Avanigadda Sri Lakshmi Narayana Swamy : అభయప్రదాత.. అవనిగడ్డ లక్ష్మీనారాయణ ఆలయ విశేషాలు
Avanigadda Sri Lakshmi Narayana Swamy : కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి పొందిన దేవాలయాలలో అవనిగడ్డ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఒకటి.
Avanigadda Sri Lakshmi Narayana Swamy: కృష్ణా జిల్లాలో ప్రసిద్ధి పొందిన దేవాలయాలలో అవనిగడ్డ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ క్షేత్రం ఎంతో విఖ్యాతి గాంచింది. ఈ ఆలయంలో శ్రీమహా విష్ణువు భక్తులకు దర్శనం ఇస్తూ వారి కోరికలను తీరుస్తూ కొంగుబంగారమై కొలువుదీరాడు.
ఆలయ విశేషాలు..
పంచ భావన్నారాయణ క్షేత్రాలు, పంచభూత లింగాలు, పంచారామాలు, పంచలక్ష్మీ నారాయణ క్షేత్రాలు తెలుగునాట ప్రసిద్ధి పొందాయి. స్కాందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో బ్రహ్మ వైవర్తంలో వ్యాసుడు పంచలక్ష్మీనారాయణ క్షేత్రాలను గూర్చి వర్ణించారు. శ్రీరాముని కుల గురువైన వశిష్టుని ఆశ్రమంగా ఈ అవనిగడ్డ ప్రాంతం అలరాలేది. ఈ ఆశ్రమంలో సీతాదేవి వశిష్టుని ద్వారా ధర్మ శ్రవణం చేసేదని ప్రతీతి. అందుకే ఈ ప్రదేశం దీన్ని అవనిజపుర౦ అని సీతాదేవి పేరుతో పిలుస్తారు. సీతాదేవి వనవాసం ఉన్నది సీతలంక అనీ, వశిష్టాశ్రమాన్ని వశిష్టమెట్టగా పిలిచేవారు. కాలక్రమేణ ఈ ప్రాంతం అవనిగడ్డగా స్థిరపడింది. నడకుదురు, అవనిగడ్డ, నల్లూరు, రాచూరు, పెదముత్తేవిలలో ఉన్న లక్ష్మీనారాయణ క్షేత్రాన్ని పంచలక్ష్మీనారాయణ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు. అవనిగడ్డ ప్రాంతం శాతవాహనుల కాలంలో సుప్రసిద్ధ రేవు పట్టణం. దివిసీమకే ప్రత్యేకతను ఆపాదించే ఈ ప్రాంతం అనాదిగా ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయాన్ని 1824 సంవత్సరంలో పునర్నిర్మాణం చేసారు. 1977 సంవత్సరంలో వచ్చిన దివిసీమ తుపాను వల్ల ధ్వజస్తంభం కూలిపోవడంతో 1990 సంవత్సరంలో ధ్వజస్థంబాన్ని పునః ప్రతిష్ఠ చేసారు. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించే స్థలానికి "లక్ష్మీపతి లంక" అని పేరు కూడా ఉంది. ప్రస్తుత ఆలయ గోపురాలను చోళరాజైన రెండవ కుళోత్తుంగ చోళుడు నిర్మింపజేసాడు. ఈ స్వామిని చోళనారాయణ దేవరగా కూడా వ్యవహరిస్తారు.
శాసనాలు..
పాలకుడైన రెండో కులోతుంగ చోడదేవుడు నిర్మించి, కొన్ని దానాలు చేసినట్టు స్థానిక శాసనాలు పేర్కొంటున్నాయి. ఆలయ ప్రాంగణంలో రాజశేఖర ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణాలయం కూడా గర్భాలయ, అర్ధమండప, మహామండపాలతోనూ, మూడువైపులా ఆలంకార శిల్పంతోనున్న గజహస్తాలతోనూ అలరారుతుంది. అర్థ మండపానికి ఎడమవైపున మరో ఆలయం, ఈశాన్యంలో నాలుగుకాళ్ళ (గోష్ఠి) మండపం, చుట్టూ ప్రాకారం, తూర్పువైపున ఏడంతస్తుల రాజగోపురం ఉన్నాయి. గోపురానికి లోపలి వైపున కూడా ఒక మండపం ఉంది. ఈ ఆలయ చరిత్రను తెలిపే శాసనాలు చాలా ఉన్నాయి. క్రీ.శ. 1138–1154 మధ్య కాలానికి చెందిన ఆరు తెలుగు శాసనాలు, అర్ధమండపం గడప మీద ఒకటి, గోపుర స్తంభాలపైన నాలుగు, కప్ప బండమీద ఒకటి చెక్కబడి ఉన్నాయి. క్రీ.శ. 1138 నాటి రెండు శాసనాలలో ముత్తమనాయకుని కూతురు కొమ్మమ చేసిన దానం వివరాలున్నాయి. క్రీ.శ. 1147 నాటి మూడో శాసనంలో గంగమరాయని కూతురు చోడాంబ, క్రీ.శ. 1152 నాటి నాలుగో శాసనంలో మేడాంబ కూతురు నూంకమ ఇచ్చిన దానధర్మాల వివరాలున్నాయి. ఐదో శాసనాక్షరాలు స్పష్టంగా లేనందువల్ల వివరాలు తెలియడం లేదు.
అయితే సమీపంలోని గణపేశ్వరాలయంలోనున్న రెండు శాసనాలు మొట్టమొదటిసారిగా మహిళా శిల్పుల ప్రస్తావన తెస్తున్నాయి. క్రీ.శ. 1771వ సంవత్సరం నాటి గణపేశ్వరాలయ శాసనంలో నాగిరెడ్డి కొడుకు సుబ్బన్న గణపేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడనీ, ఆ లింగాన్ని మాగులూరి మల్లికార్జునుడు, అతని భార్య వీరమ్మ కొడుకు అక్కబత్తుడు కలిసి చెక్కారని ఉంది. అక్కడే ఉన్న క్రీ.శ. 1729 నాటి శాసనంలో కూడా గతంలో చోడరాజు సాగర సంగమం దగ్గర ఒక వైష్ణవ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని, దాన్ని చెక్కడంలో లింగాబత్తుని భార్య లింగమ్మ, కొడుకు కొల్లాబత్తుడు, అతని భార్య రుద్రమ, వీరి కొడుకు కామాక్షి, ఇతని భార్య పార్వతి, వీరి కుమారులు మల్లయ, నాగప్ప, శరభయ, వీరప్పలు పాలుపంచుకొన్నారని చెప్పబడింది. స్త్రీ శిల్పులను అందించిన ఘనతను కూడా దివిసీమ దక్కించుకుంది.
రథాకృతి..
ఆలయం మహామండపం ముందున్న మెట్లకు రెండువైపులా ఉపపీఠంపై ఉన్న దేవాలయాన్ని రథంలా ముందుకు లాగుతున్నట్లుగా చెక్కిన శిల్పం ఈ ప్రాంతంలోనే కాదు, మొత్తం తెలుగునేల మీద ఎక్కడా లేదు. రథ చక్రం ముందు భాగంలో పరుగులిడుతున్న గుర్రాలను అదిలిసూ, పగ్గాలు పుచ్చుకొని కత్తుల్ని డాలుల్ని ధరించి కూర్చున్న రౌతులు, గుర్రాలకు ముందు గుండ్రంగా తిరిగి పద్మం చెక్కిన రాయి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది. గుంటూరు జిల్లా చందోలు నుంచి పాలించిన వెలనాటి చోళుల భృత్యుడు, కళింగ గాంగ చక్రవర్తి నరసింహదేవుడు నిర్మించిన కోణార్క కంటే కచ్చితంగా నూరేళ్ళ ముందే దివిసీమలో రథాకారంలో ఆలయాన్ని నిర్మించి తెలుగు నేలలోనే కాదు, మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొదటి రథాకార ఆలయాన్ని నిర్మించిన ఖ్యాతిని దక్కించుకొన్నాడు.
ప్రసిద్ధి..
సువిశాల లోగిలిలో ప్రాచీన కళాసంపదకు నిలువెత్తు రూపంగా ఆంధ్రప్రదేశ్ లోని అతి ఎత్తైన రెండవ గాలిగోపురం ఉన్న ఆలయం ఉన్న ప్రాంతంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. 99 అడుగుల ఎత్తైన గాలిగోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఏడు అంతస్తులతో, సప్త కలశాలతో, మంగళగిరి లోని గాలిగోపురం తరువాత ఈ ఆలయా గోపురమే సమున్నతమైనదిగా అలరాలుతోంది. పొందికగా, స్ఫుటంగా యున్న ఈ గోపురంపై పలు శిల్పాకృతులు, కళాకృతులు భక్తులకు కనువిందు చేస్తాయి. ఆలయం ప్రత్యేక రాతి పీఠంపై రథాకృతిలో నిర్మితమై ఉంటుంది. చోళరాజుల ఆలయ నిర్మాణ శైలికి ఇది అద్దం పడుతుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి అర్చావతారమూర్తిగా, లక్ష్మీ మనోహరునిగా దర్శనమిస్తాడు. గర్భాలయంలో శ్రీలక్ష్మీ నారాయణ స్వామి ధ్రువమూర్తి సాలగ్రామ శిల రూపంలో అద్భుత సౌందర్యాతిశయంతో అలరాలుతోంది. నారాయణుడు తన వామాంకంపై లక్ష్మీదేవిని ఆశీనురాలిగా చేసికొని ఆమెను పొదివి పట్టుకొన్న రీతిలో స్వామి దర్శనమిస్తాడు. గర్భాలయంలో లక్ష్మీనారాయణులు సర్వాలంకారాలతో తేజరిల్లుతారు. నేద్రద్వయాలతో మీసకట్టు రజతాభరణాలతో మకరతోరణ యుక్తంగా దర్శనమిస్తాడు. ఈ స్వామిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్లు చెబుతారు. రాజ్యలక్ష్మీ పేరుతో అమ్మవారు ఉన్నారు.
ఉత్సవాలు..
ఈ స్వామి వారికి వైశాఖ పూర్ణిమ నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. ముక్కోటి ఏకాదశినాడు ఉత్సవం జరుగుతుంది. అట్లాగే దసరా పండగ సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇవి కాకుండా కార్తీక శుద్ధ ఏకాదశి నాదు స్వామివారికి లక్ష తులసిపూజ చేస్తారు.
శిల్పకళ..
ఈ దేవాలయం అచ్చమైన శిల్పకళకు అచ్చమైన చిరునామా. అడుగడుగునా భక్తులను అచ్చెరువు చెందించే శిల్పకళాతోరణం ముగ్ధుల్ని చేస్తుంది. చోళరాజుల కళాపోషణకు, అలనాటి శిల్పకళాకారుల నైపుణ్యానికి ఇది తార్కాణం. విలక్షణభరితమైన శిల్పకళా విన్యాసం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఆలయ మొదటి రాజగోపురాన్ని మొదలుకొని ఇతర గోపురాలు, ప్రాకారాలు, పద్మపీఠాలు, కుడ్యాలు, స్థంబాలపై హృదయరంజకమైన శిల్పకళా వైభవం ద్యోదకమవుతుంది. ముఖ మంటపం ద్వా త్రింసతి స్థంబాలతో అంటె 32 స్తంబాలతో కూడు ఉంటుంది. అన్ని స్తంబాలపై రామాయణ, భాగవతాలు శిల్పకళా రూపంలో ప్రకటితమవుతాయి. దక్షిణ మంటప పై భాగాన శ్రీరామ పట్టాభిషేకం, రెండోవరుస శిల్పాలుగా గోచరమవుతాయి. దీని క్రింద గజలక్ష్మి విగ్రహం ఉంటుంది.