Buddhas Of Bamiyan : 1500 ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహాలు ఏవంటే ?

Update: 2020-09-09 05:27 GMT

Buddhas Of Bamiyan : బమియాన్ బుద్ధ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్ లోని ఆరవ శతాబ్దానికి చెందిన పెద్ద బుద్ధ విగ్రహాలు.అంటే సుమారుగా ఆ విగ్రహాలకు 1500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హజరాజత్ అనే ప్రాంతంలో బమియాన్ లోయ దగ్గర ఇసుకరాతి కొండల్లో చెక్కబడ్డాయి. ఈ ప్రదేశం కాబూల్ కు 213 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిల్పాలు గాంధార శిల్పకళ పద్ధతిలో చెక్కారు.

బమియాన్‌ అనేది హిందుకుష్ పర్వత ప్రాంతంలో ఓ అందమైన లోయ. ఇక్కడ ఎన్నో బుద్ధవిగ్రహాలున్నాయి. అందమైన గుహలున్నాయి. ఈ శిల్పాలు కుషాణుల కాలం నాటివి. ఇక్కడి శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకులోనై పాడయ్యాయి. బమియాన్‌లోని రెండు పెద్ద విగ్రహాలను 2011 లో తాలిబన్లు, తమ నాయకుడు ముల్లా ఒమర్ ఆదేశానుసారం ధ్వంసం చేసారు.

చరిత్ర

బమియాన్ హిందూకుష్ పర్వతాల గుండా సాగిపోయే సిల్కు రోడ్డులో ఉంది. చారిత్రికంగా సిల్కు రోడ్డు చైనాను పాశ్చాత్య దేశాలతో కలిపే బిడారు వర్తకుల మార్గం. బమియాన్ అనేక బౌద్ధారామాలు వెలసిన ప్రదేశం. ఆధ్యాత్మికత, తాత్వికత, కళలూ విలసిల్లిన స్థలం. బమియాన్ కొండల్లో తొలిచిన గుహల్లో బౌద్ధ సన్యాసులు నివసించేవారు. సన్యాసులు ఈ గుహలను విగ్రహాలతో రంగురంగుల కుడ్య చిత్రాలతో అలంకరించేవారు. రెండవ శతాబ్ది నుండి 7 వ శతాబ్దిలో ఇస్లామిక దండయాత్రల వరకూ అది బౌద్ధ ఆధ్యాత్మిక స్థలంగా ఉండేది. 9 వ శతాబ్దిలో పూర్తిగా ముస్లిముల ఆక్రమణలోకి వెళ్ళేవరకూ బమియాన్‌లో గాంధార సంస్కృతి విలసిల్లింది.

అన్నిటికంటే ప్రముఖమైనవి నిలబడిన భంగిమలో ఉన్న వైరోచనుడు, శాక్యముని విగ్రహాలు. పెద్ద విగ్రహాన్ని స్థానికులు సోల్‌సోల్ అని పిలిచేవారు. ఇది 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీన్ని ముందుగా రాయితో చెక్కి దానిపై మట్టీ గోధుమ గడ్డితో చేసిన మిశ్రమాన్ని పూశారు. దానిపై జిప్సమ్‌ ప్లాస్టర్‌ వేశారు. ఆపై రంగులూ వస్త్రాలతో అలంకరణలున్నాయి. ఈ విగ్రహం చుట్టూ ఉన్న గోడలపైనా అందమైన చిత్రాలున్నాయి. బంగారు రథంపై దూసుకెళ్తున్న సూర్యభగవానుడూ అతడి చుట్టూ ఎగిరే పక్షులూ అప్సరసలూ ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ గుహ వెనక ఓ పెద్ద సభామంటపం కూడా ఉంది.

1969, 1976 మధ్య భారత ప్రభుత్వ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్‌.సేన్‌గుప్తా నాయకత్వంలో ఈ గుహలను పునరుద్ధరించింది. 35 మీటర్ల ఎత్తున్న చిన్న విగ్రహాన్ని షామామా అని పిలుస్తారు. ఈ విగ్రహాలున్న గుహల ఎత్తు 58 మీటర్లు, 38 మీటర్లు ధ్వంసం చెయ్యకముందు ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద నిలబడిన భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహాలు. ఈ విగ్రహాలను కూల్చేసాక, చైనాలో 128 మీటర్ల వైరోచన బుద్ధుని విగ్రహాన్ని నిర్మించారు.

చిన్న బుద్ధ విగ్రహాన్ని కీ.శ 544 - 595 లలో నిర్మించగా, పెద్ద విగ్రహాన్ని కీ.శ 591 - 644 మధ్య నిర్మించారు. పెద్ద విగ్రహం దీపాంకర బుద్ధుణ్ణి తలపిస్తుందని కూడా చెబుతారు. ఈ ప్రాంతంలో ఈ విగ్రహాలు అత్యంత ప్రసిద్ధి చెందినవి. ఈ స్థలాన్ని యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది కాలక్రమంలో వాటి రంగు వెలిసిపోతూ వచ్చింది.

కీ.శ 630 ఏప్రిల్ 30 న చైనా యాత్రికుడు షువాన్‌జాంగ్ ఈ స్థలాన్ని సందర్శించాడు. పదికి మించిన ఆరామాలు, పదివేల పైచిలుకు సన్యాసులతో పరిఢవిల్లిన బౌద్ధ మత కేంద్రంగా దాన్ని అభివర్ణించాడు. బుద్ధ విగ్రహాలు బంగారంతోటి, రత్నాలతోటీ అలంకరించారని కూడా అతడు రాసాడు. వీటికంటే పెద్దదైన మూడో విగ్రహం, పడుకున్న స్థితిలో, కూడా అక్కడ ఉన్నట్లు అతడు రాసాడు. ఇక్కడి విగ్రహాలకు సరిపోలే, కూర్చున్న స్థితిలో ఉన్న, విగ్రహం చైనాలోని గన్‌షు ప్రావిన్సులో బింగ్‌లింగ్ దేవాలయ గుహల్లో ఉంది.

ఈ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో ఉన్న కక్రక్‌ వ్యాలీలోని బుద్ధవిగ్రహమూ తాలిబన్ల దాడుల్లో రూపు కోల్పోయింది. ఈ ప్రాంతంలో గుహలన్నింటినీ మహ్మద్‌ గజనీ కొల్లకొట్టాడు. ఆ తరువాతే ఇక్కడ బౌద్ధం నెమ్మదిగా క్షీణించింది. ఇస్లాం విస్తరణ ఊపందుకుంది.

బుద్ధ విగ్రహాలపై దాడులు

11 - 20 శతాబ్దాల మధ్య

1221 లో చెంఘీజ్ ఖాన్ ఆగమనంతో "బమియాన్ ఘోర వైపరీత్యానికి గురైంది". కానీ విగ్రహాలకు మాత్రం హాని చెయ్యలేదు. తరువాత మొగలు చక్రవర్తి ఔరంగజేబు శతఘ్నులతో విగ్రహాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. తరువాత 18 వ శతాబ్దిలో పర్షియా రాజు నాదర్ అప్ఫ్సర్ కూడా శతఘ్ని గుళ్ళతో వాటిని నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. ఆఫ్ఘన్ రాజు అబ్దుర్ రహమాన్, హజారా తిరుగుబాటుదార్లపై దండెత్తినపుడు పెద్ద విగ్రహపు ముఖాన్ని ధ్వంసం చేసాడు. 1847 లో ఫ్రెంచి దేశస్తుడు దూరో దాని చిత్రాన్ని గీసాడు.

2001 వరకు ప్రస్థానం - తాలిబాన్ నేతృత్వంలో

అబ్దుల్ వహీద్ అనే తాలిబాన్ కమాండరు, ఈ బుద్ధ విగ్రహాలను పేల్చేస్తానని 1997 లో ప్రకటించాడు. ఇది, అతడు లోయను స్వాధీనం చేసుకోకముందే. 1998 లో అతడు లోయను స్వాధీనం చేసుకోగానే, పేలుడు పదార్థాలను అమర్చేందుకు గాను, విగ్రహాల తలలకు రంధ్రాలు చేయించాడు. అయితే, తాలిబాన్ నాయకుడు ముల్లా మహమ్మద్ ఒమర్ ఆదేశాల పనుపున అతడు ఆ ప్రయత్నాలను విరమించాడు. అయితే అప్పటికే విగ్రహం తలపై టైర్లను ఉంచి కాల్చారు. 1999 జూలైలో, విగ్రహాలను పరిరక్షించాలని ముల్లా ఒమర్ డిక్రీ విడుదల చేసాడు. "ఆఫ్ఘనిస్తాన్‌లో బౌద్ధులు లేరు కాబట్టి, ఆ విగ్రహాలను ఆరాధించేవారు లేరు. విగ్రహాలను చూసేందుకు వచ్చే అంతర్జాతీయ సందర్శకుల నుంచి ఆదాయం వస్తుంది. అంచేత బమియాన్ విగ్రహాలను నాశనం చెయ్యరాదు, వాటిని పరిరక్షించాలి" అని ప్రకటించాడు. 2000 తొలినాళ్ళలో, విగ్రహాల వద్ద పడే నీటిని తరలించేందుకు గుంటలు తవ్వేందుకు తాలిబాన్లు ఐక్యరాజ్యసమితి సహాయం కోరారు.

అయితే, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఛాందసులు దేశంలోని ఇస్లామేతర వర్గాలను అదుపు చెయ్యాలని వత్తిడి తీఅవడం మొదలుపెట్టారు. దాంతో తాలిబాన్లు షరియాకు అనుగుణంగా అన్ని రకాల బొమ్మలను, సంగీతాన్ని, ఆటలను, టెలివిజన్నూ నిషేధించారు.

బమియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చెయ్యాలని నేను అనుకోలేదు. వాస్తవానికి, వర్షాల కారణంగా కొద్దిగా దెబ్బతిన్న విగ్రహాలను బాగు చేస్తామని కొందరు విదేశీయులు నా వద్దకు వచ్చారు. అది విని నేను విస్తుపోయాను. ఆకలితో మరణిస్తున్న వేలాది ఆఫ్ఘన్ల గురించి వీరికి పట్టింపు లేదు కానీ ప్రాణంలేని విగ్రహాల పట్ల మాత్రం బాధపడిపోతున్నారు అని నాకు అనిపించింది. అది అత్యంత హేయం. అందుకే నేను ఆ విగ్రహాల ధ్వంసానికి ఆనతిచ్చాను. వాళ్ళు మానవసేవ కోసం నావద్దకు వచ్చి ఉంటే, నేను విగ్రహాలను ధ్వంసం చేయించేవాణ్ణే కాదు.

తాలిబాన్ల సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి, దేశవ్యాప్తంగా ఉన్న 400 మంది మతపెద్దలు విగ్రహాలు ఇస్లాముకు వ్యతిరేకమని ప్రకటించారని వెల్లడించాడు.

యునెస్కో డైరెక్టర్-జనరల్ కోయిచిరో మట్సూరా ప్రకారం, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్‌కు చెందిన 54 సభ్య దేశాల రాయబారులతో ఒక సమావేశం జరిపాం. తాలిబాన్లను గుర్తించిన పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా అన్ని దేశాలూ విగ్రహాల ధ్వంసాన్ని వ్యతిరేకించాయి. తరువాత సౌదీ, యూఏయీలు విగ్రహాల ధ్వంసాన్ని క్రౌర్యంగా వర్ణించాయి. భారత్, తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ, విగ్రహాలను భారత్‌కు తరలించి, "సమస్త మానవాళి కోసం వాటిని భద్రంగా పరిరక్షిస్తామ"ని ప్రకటించింది. తాలిబాన్, ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. విగ్రహాల ధ్వంసం ఇస్లాముకు వ్యతిరేకమని, మున్నెన్నడూ జరగలేదనీ చెప్పి తాలిబాన్లను ఒప్పించేందుకు పాకిస్తాన్ తన దూతను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపించింది. తాలిబాన్ మంత్రి అబ్దుల్ సలామ్ జయీఫ్ ప్రకారం ధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ యునెస్కో 36 ఉత్తరాలు రాసిందని తెలిపాడు. చైనా, జపాన్, శ్రీలంకలు బుద్ధ విగ్రహాల పరిరక్షణకు తీవ్రంగా ప్రయత్నించారు. జపాఅన్ అయితే ధ్వంసాన్ని ఆపేందుకు అనేక ప్రత్యామ్నాయాలు సూచించింది. విగ్రహాలను జపానుకు తరలించడం, వాటిని ముసుగుతో కప్పి ఉంచడం, డబ్బును ఇవ్వడం వంటివి వీటిలో కొన్ని.

తాలిబాన్ల మతవ్యవహారాల మంత్రిత్వ శాఖ, విగ్రహాల ధ్వంసం ఇస్లామిక్ చట్టం ప్రకారం సరైఅనదేనని సమర్ధించుకుంది. అంతిమంగా బుద్ధ విగ్రహాల ధ్వంసాన్ని మంచిని వ్యాప్తి చేసి, చెడును నిర్మూలించే మంత్రిత్వ శాఖా మంత్రి అబ్దుల్ వలీ ఆదేశించాడని అబ్దుల్ సలామ్ జయీఫ్ వెల్లడించాడు.

2001 మార్చి - డైనమైట్లతో విధ్వంసం

2001 మార్చి 2 న మొదలుపెట్టి, కొన్ని వారాలపాటు డైనమైట్లతో పేల్చి ధ్వంసం చేసారు. ఇది వివిధ దశల్లో సాగింది. ముందుగా విగ్రహాలపై విమాన విధ్వంసక బాంబులను పేల్చారు. దీనివలన విగ్రహాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అవి రూపు కోల్పోలేదు. "విధ్వంసం అనుకున్నంత తేలికేమీ కాదు. విగ్రహాలు రెండూ కూడా కొండలో తొలిచి తయారుచేసినవి, దృఢంగా ఉన్నాయి. శతఘ్ని గుళ్ళతో నాశనం అయేవి కావవి" అని సమాచార మంత్రి కుద్రతుల్లా జమాల్ వాపోయాడు. తరువాత విగ్రహాల పీఠాల వద్ద ట్యాంకు విధ్వంసక మందుపాతరలను అమర్చారు. దీంతో, శతఘ్ని దాడులతో విగ్రహాలు దెబ్బతిని ముక్కలు ఆ మందుపాతరలపై పడి మరిన్ని పేలుళ్ళు జరిగి ధ్వంసం త్వరితమౌతుంది. చివరిగా, కొండ మీదుగా మనుష్యులను దించి, రంధ్రాల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. పేలుడు ఒక బుద్ధ విగ్రహపు ముఖాన్ని పూర్తిగా నాశనం చెయ్యలేకపోయినందున, ఒక రాకెట్‌ను కూడా విగ్రహంపై పేల్చారు. అది ముఖాన్ని పూర్తిగా నాశనం చేసి పెద్ద రంధ్రాన్ని చేసింది.

మరో భారీ విగ్రహం

2008 సెప్టెంబరు 8 న పురాతత్వవేత్తలు ఓ 300 మీటర్ల భారీ విగ్రహం కోసం, విగ్రహాలను ధ్వంసం చేసిన స్థలంలో వెతుకుతూండగా, ఓ 19 మీటర్ల పొడవున్న బుద్ధ విగ్రహంలోని భాగాలను కనుగొన్నారు. అది పడుకున్న స్థితిలో ఉన్న బుద్ధుడి విగ్రహం. ఇది బుద్ధుని మహాపరినిర్వాణాన్ని సూచిస్తుంది.

పునరుద్ధరణ

పారిస్‌లో 2011 మార్చి 3,4 తేదీల్లో జరిగిన యునెస్కో వర్కింగ్ గ్రూప్ సమావేశంలో విగ్రహాల పునరుద్ద్ధరణ గురించి చర్చించారు. ఆర్గానిక్ సిలికాన్ కాంపౌండుతో చిన్న విగ్రహాన్ని పునరుద్ధరించవచ్చని ఎర్విన్ ఎమ్మెర్లింగ్ ప్రకటించాడు. సమావేశం బమియాన్ స్థల పరిరక్షణకు 39 సూచనలు చేసింది. పెద్ద విగ్రహ స్థలాన్ని అలాగే వదిలెయ్యాలనేది వాటిల్లో ఒకటి. విధ్వంసానికి స్మృతిగా అలా వదిలెయ్యాలని ఆ సూచన.

కొన్నాళ్ళకు పునరుద్ధరణ పని మొదలైంది. ఒరిజినల్ విగ్రహ శకలాలను ఆధునిక పదార్థాలతో కలిపి ఈ పునరుద్ధరణ సాగింది. పనిలో పాలుపంచుకున్న జర్మను చ్రిత్రకారుడు బెర్ట్ ప్రాక్సెన్‌థేలర్, విగ్రహాల్ల శకలాలు సగం వరకూ తిరిగి ఉపయోగించవచ్చని అంచనా వేసాడు. స్థానిక ప్రజలను శిల్పాలు చెక్కడంలో శిక్షణ ఇచ్చి వారిని పునరుద్ధరణ పనిలో వాడుకోవడం కూడా ఇందులో భాగమే. ఈ ప్రాజెక్టును యునెస్కో, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ సంయుక్తంగా చేపట్టాయి.

పునరుద్ధరణ పని కొంత విమర్శకు కూడా లోనైంది. మానవ హక్కుల కార్యకర్త అబ్దుల్లా హమాదీ, తాలిబాన్ల మూఢత్వానికి గుర్తుగా ఆ ఖాళీలను అలాగే వదిలెయ్యాలని అభిప్రాయపడ్డాడు. ఆ డబ్బుతో ఆ ప్రాంతంలో గృహ, విద్యుత్ సౌకర్యాల కల్పనకు వినియోగించాలని మరికొందరు సూచించారు. ఆ ప్రాంత గవర్నరు హబీబా సరాబీతో సహా ఇంకొందరు, విగ్రహ పునర్నిర్మాణం వలన పర్యాటకం వృద్ధి చెంది, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు లాభిస్తుందని భావించారు.

3D కాంతి ప్రొజెక్షనుతో విగ్రహాల పునరుజ్జీవం

2015 జూన్ 7 న చైనా దంపతులు షిన్యు ఝాంగ్, హోంగ్ లియాంగ్ విగ్రహాల ఖాళీలను 3D కాంతి ప్రొజెక్షను సాంకేతికతతో నింపారు. $120,000 డాలర్ల విలువైన ఆ ప్రొజెక్టరును వాళ్ళు విరాళమిచ్చారు. విగ్రహాలకు జ్ఞాపికగా ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు వాళ్ళు ఆఫ్ఘను ప్రభుత్వాన్ని, యునెస్కోనూ అనుమతి తీసుకున్నారు. ఆ రోజున హోలోగ్రాఫిక్ విగ్రహాల ఆవిష్కరణను చూసేందుకు 150 మంది వరకూ స్థానికులు వచ్చారు.

పాకిస్తాన్‌లో బుద్ధుని అవశేషాల విధ్వంసం

పాకిస్తాన్‌లోని స్వాత్ లోయలో అనేక బౌద్ధ స్థూపాలు, విగ్రహాలూ ఉన్నాయి. జెహానాబాద్‌లో కూర్చున్న భంగిమలోని బుద్ధ విగ్రహం ఉంది. స్వాత్ లోయలోని బౌద్ధ స్థూపలు, విగ్రహాలను తాలిబాన్ ధ్వంసం చేసింది. జెహానాబాద్ బుద్ధ విగ్రహాన్ని కూడా రెండు సార్లు ప్రయత్నించి డైనమైట్లతో ధ్వంసం చేసారు. స్వాత్ లోయలోని మంగలూరులో తాలిబాన్లు ధ్వంసం చేసిన బుద్ధ విగ్రహాల కంటే పెద్దవి బమియాన్ విగ్రహాలే. విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు మొదటిసారి విఫల ప్రయత్నం చేసాక, దాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ఏ ప్రయత్నమూ చెయ్యలేదు. దాంతో రెండో దాడి జరిగి, దానిలో విగ్రహపు కాళ్ళు, భుజాలు, ముఖమూ నాశనమయ్యాయి. తాలిబాన్లు, ఇతర ఇస్లామిస్టులూ పాకిస్తాన్లోని బౌద్ధ గాంధార నాగరికతకు చెందిన అనేక బౌద్ధ అవశేషాలను ధ్వంసం చేసారు. తాలిబాన్లు కావాలని బౌద్ధ గాంధార అవశేషాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. స్మగ్లర్లు ఈ అవశేషాలను దోపిడీ చేసారు. లాహోరుకు చెందిన క్రిస్టియన్ ఆర్చ్‌బిషప్ లారెన్స్ జాన్ సల్దానా పాకిస్తాను ప్రభుత్వానికి రాసిన ఉత్తరంలో, స్వాత్ లోయలో బౌద్ధ విగ్రహాలపై, హిందువులు, క్రైస్తవులు, సిక్ఖులపై తాలిబాన్లు చేస్తున్న దౌర్జన్యాలను ఖండించాడు.

Tags:    

Similar News