కాలం పరుగులు తీస్తుంది. మార్పులు తెస్తుంది. జ్ఞాపకాల్ని మరుగున పెడుతుంది. కొత్త ఆలోచనల్నీ.. సరికొత్త పోకడల్నీ మోసుకు వస్తుంది. జీవజాతి మనుగడలో...
కాలం పరుగులు తీస్తుంది. మార్పులు తెస్తుంది. జ్ఞాపకాల్ని మరుగున పెడుతుంది. కొత్త ఆలోచనల్నీ.. సరికొత్త పోకడల్నీ మోసుకు వస్తుంది. జీవజాతి మనుగడలో చరిత్రగా ఎన్నిటినో మిగిల్చి పోయింది కాలం. ఆధునికతను మోసుకొచ్చి.. సంప్రదాయాల మీద దాడి చేస్తూనే ఉంటోంది కాలం. ఈ క్రమంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెను పోకడలు అన్ని రంగాల్లోనూ చోటు చేసుకున్నాయి. కొన్ని దేశాల సంస్కృతి తెరమరుగైపోయింది. కానీ, అఖండ భారతావని ఇప్పటివరకూ కాలం మాయలో పడి తన సంప్రదాయ మూలాల్ని వదులుకోలేదు. విపరీతమైన ప్రపంచీకరణ పోకడలలో కోడా తనదైన సంప్రదాయ వారసత్వ సంపదను కాపాడుకుంటూ వస్తోంది. అందులో చేనేత ఒకటి. భారతదేశం చేనేత కళకు ప్రపంచవ్యాప్త అభిమానులు ఉన్నారు. అప్పుడు.. ఇప్పుడు.. మన చేనేతను ఎందరో అభిమానిస్తూనే వస్తున్నారు. అయితే, ఆధునీకరణ పోకడల మధ్య మన చేనేత రంగం కొంత ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఏటా ఆగస్టు 7వ తేదీనీ జాతీయ చేనేత దినోత్సవం గా నిర్వహించాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా చేనేత గురించిన కొన్ని విశేషాల మాలిక ఇది..
చేనేత మన వారసత్వ సంపద. ప్రస్తుతం ఎన్నో కారణాలతో ఈ వ్యవస్థ ఇబ్బందులు పడుతూ వస్తోంది. మర్పుల్ని సరైన సమయంలో అందిపుచ్చుకోలేక పోవడం.. అవిద్య.. ప్రజలలో ప్రబలిన పాశ్చాత్య ధోరణులు.. పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయం.. తరిగిపోతున్న అమ్మకాలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటోంది మన చేనేత రంగం. ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చేనేతను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఫ్యాషన్ ప్రపంచ ధోరణి మారుతోందా..
దీనికి అవుననే సమాధానం చెప్పొచ్చు. విదేశీ వస్త్రాలనే ఇంతకు ముందు ఫ్యాషన్ డిజైనర్లు విరివిగా వాడుతూ.. వాటినే ప్రచారం చేసేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా చేనేత వస్త్రాలపై వారు దృష్టి పెడుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్యాషన్ షోలలో చేనేతతో రూపొందించిన వస్త్రాల శైలిని ప్రదర్శించడం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు మన చేనేత కళాకారులు కూడా ఆధునిక శైలితో పోటీ పడే విధంగా ఈ షోలు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలు.. చేనేత వస్త్రాలు..
మన తెలుగు రాష్ట్రాల చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం చీరలకు దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నై, బెంగుళూరు, ఇండోర్ ప్రాంతాలతోపాటు అమెరికా, జర్మనీ, సింగపూర్ తదితర దేశాలకు సైతం మన చేనేత కార్మికులు రూపొందించిన వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో దాదాపు 14 శాతం తెలంగాణా నుంచే ఎగుమతి అవుతుండడం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే, చేనేత కళాకారులకు ఇప్పటికీ కొంత ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ముడిసరకు ధరల్లో పెరుగుదల.. తయారు చేసిన వస్త్రాలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం వారిని ఇప్పటికీ వేధిస్తున్నాయి. ఆధునిక యంత్రాలు వారి జీవనాన్ని క్లిష్టంగా మారుస్తున్నాయి. చేనేత వస్త్రం తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. మర్రమగ్గాలు నేటికీ చాలా మందికి అందుబాటులో లేవన్నది చెదు నిజం. రోజు రోజుకీ వారి జీవన పరిస్థితుల్లో క్షీణత కనిపిసుండడం కలవార పెట్టె అంశమే. అయితే, ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ సమస్యలపై దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో చేనేతకు మంచి వైభవం వచ్చే అవకాశం ఉంది.
ఒడిగడుతున్న దీపానికి చేతులు అడ్డుపెడుతున్నారు..
చేనేత పరిశ్రమ అనేక సమస్యలతో తల్లడిల్లుతున్న చేనేతకు చేదోడుగా నిలబడటానికి సాక్షాత్తు ప్రధాన మంత్రే నడుం బిగించారు. మన దుస్తుల అవసరాల్లో కనీసం 5 శాతం చేనేత ఉండేలా చూడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇక సెలబ్రిటీలు చెబితే వినని వారుండరు కదా. ఇప్పుడు సెలబ్రిటీలు ఈ విషయంపై ప్రత్యెక దృష్టి సారిస్తున్నారు. సమంత, విద్యాబాలన్ వంటి నటీమణులు వుయ్ లవ్ హ్యాండ్ లూమ్స్ అంటూ తమ వంతు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా చేనేత వస్త్రాలను ధరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ సహా పలువురు చేనేత వస్త్రాలనే ధరించి చేనేతకు బ్రాండ్ అంబాసిడార్లుగా నిలుస్తున్నారు. దురదృష్టవశాత్తూ నిన్న తనువు చాలించిన నేత సుష్మాస్వరాజ్ చేనేత వస్త్రధారణ ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు ప్రత్యెక గుర్తింపు తీసుకువచ్చిందంటే అతిశయోక్తి కాదు.
మనమేం చేయాలి..
మన సంప్రదాయాల్ని నిలబెట్టుకునే బాధ్యత మనమీదే ఉంది. ప్రధాని పిలుపు ఇచ్చినట్టు కనీసం 5శాతం వస్త్రాల్ని చేనేత తో తయారైనవి ఉండేలా చూసుకోవడం ద్వారా భారతీయతను సగర్వంగా తలెత్తుకు నిలిచేలా చేయొచ్చు. అంతేకాదు.. భావితరాలకు చేనేత వస్త్రాలపై కాంక్షను పెంపొందింప చేయొచ్చు. ఆ దిశలో కృషి చేయడం ఈరోజు నుంచే ప్రారంభిద్దాం. మన సాంప్రదాయ కళ..భవిష్యత్ తరాలకు కల కాకుండా చేయడం మన చేతుల్లోనే ఉంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire