Sri Mukha lingeswara Temple : ఇప్ప చెట్టు నుంచి ఉద్భవించిన శివయ్య

Update: 2020-08-27 05:05 GMT

Sri Mukha lingeswara Temple

Sri Mukha lingeswara Temple :  శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.

చరిత్ర

ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.

ఆలయ విశేషాలు

"శ్రీముఖలింగం" పేరులోనే చక్కని అర్ధం ఉంది. "శ్రీముఖలింగం" అనే పదానికి "పరమేశ్వరుడు లింగంలో కనిపించుట" అని అర్ధం. ఈ దేవాలయం లోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకున్న తరువాత ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. శ్రీముఖలింగేశ్వరంలో మూడు చోట్ల ముక్కోణపు ఆకారంలో మూడు ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు మధుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్స్, పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేసారు. దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాలకు కాస్త దూరంగా ఊరి ప్రథమార్ధంలో అధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్ఠితమైన లింగాన్ని శ్రీముఖలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయంపై సుమారు 100 సంవత్సరముల క్రిందట పిడుగు పడింది. పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ మూడు ఆలయాల్లోనూ శిల్ప కళాసంపద చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చాణుక్య శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయాలు క్రీ.శ. 573-1058 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించారని చరిత్రకారులు చెపుతుంటారు.

స్థల పురాణం

ఒకప్పుడు హిమాలయాలమీద గొప్ప వైష్ణవయాగం జరిగింది. ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాలమీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి " సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి" అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి. రెండవ భార్య చిత్కళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేదికాదు. చీటికీ మాటికీ కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను చేరి "నీతో ఉంటే నేనైనా ఉండాలి...లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు" అని నిలదీసింది. శబర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను పిలిచి తమ వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక, ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజూ ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని తలచి, ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబర నాయకుడు మూర్ఛబోయాడు. దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు.

మధుకేశ్వరాలయం

ఇక్కడ ముఖలింగాలయాన్ని "మధుకేశ్వరాలయం" అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు.

ఆలయంలో శిల్పకళ

ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం. భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.

సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే, మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి. ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.

ఆలయ ప్రాంగణంలో శిల్ప సంపద ఏక రాతిపై కనిపించి చూపరులను ఆకట్టుకుంటాయి. అరుణాచలంలో నిర్మాణమైవున్న శిల్ప సంపదను తలపించే విధంగా ఆలయంలో పార్వతీ పరమేశ్వరుని శిల్పాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశం అక్కడ అరుణాచలంలోను, శ్రీముఖ లింగంలోను తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. శివపార్వతులు ఎరుపు రంగు రాతిపై ఉత్తర ముఖంగా ఉండడం విశేషం. గర్భగుడిలో ఒక చోట కూర్చుని చూస్తే గణపతి, సూర్యనారాయణ, అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు కనిపిస్తారు. అందుకే దీనిని పంచాయత క్షేత్రమని పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రీముఖ లింగంలో అష్టగణపతులున్నారు. వ్యాసమహర్షి భారతముతోపాటు పంచమవేద గ్రంథాలు వ్రాయుటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్ఠించి ప్రారంభించినట్టు దీనితోపాటు శక్తిగణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి (నాట్య), సిద్ధి గణపతులు దర్శనం ఇస్తారు. ఇక్కడ కోటి లింగాలకు ఒకటి తక్కువ అని చరిత్ర చెబుతుంది.

చరిత్ర

ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం

6, 4, 8వ శతాబ్దాల నాటి ఆలయాలు

శ్రీముఖ లింగంలో ఆలయాలు 6,4,8వ శతాబ్దాలలో నిర్మాణాలు జరిగినట్టు శాసనాల్లో ఉన్నాయి. ఆరవ శతాబ్దంలో ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని, నాలుగో శతాబ్దంలో భీమేశ్వర ఆలయం, ఎనిమిదో శతాబ్దంలో సోమేశ్వర ఆలయాలు నిర్మించబడ్డాయి. కొంతకాలం అనంతరం శిథిలమైన ఆలయాలను రెండువందల ఏళ్ల క్రితం పర్లాకిమిడి మహారాజ్ గజపతి వంశీయులు పునర్నిర్మించారు. అప్పటినుంచి వారి సమక్షంలో ఆలయ సంరక్షణ జరుగుతోంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కార్యక్రమాన్ని నేటికీ మహారాజ వంశీయులు నిర్వహిస్తుంటారు.

స్వప్నేశ్వర లింగం

ఇటీవలి కాలంలో ఇళ్ల నిర్మాణం కోసం ఒక వ్యక్తి తవ్విన పునాదుల్లో స్వప్నేశ్వర లింగం బయటపడింది. శతాబ్దాల క్రితం ఇక్కడ స్వప్నేశ్వర ఆలయం ఉండేదని చరిత్ర ద్వారా రుజువైంది. ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా ఈ స్వామిని దర్శిస్తే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News