విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా, శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకోరూపంలో భక్తులకు అభయమిస్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకొని భారీగా తరలివస్తున్నారు. టికెట్లలో కేటాయించిన సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి రావాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ రోజు మూలానక్షత్రం కావున అమ్మవారి అభయం పొందేందుకు భక్తులు బెజవాడ దుర్గగుడికి పోటెత్తుతున్నారు. ఆశ్వయుజ శుద్ధపంచమి, అందులో ఐదవ రోజు కావడంతో ఇవాళ అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం నాటి నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భక్తులు భావిస్తారు. ఇక ఆలయ అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులను పరిశీలించిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. వేకువజామున 3గంటల నుంచి రాత్రి 9గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం జగన్ ఇవాళ మధ్యాహ్నం 3.40 గంటలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఇంద్రకీలాద్రి పేరువెనుక చరిత్ర
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.
క్షేత్ర పురాణం
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.