Kandaria Mahadeva Temple : అద్భుత శిల్పకళా వైభవం..కందారియ మహాదేవ ఆలయం

Update: 2020-09-07 04:23 GMT

Kandaria Mahadeva Temple : భారత దేశం అంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, అద్భుతమైన శిల్పకళలు. వీటికి ఒక్కసారి దర్శిస్తే చాలు మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేంత ఆకర్షనీయంగా ఉంటాయి. అంతటి ఆకర్షనీయవంతమైన కట్టడాల్లో కందారియా మహాదేవ మందిరం కూడా ఒకటి. అసలు ఈ కందారియా మహాదేవ మందిరం ఎక్కడ ఉంది. దీని విశిష్టత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. ఖజురహోలోని దేవాలయాల్లో కెల్లా ఈ ఆయలం అత్యంత పెద్దది, గొప్ప శిల్పకళతో కూడుకున్నది. మధ్య యుగంలో నిర్మితమై, చక్కగా సంరక్షించబడీన వాటిలో ఇదొకటి. కందారియా మహాదేవుడు అంటే గుహ దేవుడు అని అర్థం.

భౌగోళిక ప్రదేశం

కందారియా మహాదేవ ఆలయం మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఖాజురాహో గ్రామంలో ఉంది. ఆలయ సముదాయం 6 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఇది గ్రామ పశ్చిమ భాగంలో, విష్ణు ఆలయానికి పశ్చిమాన ఉంది. సముద్ర మట్టం నుండి 282 మీటర్ల ఎత్తున, ఖజురాహో గ్రామంలో ఉన్న ఆలయ సముదాయానికి రోడ్డు, రైలు, వాయు సేవలు చక్కగా ఆందుబాటులో ఉన్నాయి. ఖజురాహో మహోబాకు దక్షిణంగా 55 కి.మీ. దూరం లోను, ఛతర్పూర్ నగరం నుండి తూర్పున 47 కి.మీ., పన్నాకు ఉత్తరంగా 43 కి.మీ., ఝాన్సీ నుండి రోడ్డు మార్గాన 175 కి.మీ., ఢిల్లీకి తూర్పున 600 కి.మీ. దూరం లోనూ ఉంది. ఖజురహో రైల్వే స్టేషన్ నుండి 9 కి.మీ. దూరంలో ఈ దేవాలయం ఉంది. ఖజురహో విమానాశ్రయం ఆలయం నుండి 6 కి.మీ. దూరంలో ఉంది.

చరిత్ర

ఖజురాహో ఒకప్పుడు చందేలా రాజవంశపు రాజధానిగా ఉండేది. భారతదేశంలో మధ్యయుగ కాలం నుండి సంరక్షించబడిన దేవాలయాలకు ఉత్తమ ఉదాహరణలలో ఒకటైన కందారియా మహాదేవ ఆలయం, ఖజురాహో కాంప్లెక్స్‌లోని పశ్చిమ దేవాలయాలలో అతిపెద్దది, దీనిని చందేలా పాలకులు నిర్మించారు. శివుడు ఈ ఆలయ ప్రధాన దేవత. కందారియా మహాదేవ ఆలయం విద్యాధరుడి పాలనలో (క్రీ.శ. 1003-1035) నిర్మించబడింది. ఈ రాజవంశం పాలన యొక్క వివిధ కాలాల్లో విష్ణు, శివ, సూర్య దేవాలయాలతో పాటు జైన తీర్థంకరులు కూడా ఆలయాలు నిర్మించారు. ముస్లిం చరిత్రకారుడు ఇబ్న్-అల్-అతిర్ గ్రంథాల్లో బీదా అని ప్రస్తావుంచిన విద్యాధరుడు 1019 లో జరిగిన మొదటి దాడిలో ఘజ్ని మహముద్‌తో పోరాడిన శక్తివంతమైన పాలకుడు. ఈ యుద్ధం నిశ్చయాత్మకమైనది కాదు. మహమూద్ ఘజ్నికి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మహమూద్ 1022 లో విద్యాధరపై మళ్లీ యుద్ధం చేశాడు. అతను కాలింజర్ కోటపై దాడి చేశాడు. కోట ముట్టడి విజయవంతం కాలేదు. మహమూద్, విద్యాధరులు సంధి కుదుర్చుకుని ఒకరికొకరు బహుమతులిచ్చుకుని విడిపోయారు. విద్యాధర మహమూద్ పైన, ఇతర పాలకులపైనా సాధించిన విజయాలకు గుర్తుగా తన కులదైవమైన శివుడికి కందారియా మహదేవ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంలోని మండపంపై ఉన్న ఎపిగ్రాఫిక్ శాసనాలు ఆలయాన్ని నిర్మించినవారి పేరును విరిమ్దా అని పేర్కొన్నాయి. ఇది విద్యాధరకు మారుపేరుగా భావిస్తారు. దీని నిర్మాణం క్రీ.శ 1025 -1050 మధ్య జరిగింది.

ఆలయ విశేషాలు

కందారియా మహాదేవ ఆలయం, 31 మీటర్ల ఎత్తుతో, పశ్చిమ సముదాయంలో ఉంది. పశ్చిమ సముదాయం, ఖజురాహో కాంప్లెక్స్ లో ఉన్న మూడు సమూహాలలో అతిపెద్దది. కందారియా, మాతంగేశ్వర, విశ్వనాథ దేవాలయాలతో కూడిన ఈ పశ్చిమ దేవాలయాలు శివుని యొక్క మూడు రూపాలను సూచిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం పోర్చ్‌లు, టవర్లతో కలిసి శిఖరంతో ముగుస్తుంది. ఈ లక్షణం 10 వ శతాబ్దం తరువాతి కాలం నాటి మధ్య భారతదేశ దేవాలయాలలో సాధారణంగా కనిపిస్తుంది.

ఈ ఆలయాన్ని 4 మీటర్ల ఎత్తున్న భారీ పీఠంపై స్థాపించారు. పీఠం పైన ఉన్న ఆలయ నిర్మాణం సమర్థవంతంగా, ఆహ్లాదకరంగా నిర్మించారు. సూపర్ స్ట్రక్చర్ నిటారుగా ఉన్న పర్వత ఆకారంలో నిర్మించారు. ఇది మేరు పర్వతానికి ప్రతీక. ఈ పర్వతం సృష్టికి మూలం అని పౌరాణిక ప్రశస్తి. సూపర్ స్ట్రక్చర్ బాగా అలంకరించబడిన పైకప్పులను కలిగి, శిఖరంతో ముగుస్తుంది. దీనికి 84 సూక్ష్మ కలశాలున్నాయి. ఈ ఆలయాన్ని 31 మీ. పొడవు, 20 మీ. వెడల్పూ ఉన్న ప్రదేశంలో నిర్మించారు. దీనిని "ఖజురాహో యొక్క అతిపెద్ద, అత్యంత గొప్ప ఆలయం" అని భావిస్తారు. కింది నుండి ఆలయ ప్రవేశద్వారం వరకు ఎత్తైన మెట్ల వరుస ఉంది. ప్రవేశద్వారం వద్ద ఒకే రాతిలో చెక్కిన తోరణం ఉంది. ఇటువంటి ప్రవేశ ద్వారాలు హిందూ వివాహ ఊరేగింపులో కనిపిస్తాయి.

గర్భ గృహం మధ్యభాగంలో ఒక శివలింగం ఉన్నది. ఈ ఆలయగోపురం 100 మీ. పైన ఎత్తు కలిగి ఉన్నది. ఈ ఆలయం గర్భ గృహ, అర్థమండప, ప్రదక్షిణలు మరియు మహామండప అనే ఐదు భాగాల నిర్మాణ శైలి లో రూపొందించబడింది. ఈ ఆలయం లోపలిభాగంలో ప్రత్యేకంగా రూపొందించిన సున్నితమైన నమూనాల తోరణాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ ప్రధాన విభాగం చెక్కిన మరియు రూపకల్పన అనేక చిత్రాలతో అలంకరించబడి, కళాకారుని గొప్ప శిల్పనైపున్యానికి ఉదాహరణగా నిలిచి ఉన్నది.

Tags:    

Similar News