Ketaki Sangameshwara Temple : కేతకి అనే అప్సరస మొగలి వనంగా మారింది ఇక్కడే

Update: 2020-08-16 07:42 GMT
Ketaki Sangameshwara Temple

Ketaki Sangameshwara Temple : భారత దేశంలో ప్రతి ఒక్క గ్రామంలో ఏదో ఒక మందిరం ఉంటుంది. ఆ ఒక్కొక్క దేవాలయాది ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇటుంటి కోవకు చెందినదే తెలంగాణలోని కేతకి సంగమేశ్వర దేవాలయం. ఈ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా శివుడికి ఇక్కడ మొగలి రేకుతో పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నీటి గుండం నుంచి పూజా విధానం వరకూ అన్ని విశిష్టతలే. శతబ్దాల చరిత్ర ఉన్న మెదక్ జిల్లా సంగమేశ్వరాలయానికి ఎంతో ప్రశస్తి వుంది. సాధారణంగా ఆలయానికి ముందు భాగంలో కొనేరు వుంటుంది. దీనిని చూడటానికే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ నీటి గుండంలో అద్భుతమే జరుగుతుంది.ఈ దేవాలయం గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు.

స్థలపురాణం..

స్కాంద పురాణం ప్రకారం: పూర్వం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకీ వనంగా అనగా మొగలి వనంగా మారిందట. ఒకసారి బ్రహ్మ .... కేతకీ వనంలో శివుని గూర్చి తపస్సు చేయగా, శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో అక్కడే వెలిశాడు. అందుకే ఆ క్షేత్రానికి కేతకీ సంగమేశ్వర క్షేత్రమని పేరు. ఈ ఆలయంలో సంగమేశ్వరుడు, కేతకి, పార్వతి సమేతంగా కొలువు దీరి ఉన్నాడు.

ఆలయ విశిష్టత..

ఈ ఆలయ వెనక భాగములో ఒక కోనేరు (గుండం) ఉంది. కాశీలో ప్రవహించే గంగా నది యొక్క ఒక ధార భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మిక. మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. గుండంలో నీరు నిండుగా ఉన్నప్పుడు ఈ రంధ్రం కనబడదు. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేస్తారు. ఆ సమయంలో స్వామి వారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితో బాటు ఆ రంధ్రం గుండా వెళ్లి పోతుంది. అలా ఆ నీరు ఒక సొరంగం లోనికి వెడుతుందని భక్తుల నమ్మిక. నీటితో బాటు నైవేద్యం కూడా లోపలికి వెళ్ళి పోతుంది. కాసేపటికి ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండి పోతుంది. ఇదంతా సంగమేశ్వరుని లీలగా భక్తులు భావిస్తారు. భక్తులు ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వ రోగాలు, పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టుక్రింద ఒక శివ లింగం ఉంది. దానిని కేవలం చేతి వేళ్లతో పైకి లేపితే వారి కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. దీనిని కోరికల లింగం అని అంటారు.

పూజలు..

మరే ఆలయంలో లేనివిధంగా ఇక్కడి శివునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతిరోజు మొగిలి పూలతో అభిషేకం నిర్వహిస్తారు. అన్నపూజ, తమలపాకుల పూజ చేస్తారు. భక్తులు చెరకు ముక్కలతో అర్చన చేస్తారు. మహా శివరాత్రికి, కార్తీక, శ్రావణ మాసాల్లోను, దేవీ నవరాత్రుల్లోను భక్తులు ఎక్కువగా వస్తుంటారు. శివరాత్రికి తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఏటా కార్తీక మాసంలో పార్వతీ సంగమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు చుట్టుప్రక్కల జిల్లాలనుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధికంగా వస్తుంటారు. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల వసతి కొరకు దేవస్థానం వారి గదులు ఉన్నాయి.


  

Tags:    

Similar News