రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును వెంటనే... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును వెంటనే నిలిపివేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తప్పు పట్టింది.
ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు హరికేశ్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఆదేశం పంపారు.
కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు హెచ్చరించింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్దమైందని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో కృష్ణా వాటర్ బోర్డు ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిర్మించడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొన్నది.
ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 84, పేరా 7లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసిందని బోర్డు తప్పు పట్టింది.
కొత్త ప్రాజెక్టులేవైనా ముందుగా వాటి సమగ్ర నివేదిక (డీపీఆర్)ను కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించి, అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలైనా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని బోర్డు నిర్దిష్టంగా పేర్కొన్నది.