పాపాయిలకు తల్లి మాత్రమే అందించగల అమృతం చనుబాలు!

పాపాయిలకు తల్లి మాత్రమే అందించగల అమృతం చనుబాలు!
x
Highlights

అప్పుడే పుట్టిన బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే.. తన చనుబాలు ఇచ్చి మురిపెంగా చూసుకుంటుంది తల్లి. అక్కడ నుంచి ఆ తల్లికి బిడ్డతో అనుబంధం పెనవేసుకుపోతుంది....

అప్పుడే పుట్టిన బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే.. తన చనుబాలు ఇచ్చి మురిపెంగా చూసుకుంటుంది తల్లి. అక్కడ నుంచి ఆ తల్లికి బిడ్డతో అనుబంధం పెనవేసుకుపోతుంది. బిడ్డ ఆకలిని తీర్చడానికి తానిచ్చే పాలు భవిష్యత్ లో ఆ బిడ్డ ఆరోగ్యానికీ కారణమవుతాయని చాలా మంది తల్లులకు తెలియదు. తల్లి పాలు తాగుతూ పెరిగిన పిల్లలలో చురుకుతనమూ ఎక్కువగానే ఉంటుంది. ఒక్క ఆకలి తీర్చుకోవడం కోసమే బిడ్డ పాలకోసం చూడదు. తమకు కలిగే భయం నుంచి ధైర్యం కోసం.. తల్లి దగ్గరకు తీసుకోవడంలో వారికి అనిపించే రక్షణ కోసం.. తల్లి కళ్లలో ప్రేమను పొందడం కోసం.. ఇలా చాలా కారణాలతో బిడ్డ తల్లి పాల కోసం ఎదురు చూస్తుంది. సృష్టిలో అత్యంత ప్రేమమమైన బంధానికి పసి తనంలో తల్లిపాలతోనే పునాది పడుతుంది. అది మాతృత్వపు మధురిమాలలో ఓ ప్రత్యేకతను నింపుతుంది.

ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకూ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించుకున్తున్నాం. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టత.. ఆ మమతల మాధుర్యం బిడ్డకి చేసే మేలు గురించి కొంత తెలుసుకుందాం.

తల్లీ బిడ్డల దీర్ఘకాల ఆరోగ్యానికి తల్లిపాలే రక్ష!

చనుబాలు పట్టడం బిడ్డ ఆకలి తీర్చడానికే అని అందరూ అనుకుంటారు. అదొక్కటే కాదు ఎన్నో ప్రయోజనాలు దీనిలో ముడివేసుకుని ఉన్నాయి. తల్లిపాలలోని యాంటీబాడీలు బిడ్డకు సహజంగా రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా తల్లికి కేన్సర్ల వంటి జబ్బులు రాకుండా తోడ్పడతాయి.

తల్లిపాలు తాగిన పిల్లలకు తెలివితేటలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వయసుకు తగ్గ బరువు వుండే విధంగా తల్లిపాలు భవిష్యత్ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. ఇక ఆరునెలల పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, విరేచనాల సమస్యలు వచ్చే అవకాశం బాగా తక్కువ వుంటుంది. ఇంకో ముఖ్యావిషయం ఏమిటంటే.. మధుమేహ వ్యాధి వచ్చే ముప్పును చాలా వరకూ తల్లిపాలు తప్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇక బిడ్డకి చనుబాలు పట్టడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలూ అధికమే. అందులో ముఖ్యమైనది గర్భసంచికి జరిగే మేలు. కాన్పు తరువాత వ్యాకోచ స్థితిలో ఉన్న గర్భ సంచి తిరిగి మామూలుగా కావడంలో చనుబాలు బిడ్డకి పట్టడం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. బిడ్డ రొమ్ము పట్టినప్పుడు తల్లి మెదడు నుంచి సంకేతాలు వెలువడి ఆక్సిటోసిన్ హార్మోన్ వెలువడుతుంది. ఇది పాలు పడడానికే కాకుండా గర్భాశయం త్వరగా సంకోచించడానికీ సహాయపడుతుంది. దీనివలన్ కాన్పు తరువాత రక్తస్రావం తగ్గుతుంది. మాతృ మరణాల్లో చాలా వరకో రక్తస్రావం ఆగకపోవడమే ముఖ్య కారణంగా ఉంటోంది. అదేవిధంగా బిడ్డకు పాలుపట్టడం వలన తల్లి శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. అందువలన తల్లి గర్భధారణ సమయంలో పెరిగిన బరువు త్వరగా తగ్గుతుంది. బిడ్డకు పాలు పడుతున్నపుడు నెలసరి ఆలస్యం అవుతుంది. దానితో వెంటనే గర్భం ధరించే అవకాశమూ కొంత మేర తగ్గుతుంది. ఇక బిడ్డకు పాలిచ్చిన తల్లులకు రొమ్ము కాన్సర్, గర్భాశయ కాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది. గుందేజబ్బులూ, మధు మేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులూ దరిచేరే అవకాశం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

పోషకాలెన్నో...

తల్లిపాలలో మరే ఇతర పాలల్లో లేనన్ని పోషకాలు ఉన్నాయి. అంతేకాదు తల్లిపాలు బిడ్డ అవసరాలకు అనుగుణంగా తమలోని పోషకాల్ని మార్చుకుంటాయి. మొదటి నాలుగురోజులు ముర్రుపాలు వస్తాయి. ఇవి బిడ్డకు పోషణ, రక్షణ కల్పిస్తాయి. నాలుగోరోజు నుంచి రెండు వారాల వయసు వరకూ ల్యాక్టోజ్‌, కొవ్వులు ఎక్కువగా ఉన్న పల్చటి పాలుగా మారిపోతాయి. ఇక రెండో వారం తరువాత 90% నీరు.. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు 8%.. ఖనిజాలు, విటమిన్లు 2% కలిగిన సంపూర్ణ పోశాకాహారంగా మార్పు చెంది బిడ్డ తదుపరి ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

తప్పక పట్టాల్సిందే..

బిడ్డ పుట్టిన గంటలోపు వచ్చే ముర్రుపాలు బిడ్డకు సంజీవని లాంటివి. ఇవి కచ్చితంగా బిడ్డకు పట్టాల్సిందే. ఎందుకంటే వీటిలో శిశువు ఎదుగుదలకు అత్యవసరమైన పోషకాలతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే యాంటీబాడీలూ ఉంటాయి. తొలి గంటలో తల్లిపాలు పట్టడం ద్వారా 10 లక్షల శిశు మరణాలను నివారించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్న మాట. ఒకవేళ బిడ్డకు ఏదైనా సమస్య వచ్చి ఇంక్యుబురేటర్ లో ఉంచాల్సి వచ్చినా తల్లిపాలను పిండి ట్యూబ్ లేదా స్పూన్ తో తాగించడానికి ప్రయత్నించాలి.

ఎన్ని రోజులు తల్లిపాలు ఇవ్వాలి..

ఆరునెలల వరకూ కచ్చితంగా తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం శ్రేయస్కరం అంటున్నారు డాక్టర్లు. అంటే ఆ తరువాత మానేయాలని కాదు. ఆ తరువాత ఘానాహారాన్ని పిల్లలకు అలవాటు చేసినా, తల్లిపాలు ఇవ్వగలిగితే చాలా మంచిది. ఇలా రెండేళ్ళ వయసు వచ్చే వరకూ తల్లికి పాలు పడుతుంటే బిడ్డకు తాగించడమే మంచిదని వారు చెబుతున్నారు. అటు తరువాత కూడా వీలైతే ఇబ్బంది లేనంత వరకూ తల్లిపాలు ఇవ్వచ్చట.

సీసాపాలతో ఇక్కట్లేన్నో..

తల్లికి సమస్య ఉంది పాలు ఇవ్వలేని పరిస్థితిలో తప్పదు కానీ, సీసాపాలు ఎప్పటికీ మంచిది కాదంటున్నారు వైద్యులు. కేవలం సీసాల మూలంగానే మనదేశంలో ప్రతి సంవత్సరం 5-6 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారాని ఓ లెక్క. తల్లిపాలు పడితే వీటిని పూర్తిగా నివారించుకోవచ్చు. సీసాలు శుభ్రం చేయడం.. వాటిని అంటిన బాక్టీరియా రోగకారక క్రిముల కారణంగా పిల్లలకు ఆరోగ్యం పాడవడం వంటివి ఎన్నో ఇబ్బందులు సీసా పాలతో వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా తల్లీ, బిడ్డల అనుబంధానికి సీసా పాలు పెద్ద అవరోధం. తల్లి దగ్గరకు తీసుకుని పాలివ్వడంలో తల్లితో ఉండే సాన్నిహిత్యం బిడ్డకు, తల్లికీ కూడా ప్రేమపూరిత వాత్సల్యాన్ని అందిస్తుంది.

తల్లిపాలు అందక పోవడం వల్ల..

తల్లి పాలు ఇవ్వక పోవడం..లేదా లభ్యం కాకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8.23 లక్షల మంది పిల్లలు ఐదేళ్ల లోపు మృత్యువాత పడుతున్నారని ఒక అంచనా. అదేవిధంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడి సంభవిస్తున్న 20 వేల మరణాలను తల్లిపాలు పిల్లలకు ఇచ్చేలా చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు.

చనుబాల గొప్పతనం తెలీక కొంతమంది, మూఢ నమ్మకాలతో మరికొంతమంది.. ఇచ్చే వెసులుబాటు లేకపోవడం చేత కొందరు, బయట పనులకు వెళ్ళాల్సి రావడంతో మరికొందరు.. రొమ్ముల బిగువు తగ్గుతుందనే భయంతో ఇంకొందరు తమ బిడ్డలకు అమృతాన్ని ఇవ్వలేకపోతున్నారు. మన దేశంలో కేవలం 37శాతం మంది మాత్రమే ఆరునెలల వరకూ పూర్తిగా తల్లిపాలు తాగుతున్నారంటే పరిస్థ్తితి అర్థం చేసుకోవచ్చు.

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రతిఒక్కరూ ఈ చనుబాల అమృతం చేసే మేలును మహిళలకు తెలియ చెప్పాలి. వీలైనంత వరకూ తల్లి ప్రతి ఒక్కరూ చనుబాలు పిల్లలకు పట్టేలా అవగాహన కల్పించాలి. ప్రభుత్వాలే అన్ని పనుల్లో చేయలేవు. మనం కూడా మనవంతు ప్రచారం చేయాల్సి ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న వారికి తల్లిపాల విశిష్టతను విడమర్చి చెప్పడం ద్వారా తల్లి అయిన వెంటనే తన పసిడి పసిప్రాణానికి తాను మాత్రమె అమృతాన్ని అందించగలననే అవగాహన పెంచాలి. ఆ అమృతాన్ని అందించేందుకు తహతహలాడేలా చేయాలి.

చివరగా ఈ మాట తెలుసుకోవాల్సిందే.. తల్లులందరికీ చెప్పాల్సిందే!

తల్లిపాలలో 'హ్యూమన్‌ ఓలిగోసాక్రైడ్లు' అనే చక్కెరలు ఉంటాయి. పాలిచ్చే జంతువుల్లో వేటిల్లోనూ ఇవి ఉండవు. ఇవి తల్లిపాలకే ప్రత్యేకం!

ఇవి శిశువులు జీర్ణించు కోవడంలో కొంత ఇబ్బంది ఉన్నా, ఇవి శిశువు పేగుల్లో హాని కారక బ్యాక్టీరియాను నిలువరించి.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక ప్రతిస్పందనలనూ నేర్పిస్తాయి. ఇలా శిశువులు ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories