శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి. కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే! కృష్ణాష్టకమ్, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.
కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి, కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.