత స్నానం, బిల్వార్చన, భస్మ అర్చన, ఆకు పూజ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపిస్తారు.

ఈక్షేత్రము ఎక్కడ ఉన్నది?

అనంతపురం నుంచి పెనుకొండ, మడకశిర, బసవనపల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హేమావతికి చేరుకోవచ్చు. అది కాకుండా ఇటు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, కుందుర్పి, నాగేపల్లిగేట్‌ మీదుగా 120 కి.మీ ప్రయాణించి అమరాపురం, ఇక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణిస్తే హేమావతి ఆలయం వస్తుంది. అంతే కాక అమరాపురం నుంచి ఆటోలు, బస్సులు హేమావతికి వెళుతుంటాయి. 

Tags:    

Similar News