Karni Mata Temple: ప్రపంచంలోని వింతైన దేవాలయాలలో కర్ణి మాత ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో వచ్చి పోయే భక్తుల పంఖ్య కంటే ఎక్కువగా ఎలుకల సంఖ్యే ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20వేల ఎలుకలు ఈ ఆలయంలో వచ్చిపోయే భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎవరికీ హాని కలిగించవు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలని ఉంది కదూ అయితే ఇప్పుడే తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ వద్ద కర్ణి మాతా దేవాలయం ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన దైవం కర్ణిమాత. ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో సుమారు 20,000 నల్ల ఎలుకలు సజీవంగా ఉన్నాయని ప్రసిద్ధి. ఈ ఎలుకలు దేవాలయం అంతా తిరుగుతుంటాయి. అయితే ఈ ప్రసిద్ధ ఎలుకలను అక్కడి వారు కబ్బాలు అని పిలుస్తారు. ఈ ఎలుకలను దైవత్వం ఉన్న ఎలుకలుగా ఆ గ్రామస్థులు పూజిస్తారట. ఈ దేవాలయాన్నిసందర్శించడానికి అనేక మంది యాత్రికులు వస్తూంటారు. ఆసక్తి గల పర్యాటకులు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.
అసలు కథ..
కర్ణిమాతా పెంపుడు కుమారుడు లక్ష్మణ్ కోలయత్ తెహసీల్ లోని కపిల్ సరోవర్ వద్ద సరస్సులో నీరు తాగుతూ పడిపోతాడు. అప్పుడు కర్ణిమాత యమునితో ఆయనను కాపాడమని కోరుతుంది. మొదట యముడు అందుకు తిరస్కరించినా చివరికి మనసు మార్చుకొని లక్ష్మణ్ తో పాటు కర్ణిమాతకు పుట్టిన మగ సంతానాన్ని ఎలుకలుగా పునర్జన్మ యిస్తాడు.
కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని చరిత్ర చెపుతుంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం. తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారట. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి, నాటి నుంచి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట.
ఆ సమయంలో కర్ణిమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తర్వాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట.
మరో కథనం ప్రకారం 20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది. ఇక్కడికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలు అని తెలుసుకున్న వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు.
ఆలయ నిర్మాణ శైలి
ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి. ఈ ఆలయానికి వెండి ద్వారాలు, నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్‌కు చెందిన కర్ణి ఆభరణ తయారీదారులు ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి.
ఆలయంలో తెల్ల ఎలుకలు
వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపించడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్‌లో పడి చనిపోయాడు. కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట.
ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని, ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక. అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం.
ఆరాధన, ఉత్సవాలు
కర్ణిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి, మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ, ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి.
కర్ణిమాతా ఉత్సవాలు
మార్చి - ఏప్రిల్ నెలలలో నవరాత్రులు (చైత్ర శుక్ల ఏకాదశి నుండి చైత్ర శుక్ల దశమి).
సెప్టెంబరు - అక్టోబరు నెలలలో నవరాత్రులు (ఆశ్వయుజ శుక్ల ఏకాదశి నుండి ఆశ్వయుజ శుక్ల దశమి వరకు).