Valentines Day:వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు.. దాని వెనుక కథేంటో తెలుసా?
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు, వాలెంటైన్స్ డే సందడి ప్రారంభమవుతుంది. ప్రేమకు గుర్తుగా భావించే ఈ వాలెంటైన్ వీక్‌ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు.. దాని వెనుక కథేంటో తెలుసా?
Valentines Day: వాలెంటైన్స్ డే.. ప్రేమికుల దినోత్సవం. ప్రేమకు గుర్తుగా భావించే వాలెంటైన్స్ డేను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఫిబ్రవరి 14నే వాలెంటైన్ డేను ఎందుకు జరుపుకుంటారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు, వాలెంటైన్స్ డే సందడి ప్రారంభమవుతుంది. ప్రేమకు గుర్తుగా భావించే ఈ వాలెంటైన్ వీక్‌ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, హగ్ డే, కిస్ డే చివరకు వాలెంటైన్స్ డేతో వాలెంటైన్ వీక్ ముగుస్తుంది. చివరి రోజున అంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రేమికులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే అంటే గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకోవడమేనా.. దీని వెనుక ఉన్న కథేంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ దీని గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.
ప్రేమికుల రోజు పుట్టుకకు కారణం సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి. వాలెంటైన్ అనే సైనికుడు మూడవ శతాబ్దంలో రోమ్‌లో ప్రేమ వివాహానికి మద్దతుగా నిలిచాడు. ఆ సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ 2 ప్రేమ వివాహాలను నిషేధించాడు.
చక్రవర్తి ప్రేమ వివాహాలను నిషేధించినా వాలెంటైన్ ప్రోత్సహించాడు. అతనికి చాలా మంది మద్దతుగా నిలిచారు. అంతేకాదు క్లాడియన్ కుమార్తె వాలెంటైన్‌కు అభిమానిగా మారింది. దీంతో భయం పట్టుకున్న చక్రవర్తి యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ పట్టిస్తున్నారన్న కారణంతో.. వాలెంటైన్‌కు మరణ శిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటున్నారు.
ప్రేమికుల దినోత్సవం విదేశీ సంస్కృతి కావడంతో భారతదేశంలో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమికుల రోజున ఎవరైనా ప్రేమజంట రోడ్లపై కనిపిస్తే చాలు వారికి అక్కడే పెళ్లి చేసేయడం, ఆ వార్త వైరల్ అవడం తెలిసిందే. సదరు వ్యక్తులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం జరిపించేస్తారు. దీంతో దేశంలోని పలు నగరాల్లో ఫిబ్రవరి 14న శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.