Viral Video: యూట్యూబ్ ప్లే బటన్ కావాలా.? డబ్బులిస్తే మీ సొంతం.. వైరల్ వీడియో..
Viral Video: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Viral Video: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారైనా యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిందే. రీల్స్, వీడియోలు ఇలా నిత్యం యూట్యూబ్‌లో సమయం గడిపేస్తుంటారు. ఇక చూసే వారితో పాటు యూట్యూబ్ వీడియోలను రూపొందించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఎంచక్కా డబ్బులు వస్తుండడం, సమాజంలో ఫేమ్ కూడా వస్తుండడంతో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్‌ను ప్రారంభిస్తున్నారు.
అయితే కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు యూట్యూబ్ పలు అవార్డులు ఇస్తుంది. లక్ష మంది సబ్‌స్క్రైబర్లు దాటితే సిల్వర్ ప్లే బటన్, 10 లక్షల సబ్‌స్క్రైబర్లు దాటితే గోల్డ్ ప్లే బటన్, కోటి మంది సబ్‌స్క్రైబర్లు దాటితే డైమండ్ ప్లే బటన్ ఇస్తారు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. వీటిని తమ వీడియోల్లో చూపిస్తూ క్రియేటర్లు ప్రమోషన్ చేసుకుంటారు. అయితే సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆధారంగా యూట్యూబ్ నుంచి వచ్చే ఈ ప్లే బటన్స్ మార్కెట్లో డబ్బులకు లభిస్తే ఎలా ఉంటుంది.? తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. ఇంతకీ వీడియోలో ఏముదంటే.
వీడియోలో ఓ చిన్న వెల్డింగ్ షాపులో ఉన్న వ్యక్తి, ప్లే బటన్‌లను అచ్చం ఒరిజినల్‌లా తయారు చేస్తూ కనిపించాడు. రెండు రేకులపై వెల్డింగ్ చేసి, రంగు వేసి, పేర్లను కూడా అతికించి అస్సలు గుర్తుపట్టలేనంత నిజంగా కనిపించేలా ప్లే బటన్‌లు తయారుచేశాడు. అలా అతడి షాపులో పలుచోట్ల అలాంటి ఫేక్ బటన్‌లు కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చివరికి ప్లే బటన్స్‌ను కూడా ఫేక్ చేశారా అంటూ స్పందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.