Dasara 2020 : ఆంధ్రప్రదేశ్ లో దసరా సంబరాలు ఇలా జరుపుకుంటారు

Dasara 2020: దసరా ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో వైభవంగా నిర్వహిస్తారు.

Update: 2020-10-22 10:17 GMT

దసరా పండగ అంటే చాలు ఎక్కడ లేని సందడీ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అమ్మవారికి చేసే నవరాత్రి పూజలు ఒక వైపు.. స్థానికంగా జరిగే సంబరాలు మరోవైపు.. ఆధ్యాత్మిక పవనాలు.. సామాజిక సరదాలు.. బంధు మిత్రుల కలయికలు.. ఒకటనేమిటి అన్ని విధాలుగానూ దసరా పండుగ ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా దసరా కోలాహలం ఉంటుంది. 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ప్రతి రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక విజయవాడతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ అమ్మవారికి నవ దుర్గ అలంకారాలు చేస్తారు. ఈ అలంకార సేవలు ఆలయ విధానాలను బట్టి వేరు వేరుగా ఉన్నా..దసరా రోజు మాత్రం అన్ని దేవాలయాల్లోనూ అమ్మవారికి పూజలు మాత్రం ఒకే విధంగా నిర్వహిస్తారు. ఇక అమ్మవారి పూజలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దసరా కోసం ప్రత్యేకంగా సంబరాలు నిర్వహిస్త్తారు.

దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించే వేడుకల విశేషాలు మీకోసం..

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో..

వీరవాసరం పశ్చిమగోదావారి జిల్లా వీరవాసంలో వంద సంవత్సరాల నుంచి ఏనుగుల సంరంభం జరుపుతూ వస్తున్నారు. వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసిన ఏనుగును అంబారీతో అలంకరిస్తారు. ఈ విధంగా చేయడం వలన పిల్లలకు రోగాలు రావనీ, రోగ విముక్తి కలుగుతుందనీ ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. సాయంత్రం 6 నుండి తెల్లవారు 6 గంటల వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈసారి కోవిడ్ కారణంగా ఈ వేడుకకు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. ఊరేగింపు లేకుండా ఏనుగుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.

విజయనగరం లో అమ్మవారి సిరిమానోత్సవం..

దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లికి పూజలు చేస్తారు. సిరిమానోత్సవం విజయనగరంలో ఘనంగా నిర్వహిస్తారు. అయితే, ఈ పండుగ దసరా పండుగ తరువాత వచ్చే మంగళవారం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ పూజారిని ఎత్తైన సిరిమాను ఎక్కించి గుడి నుండి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం కోసం పరిసర ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున విజయనగరం వస్తారు. సిరిమాను పై అమ్మవారి ప్రతినిధిగా ఊరేగే పూజారిని అమ్మవారితో సమానంగా పరిగణిస్తారు.

కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో రాళ్ళ యుద్ధం!

వీపనగండ్ల లో దసరా సమయంలో రాళ్ళ యుద్ధం జరుగుతుంది. దసరా రోజు సాయంత్రం కాలువకు ఒకవైపు కొంత మంది ప్రజలు, మరో వైపు మరికొంత మంది ప్రజలు కంకర రాళ్లను గుట్టలుగా పోసి ఒకవైపు రామసేన మరోవైపు రావణ సేన గా ఊహించుకొని రాళ్లు విసురుకుంటారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత బాగా ఉత్సవం జరిగినట్టు. ఈ ఉత్సవం జరుపుకోవడం పై భిన్న వాదనలు ఉన్నాయి. కానీ, పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఈ రాళ్ళ యుద్ధం మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తోంది.

కృష్ణా జిల్లా మచిలీపట్నం లో 

దసరా వేడుకలు.. దసరా పండుగ సందర్బంగా మచిలీపట్నం శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు బందరు పురవీధుల్లో ఈ ఊరేగింపు జరుపుతారు. చివరి రోజున కోనేరు సెంటర్ వద్ద జమ్మి కొట్టడంతో ఊరేగింపు ముగుస్తుంది.

దేవరగట్టు, ఆలూరులో కర్రల యుద్ధం

కర్నూలు జిల్లాకే ప్రసిద్ధి బన్ని ఉత్సవాలు. దీనినే 'కర్రల సమరం' అంటారు. ఈ ఉత్సవాలు దసరా రోజున రాత్రి నుంచి ఉదయం వరకు నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల ప్రజలు ఒకవైపు, మరికొన్ని గ్రామాల ప్రజలు మరోవైపు జట్లుగా ఏర్పడి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీ పడతారు. నెరణికి గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలను కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు. ఈ నేపథ్యంలో కర్రల తాకిడిలో చాలా మందికి గాయాలు కావటం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవటం జరుగుతాయి.

ఇవి కొన్ని ముఖ్యమైన దసరా వేడుకలు. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో దసరాను పురస్కరించుకుని అన్ని ప్రాంతాల్లోనూ అమ్మవారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. 

Tags:    

Similar News