Akshaya Tritiya 2023: తరగని సిరులు అందించే అక్షయ తృతీయ.. ఈ ఏడాది ఎప్పుడంటే..?!

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ..భారతదేశంలో హిందువులందరూ జరుపుకునే పండుగ.

Update: 2023-04-20 12:30 GMT

Akshaya Tritiya 2023: తరగని సిరులు అందించే అక్షయ తృతీయ.. ఈ ఏడాది ఎప్పుడంటే..?!

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ..భారతదేశంలో హిందువులందరూ జరుపుకునే పండుగ. ఈ రోజుని అదృష్టానికి, విజయానికి, భవిష్యత్తులో వచ్చే ఆనందాలకి గుర్తుగా జరుపుకుంటారు. వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్-మే నెలల మధ్య కాలంలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది.

అక్షయ తృతీయ అంటే ఏంటి..??

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖమాసంలో తదియనాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడంతో అంత విశిష్టత ఏర్పడింది.

మహాభారత రచనను విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో వేదవ్యాసుడు ఈ దినానే ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు శివుణ్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్లు శివపురాణం తెలుపుతుంది. మహాభారతంలో ధర్మరాజుకు అక్షయపాత్ర ఇవ్వడం, గంగానది ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భువిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయ కావడం విశేషం. పరశురాముడిగా శ్రీమహావిష్ణువు ఆవిర్భవించినది కూడా ఈ రోజునే. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని పరశురామ జయంతిగా వేడుకలు నిర్వహించుకుంటారు. నరనారాయణుడు, హయగ్రీవుడు అవతరించినట్లు కూడా విశ్వసిస్తారు. ఈ రోజు నుంచే బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఈ రోజు మాత్రమే బృందావన్ లో శ్రీకృష్ణుడి పాదాలు దర్శనమిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందునే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకుంటాం.

అక్షయ తృతీయనాడు బంగారం ఎందుకు కొనాలి..??

అక్షయ తృతీయ వచ్చిందంటే హిందువులు పెద్ద ఎత్తున బంగారం కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. పేద, ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా బంగారం కొనాలని ప్రయత్నిస్తుంటారు. ఈ రోజున బంగారం మీద ప్రత్యేకమైన డిస్కౌంట్లు కూడా ఉంటాయి. అంతలా అక్షయ తృతీయనాడు బంగారం కొనాలని అనుకోవడం వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది అక్షయ తృతీయ అనే పేరు. అక్షయ అంటే క్షయం లేనిది అని అర్థం. అంటే ఎన్నటికీ తరగనిది, చిరకాలం ఉండేది అని అర్థం. సంస్కృతం ప్రకారం అక్షయ అంటే శ్రేయస్సు, ఆనందం, విజయం అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో మూడవ రోజు అని, చంద్రుని మూడవ దశ అని అర్థం.

అక్షయ తృతీయ నాడు ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతం అవుతుందని, ఎన్నటికీ నిలిచిపోతుందని నమ్ముతారు. అందుకే ఇవాళ విలువైన వస్తువులు, ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. బంగారాన్ని మించిన సంపద మరొకటి లేదు కాబట్టి...అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే కుబేరుడు తమ సంపదను రక్షిస్తాడని నమ్ముతారు. మహాలక్ష్మీ అమ్మవారిని శ్రీమహావిష్ణువు వివాహం చేసుకున్న రోజు కూడా ఈ రోజే. క్షీరసాగర మధనం తర్వాత విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయని నమ్ముతారు.

పూజావిధానం:

ఈసారి వచ్చిన అక్షయ తృతీయకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజు సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, త్రిపుష్కర యోగం, అమృత సిద్ధి యోగం, ఆయుష్మాన్ యోగం వంటి శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాలన్నీ 22 ఏప్రిల్ 2023 శనివారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమై 23 ఏప్రిల్ 2023 ఆదివారం ఉదయం 7:48 గంటల వరకు కొనసాగనున్నాయి.

అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసి శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలిగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున ఏదైనా ప్రవహించే నదిలో పుణ్యస్నానమాచరించి దానధర్మాలు చేయడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. బార్లీని, ఒక నిండుకుండను దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ శుభ ముహూర్తం

వైశాఖ మాసం శుక్ల పక్షం అక్షయ తృతీయ తిథి ప్రారంభం: 22 ఏప్రిల్ 2023 శనివారం ఉదయం 7:49 గంటలకు

వైశాఖ మాసం శుక్ల పక్షం అక్షయ తృతీయ తిథి ముగింపు: 23 ఏప్రిల్ 2023 ఆదివారం ఉదయం 7:49 గంటలకు

పూజా సమయం: శనివారం ఉదయం 7:49 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

బంగారం కొనే శుభసమయం: 22 ఏప్రిల్ 2023 ఉదయం 7:49 గంటల నుంచి మరుసటి రోజు 23 ఏప్రిల్ 2023 ఉదయం 07:47 గంటల వరకు..అంటే 24 గంటల్లోపు ఏ సమయంలో కొన్నా శుభపలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News