Dasara 2020: దసరా అంటే తెలంగాణాలో డబుల్ ధమాకా..అలాయ్ బలాయ్ తో సత్సంబంధాల వేడుక!

Dasara 2020: తెలంగాణా లో దసరా ఒక ప్రత్యేక పండుగ. అలాయ్ బలాయ్ తో అందరి మధ్యలో సత్సంబంధాలకు వేదికగా దసరా నిలుస్తోంది.

Update: 2020-10-22 13:44 GMT

దసరా పండగ వచ్చిందంటే చాలు..తెలంగాణలో డబుల్ ధమాకా ప్రారంభం అయినట్టే. రెట్టింపు సంబరాలు జరుగుతాయి తెలంగాణా వ్యాప్తంగా. ఎందుకంటే ఒక పక్క దసరా నవరాత్రులు ప్రారంభం కాగానే, మరో పక్క తెలంగాణాకు మాత్రమె ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఇటు దసరా నవరాత్రులతో పాటు అటు బతుకమ్మ పండుగను తెలంగాణా వ్యాప్తంగా జరుపుకుంటారు. మహిళలు బతుకమ్మను చేసి ఆటపాటలతో సందడి చేస్తారు.

ఇక దసరా పండుగ ను కూడా ఉత్సాహంగా జరుపుకుంటారు తెలంగాణా ప్రజులు అన్ని దేవాలయాల్లోనూ అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలను జరుపుతారు. తొమ్మిది రోజులూ వివిధ రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. ఇక దసరా రోజు తెలంగాణాలో ప్రత్యేకంగా జమ్మి పూజ.. అలాయ్ బలాయ్ నిర్వహిస్తారు. ఇది కూడా తెలంగాణాకే ప్రత్యేకమైన ఉత్సవంగా చెప్పవచ్చు.

జమ్మి చెట్టు పూజ..

పాండవులు వనవాస సమయంలో అజ్ఞాత వాసం చేస్తారు. అప్పుడు తమ ఆయుధాలను అరణ్యం లోని జమ్మి చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచుతారు. తమ అజ్ఞాత వాసం ముగిసిపోయిన తరువాత జమ్మి చెట్టుకు పూజలు చేసి తమ ఆయుధాలను తీసుకుంటారు. తరువాత వారు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను జయిస్తారు. ఈ జమ్మి చెట్టు నుంచి పాండవులు ఆయుదాలు తీసుకున్న రోజు విజయదశిమి. అందుకే ఆరోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తే మంచిదని అందరూ భావిస్తారు. తెలంగాణలో అందరూ విధిగా జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. విజయదశమి రోజు సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర అపరాజితా దేవిని పూజించి "శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం" అనే శ్లోకాన్ని పఠిస్తూ ప్రదక్షణ చేస్తారు. ప్రతి ఊరిలోనూ ఓ ఎత్తైన గద్దెపై జమ్మి చెట్టును ఉంచి.. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత ఊరి ప్రజలు ఆ జమ్మి చెట్టుకున్న ఆకులను తీసుకునేందుకు పోటీ పడుతుంటారు. అక్కడ కలిసిన బంధువులతో అలయ్ బలయ్ (ఆలింగనం) తీసుకుంటూ ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ పధ్ధతి ఒక్క తెలంగాణలో మాత్రమె కనిపిస్తుంది. అందరి మధ్యలో సహ్రుద్భావం నెలకొనడానికి ఇది దోహదం చేస్తుంది.

అక్కడి నుంచి జమ్మి ఆకులను తమ వెంట తీసుకెళ్లి ఇంటి దగ్గర పెద్దలకు, తెలిసిన వారికి చేతిలో పెట్టి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడి వాడుక భాషలో జమ్మి ఆకును బంగారంగా పిలుస్తారు. కులాలకు అతీతంగా కనిపించే ఈ సంప్రదాయం దసరా పండుగ విశిష్టతను మరింత ఇనుమడింపజేస్తోంది. ప్రజల జీవన ఐక్యతారాగాన్ని చాటి చెబుతుంది. అందుకే దసరా పండుగ మానవ సంబంధాల మనుగడకు ప్రతీకగా నిలుస్తోంది.

Tags:    

Similar News