Electric Cars In India: కర్వ్ ఈవి, నెక్సాన్ ఈవి, మహీంద్రా BE 6e... ఈ మూడింటిలో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?

Update: 2024-12-06 13:52 GMT

Electric Cars In India: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పెరుగుతోంది. మార్కెట్లో ఇప్పుడు ప్రజలకు అనేక కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా ఈ విభాగంలో కొత్త ఎలక్ట్రిక్ కారు BE 6eని కూడా విడుదల చేసింది. ఈ కారు ప్రస్తుత మార్కెట్లో గేమ్ ఛేంజర్ అని భావిస్తున్నారు. అలాగే ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న టాటా ఎలక్ట్రిక్ కార్లు నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ నుండి ఈ కారు ఎంత భిన్నంగా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ మూడు కార్లలో ఏది కొనుగోలు చేయడానికి ఉత్తమమో కూడా చూద్దాం.

ఏ ఎలక్ట్రిక్ కారు పెద్దది?

టాటా నెక్సాన్ ఈవీ అనేది 4 మీటర్ల కంటే తక్కువ పరిధి కలిగిన ఎలక్ట్రిక్ కారు. అయితే కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6e 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కార్ల జాబితాలోకి వస్తాయి. మహీంద్రా కారు ఇతర రెండు ఈవీల కంటే వెడల్పుగా ఉంటుంది. దీనితో పాటు, మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వీల్‌బేస్ కూడా పెద్దగా ఉంటుంది. కర్వ్ ఈవీలో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కనిపిస్తుంది. బూట్ స్పేస్ విషయానికొస్తే.. టాటా నెక్సాన్, మహీంద్రా BE 6e కంటే టాటా కర్వ్ కారులోనే ఎక్కువ స్పేస్ ఉంటుంది.

ఏ ఎలక్ట్రిక్ కారులో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి?

మహీంద్రా BE 6e, టాటా నెక్సాన్ EV, టాటా కర్వ్ EV... ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. ఈ మూడు వాహనాలలో గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ మూడు ఎలక్ట్రిక్ కార్లలో అందుబాటులో ఉంది. టాటా వాహనాల్లో JBL ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. లెవెల్ 2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు, సౌండ్ అలర్ట్ వంటి ఫీచర్లు కర్వ్‌లో కనిపిస్తాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ కారులో అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. అన్ని టాటా ఈవీల మాదిరిగానే, ఈ వాహనం కూడా యాంబియంట్ లైటింగ్‌తో వస్తుంది. కానీ మహీంద్రా BE 6eలో పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది. మహీంద్రా కారును రిమోట్ కంట్రోల్ ద్వారా ఆటో పార్క్ చేయవచ్చు. ఈ వాహనంలో సెల్ఫీ కెమెరా, డిజిటల్ కీ, హెడ్‌అప్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల శ్రేణి, పనితీరు

మహీంద్రా BE 6e రెండు బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లతో వస్తుంది. ఈ వాహనంలో అందించిన 59 kWh బ్యాటరీ ప్యాక్ 228 bhp శక్తిని ఇస్తుంది. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ వాహనం 282 bhp శక్తిని ఇస్తుంది. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 535 కిలోమీటర్ల నుండి 682 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదు.

టాటా కర్వ్ EV 45 kWh బ్యాటరీ ప్యాక్‌తో 502 km, 55 kWh బ్యాటరీ ప్యాక్‌తో 585 km రేంజ్ కలిగి ఉందని పేర్కొంది. ఈ వాహనంలో ఇచ్చిన మోటార్ 167 hp శక్తిని అందిస్తుంది. అలాగే 215 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ EV 45 kWh బ్యాటరీతో నడుస్తుంది. ఈ కారు ఒకే ఛార్జింగ్‌లో 489 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు.

ఏ ఎలక్ట్రిక్ కారు కొంటే బెటర్?

టాటా కర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.4 లక్షల నుండి మొదలై రూ. 21.9 లక్షల వరకు ఉంటుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 12.4 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అందులో టాప్ మోడల్ ధర రూ. 17.19 లక్షలు. మహీంద్రా BE 6e కారు ప్రారంభ ధర రూ. 18.9 లక్షలుగా ఉంది. దీనిని బట్టి మీరు ఏ కారు కొనాలని అనుకుంటున్నారో ఓ అంచనాకు రావచ్చు.

Tags:    

Similar News