తల్లి, తండ్రి, గురువు, దైవం అని మన సంస్కృతి ఎందుకంటుంది. ఒక్కొక్కరు దీని అర్ధాన్ని ఒక్కో విధంగా చెబుతుంటారు. మాతా, పితా, గురు, దైవం అని అన్నప్పుడు, తల్లి, తండ్రి, గురువు, దైవం అని అర్ధం. ఈ మాటని సరైన విధానంలో తెలుసుకోవడం ముఖ్యం. మీరు పసిబిడ్డగా ఉన్నప్పుడు మీ జీవితంలో అత్యంత ప్రధానం కలిగిన వ్యక్తి ఎవరు? దేవుడైతే కాదు, గురువు కూడా కాదు, తండ్రీ కాదు. ఆ సమయంలో తల్లి ముఖ్యం. మీకు పాలు ఇవ్వడానికి, దగ్గరకు తీసుకొవడానికి, ముద్దాడడానికి ఇంకా పోషణ అందించడానికి కావలసింది అమ్మ. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. పుట్టిన పసికందుకి అందరికన్నా కన్నతల్లి ఎంతో అవసరమని జీవితమే గుర్తుచేస్తుంది.
ఎప్పుడైతే పిల్లవాడు నడక మొదలుపెడతాడో, తండ్రి ముఖ్యం అవుతాడు. ఎందుకంటే, లౌకిక విషయాలు ఆయనకి బాగా తెలుసు కాబట్టి. దీన్ని ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి చూడకండి. ఆరోజుల్లో పిల్లవాడు ప్రపంచం గురించి, జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి లేక సమాజంలో ఏ విధంగా నడచుకోవాలో తెలలుసుకోవాలంటే అది తండ్రి ద్వారానే సాధ్యం అయ్యేది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ జరుగుతాయో, ఉన్నతమైన అవకాశాలని తెలుసుకోవడానికి ఒక గురువు తప్పనిసరి. మీరు ఈ ఉన్నతమైన అవకాశాన్ని అన్వేషించినట్లయితే, దైవం సహజంగా ఆవిష్కారం అవుతుంది.
ఒకవేళ తల్లిదండ్రులు ఇంకా పరిపక్వత చెందకపోతే, వారికి దారి చూపించే పిల్లలు ఉంటే అది ఎంతో అదృష్టం. మాతా, పితా, గురు, దైవం అని వారు అన్నప్పుడు, సహజమైన జీవన ప్రక్రియను గురించి ఒక్క మాటలో చెబుతున్నారు. సంస్కృతం గురించి మిడి మిడి జ్ఞానంతో ఉన్నవారు ఈ వాక్యాన్ని వారికి తోచిన రీతిలో అనువాదిస్తున్నారు "ముందు మాతా అన్నారు కాబట్టి. నీ జీవితం నాకే అంకితం అవ్వాలి." అని తల్లి అంటుంది. తండ్రి ఏమంటాడంటే "నేను రెండో స్థానంలో ఉన్నాను కాబట్టి నీ జీవితం నాకు అంకితం. గురువు, దైవం వైపుకు వెళ్ళవలసిన అవసరం లేదు" అని. ఒకవేళ ప్రజలు ఈ విధంగా చెబుతున్నారంటే అది దురదృష్టకరం. ఎందుకంటే మీ తల్లి దండ్రులు కూడా ఇంకా మీలాంటివారే. వారు కూడా ఎదగాలి. వారు మీకన్నా ముందే పరిణామం చెంది ఉండాల్సింది. ఒకవేళ తల్లిదండ్రులు ఇంకా పరిపక్వత చెందకపోతే, వారికి దారి చూపించే పిల్లలు ఉంటే గనక అది ఎంతో అదృష్టమే. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
గురువు అంటే ఒక సాధనం, పరానికి చేరుకోవడానికి ఒక ద్వారం. ఎప్పుడైతే ద్వారం గుండా మీరు ఆవల ఉన్నదాన్ని చూస్తారో, అప్పుడు ఆ ద్వారం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే మీరు ఆవల ఉన్నదాన్ని చూడడానికి ఆ ద్వారం సహాయపడింది కదా. తన అవతల ఉన్నటువంటి సంభావ్యతలను అందించగల కారణం చేతనే గురువుకు అంత ప్రాముఖ్యత. ద్వారం అనేది బయటకి వెళ్లేందుకు దారిని కల్పిస్తుంది కాబట్టి మీకు అది ముఖ్యం.