TSRTC: ఇవాళ్టి నుంచి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ల జారీ

Zero Tickets will be Issued in TSRTC Buses From Today
x

TSRTC: ఇవాళ్టి నుంచి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ల జారీ

Highlights

TSRTC: మహిళా ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి

TSRTC: మహాలక్ష్మి - మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో భాగంగా ఇవాళ్టి నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి - మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. అయితే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను సంస్థ అప్‌డేట్‌ చేసింది. ఆ సాఫ్ట్‌వేర్‌తో మెషిన్ల ద్వారా ఇవాళ్టి నుంచి జీరో టికెట్లను TSRTC జారీ చేయనుంది. ఇందులో భాగంగా.. స్థానికత ధృవీకరణ కోసం.. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని కండక్టర్లకు చూపించి.. విధిగా జీరో టికెట్లను తీసుకోవాలి. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్‌ జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని TSRTC ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసి, అందుబాటులోకి తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా సజ్జనార్ అభినందించారు. ఇక.. ఈ సమావేశంలో TSRTC సీఓఓ డాక్టర్ రవీందర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మునిశేఖర్, సీటీఎం జీవన్‌ప్రసాద్‌, CEIT రాజశేఖర్, ఐటీ ఏటీఎం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories