Punyagiri Temple : నాడు పాండవుల ఆవాసం.. ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం

Update: 2020-09-08 04:31 GMT

Punyagiri Temple : భారత దేశంలో ఉన్న శైవక్షేత్రాల్లో పుణ్యగిరి ప్రముఖమైనది. ఇటు ప్రకృతి రమణీయతకు, అటు ఆధ్యాత్మిక శోభకు ఆలవాలం ఈ క్షేత్రం. ఇక్కడ స్నానమాచరించి ఉమా కోటిలింగేశ్వరస్వామిగా వెలసిన పరమేశ్వరుణ్ని దర్శించుకుంటే సర్వపాపాలు వైదొలగుతాయని భక్తుల నమ్మకం. కార్తిక మాసం వచ్చిందంటే ఈ క్షేత్ర పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతాయి. వనభోజనాలకు వచ్చేవారితోను, పరమేశ్వరుని దర్శనంతో జన్మను పునీతం చేసుకోవాలన్న తలంపుతోను వచ్చే భక్తజనులతో క్రిక్కిరిసిపోతుంది పుణ్యగిరి.

ఎత్తయిన కొండలు, వాటి మధ్యలో జలజలపారే జలపాతాలు, అంబరాన్నంటే వృక్ష సముదాయంతో కనువిందు చేసే పచ్చటి ప్రకృతి మధ్య ఉంది పుణ్యగిరి ఆలయం. ఇటు ప్రకృతి రమణీయతకు, అటు ఆధ్యాత్మిక శోభకు ఆలవాలం ఈ క్షేత్రం. పచ్చటి ప్రకృతి మధ్య కొండలపై పరమేశ్వరుడు ఉమా కోటిలింగేశ్వరస్వామిగా వెలసి భక్తుల నీరాజనాలందుకుంటున్న అద్భుత పుణ్యక్షేత్రం. ఇక్కడ స్నానమాచరించి ఉమా కోటిలింగేశ్వరస్వామిగా వెలసిన పరమేశ్వరుణ్ని దర్శించుకుంటే సర్వపాపాలు వైదొలగుతాయని భక్తుల నమ్మకం. దక్షిణకాశిగా పేరొందిన ఈ క్షేత్రంలో పూర్వం ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసుకొంటూ శివుడ్ని ఆరాధిస్తూ ఉండేవారట.శివరాత్రి పర్వదినాన ఇక్కడి జలధారల క్రింద స్నానమాచరించి పరమేశ్వరుని దర్శించుకొని, జాగరణ చేసినట్టయితే సర్వపాపాలూ తొలగిపోవడమే కాకుండా కైలాసప్రాప్తి లభిస్తుందని భక్తజనుల నమ్మకం. ఆ క్రమంలోనే శివసాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివుడు లింగరూపంలో వెలిసాడని ఒక కథనం. పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలని శృంగవరపుకోటకు పశ్చిమ దిశను ఎత్తయిన కొండలలో (తూర్పు కనుమలు) ఉంది. ఈ గ్రామం విజయనగరానికి 35 కి.మీ. దూరంలో, శృంగవరపుకోటకు 4 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.

దేవాలయం చరిత్ర

ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి.దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవాలయం విజయనగరం జిల్లా శృంగవరపుకోట సమీపంలో ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో లో ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం. ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది. అలనాటి పాండవుల ఆవాసమే ఈ పుణ్యగిరి క్షేత్రం. మహాభారత కాలంలో పాండవులు జూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి 13 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేశారు. పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్‌రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది. ఆ సమయంలో పాండవులు ప్రతి రోజూ ఇక్కడ జలధారలలో స్నానమాచరించి, పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం. ప్రస్తుతం ఈ దేవాలయం సకల సౌకర్యాలతో భక్తులకు కనువిందు చేస్తోంది. కోటి లింగాల రేవులో ఉన్న శివలింగాల మీద పైనుంచీ నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కొండపైకి చేరుకున్న తరువాత పుట్టధార వస్తుంది. ఈ ధార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాల్ని తాకుతూ వస్తుంది. ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.మహా శివరాత్రి రోజున జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్టయితే సర్వపాపాలు తొలగిపోవడమేగాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.

పౌరాణిక కథనం

తన కాముకత్వంతో మారువేషంలో ఉన్న ద్రౌపదిని కోరుకున్న కారణంగా భీముని చేతిలో మరణిస్తాడు విరాటరాజు బావమరిది అయిన కీచకుడు. అప్పుడు సోదరుడి మరణంతో అపరిమితంగా శోకిస్తుంది విరాటరాజు భార్య, కీచకుని సోదరి అయిన సుధేష్ణాదేవి. ఆమె శోకం తీర్చడానికి ఆమె ఇష్టదైవమయిన పరమేశ్వరుడు తన జటాఝూటం విసిరి ధారగా జలాన్ని పుట్టించాడని, అదే కాలక్రమంలో పుట్ట్ధురగా ప్రాచుర్యంలోకొచ్చిందని భక్తుల నమ్మకం. ఇక ఇక్కడ మరొక విశిష్టత అస్థిక మంటపం. ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వదిశలో ఉంటాయి. పైనుంచి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలోనే చనిపోయిన వారి అస్తికలను నిమజ్జనం చేసి పితృకార్యాలు చేస్తుంటారు. అందుకనే దీనికి అస్తిక మంటపంగా పేరు స్థిరపడింది. ప్రస్తుతం మనం శృంగవరపుకోట అని పిలుచుకుంటున్న ప్రాంతంలోనే కీచకుడి కోట ఉండేదని దానిని అతడు తన శృంగార కార్యకలాపాలకు వినియోగించుకునేవాడని, కాలక్రమేణా ఆ కోటే శృంగారపుకోటగా ఆ తరువాత శృంగవరపుకోటగా

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మూడు రోజుల పాటు ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువగా శివరాత్రి రోజు, ఆ మరుసటి రోజు భక్తులు శ్రీఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. దాదాపుగా ఈ మూడు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచన.

రవాణా సౌకర్యం

ఈ దేవాలయానికి రవాణా సౌకర్యం ఉంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి శృంగవరపుకోట వరకు బస్సు సౌకర్యం ఉంది.అక్కడ నుంచి ఆటోలో వెళ్ళవచ్చు.శివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

Tags:    

Similar News