Sabarimala yatra 2020: ఈ సంవత్సరం శబరిమల యాత్రకు కేరళ సర్కారు ఓకే... నిబంధనలివే!
Sabarimala yatra 2020:శబరిమల యాత్రకు కేరళ సర్కారు నిబంధనలతో పచ్చ జెండా ఊపింది.
కరోనా వైరస్ ఎక్కడికక్కడ అన్నిటినీ నిలిచిపోయేలా చేసింది. ఈ నేపధ్యంలో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివెళ్లె శబరిమల యాత్రకు బ్రేకులు పడతాయని భావించారు అందరూ. అయితే, కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం యాత్రను నిర్వహించడానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 16 నుంచి యాత్ర మొదలు అవుతుందని ఆ రాష్ట్ర మంత్రి సురెంద్రన్ చెప్పారు. అయితే, కోవిడ్ కు సంబంధించిన జాగ్రతలు అన్నీ తీసుకుంటామని, నిబంధనలు పాటించిన భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సంవత్సరం శబరిమల యాత్రకు భక్తులను అనుమతించేందుకు కేరళ సర్కారు ఆమోదం తెలిపింది. దర్శనాలను కరోనా నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కదకంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుందని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబుల్లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని అన్నారు.
సోమవారం నాడు యాత్ర నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన, ఆపై దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిటల్స్ లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని తెలిపారు. అత్యవసర సేవల కోసం ఓ హెలికాప్టర్ ను సిద్ధం చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న పథనంతిట్ట కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు.