ఆన్ లైన్ గేములతో నిండా మునుగుతున్న యువత.. కారణమైన వారిని అరెస్టు చేసిన పోలీసులు
Online Games Fraud: ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంటుంది... దానిని అనుసంధానంగా నెట్ కనెక్షన్ తీసుకుంటారు.
Online Games Fraud: ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంటుంది... దానిని అనుసంధానంగా నెట్ కనెక్షన్ తీసుకుంటారు. ఇంకేముంది ప్రపంచమే తన ముందు ఉంటుంది. ఇలాంటి అవకాశాన్నే కొంతమంది అలుసుగా తీసుకుంటున్నారు. ఆన్ లైన్ గేమ్ లను ఆడుతున్నవారిని ముందుగా ముగ్గులోకి దింపి, నెమ్మదిగా వాటికి బానిసయ్యేలా చేస్తున్నారు. తరువాత తను నుంచి అనుకున్నంత మేర సొమ్ములు లాక్కునేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇలాంటి వారినే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి ఖాతాల్లో ఉన్న రూ. 30 కోట్ల వరకు నిధులను ఫ్రీజ్ చేశారు.
ఆన్‌లైన్ గేమ్స్‌కు యువతను బానిసలు చేసి, భారీగా డబ్బు కొల్లగొడుతున్న సంఘటనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ–కామర్స్ పేరుతో సంస్థల్ని, వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు.. ఈ ముసుగులో ఆన్‌లైన్ గేమ్‌ను ప్రోత్సహిస్తూ ఆదాయం గడిస్తున్నాయి. తాజాగా కలర్ ప్రిడిక్షన్ పేరుతో రూపొందించిన ఓ గేమ్ యువతను నిండా ముంచుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే దేశంలో రూ.1100 కోట్ల టర్నోవర్ చేసిన ఈ గేమ్.. ఇప్పటికే రూ.110 కోట్లను విదేశాలకు తీసుకెళ్లింది. దీనిపై ఫిర్యాదు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఓ చైనీయుడి సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం కొత్వాల్ అంజనీకుమార్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ గేమ్ నిర్వహిస్తున్న సంస్థలకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు.
ఎలా ఏ మారుస్తున్నారంటే..
నిర్వాహకులు ఈ గేమ్‌ను ఓ ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించారు. ఓ కొత్త వ్యక్తి ఇందులోకి ప్రవేశించినప్పుడు అతడి ఐపీ అడ్రస్, ఇతర వివరాలను అది సంగ్రహిస్తుంది. అనంతరం తొలుత కొన్నిరోజులపాటు అతడు పందెం గెలిచేలా చేసి బానిసగా మారుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్ని గేమ్‌లలో ఓడేలా.. పూర్తిగా బానిసగా మారిన తర్వాత అన్నీ ఓడిపోయేలా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఉంటోంది. దీంతో దీని వలలో చిక్కి గేమ్ ఆడినవాళ్లు నష్టపోవడమే తప్ప.. లాభపడటం అనేది జరగట్లేదు. ఇలా నష్టపోయినవారిని దళారులుగా మార్చుకుంటూ మరికొంత మందిని తమ వలలో చిక్కేలా గేమ్ నిర్వాహకులు పథకం వేశారు. ఈ గేమ్‌లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా కొత్తవారిని ఆకర్షించి వారికి రిఫరల్ కోడ్ ఇస్తే.. రూ.1000 కమీషన్‌గా ఇస్తున్నారు. అంతేకాకుండా అతడు ఆడి, కోల్పోయే మొత్తం నుంచి 10 శాతం కూడా ఇస్తున్నారు. ఇలా మరింతమందిని ఈ ఉచ్చులో దింపేలా వారిని ప్రోత్సహిస్తున్నారు.
డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు: లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గేమ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఉచ్చులో చిక్కి రూ.లక్షల్లో కోల్పో యిన అనేక మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. హైదరాబాద్‌లో రూ.6 లక్షలు కోల్పోయిన ఎస్సార్‌నగర్ యువకుడితో పాటు రూ.15 లక్షలు కోల్పోయిన ఆదిలాబాద్ యువకుడు, తమిళనాడులో పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు రూ.97వేలు, మరో యువకుడు రూ.1.64 లక్షలు పోగొట్టుకోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ సంస్థలు, వ్యవహారాలను చైనాకు చెందిన బీజింగ్ టి పవర్ అనే సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు నిర్ధారిం చారు. ఈ ఆధారాలను బట్టి ఢిల్లీలో ఉంటున్న ఈ సంస్థ సౌత్‌ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్న చైనా జాతీయుడు యా హౌతో పాటు డైరెక్టర్లుగా పని చేస్తున్న ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను అరెస్టు చేశారు. వీరిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 28 కేసులు నమోదు కావడంతో అరెస్టు సమాచారాన్ని ఆయా అధికారులకు తెలపాలని నిర్ణయించారు.
ఏమిటీ కలర్ ప్రిడిక్షన్?
చైనాకు చెందిన సూత్రధారులు భారత్‌లో ఉంటున్న యువతను టార్గెట్ చేస్తూ కలర్ ప్రిడిక్షన్ గేమ్‌ను తయారుచేశారు. ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఈ సూత్రధారులు.. ఈ–కామర్స్ లావాదేవీల పేరుతో అక్కడి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో (ఆర్వోసీ) ఎనిమిది సంస్థల్ని నమోదు చేశారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో వివిధ ఈ–కామర్స్ వెబ్‌సైట్లు నడుపుతున్నాయి. ఈ సైట్స్‌లోకి ప్రవేశించినవారు ఓ మూలన ఉండే లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా కలర్ ప్రిడిక్షన్ గేమ్‌లోకి వెళ్లొచ్చు. అయితే ఎవరికి వారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. అప్పటికే ఈ గేమ్ ఆడుతున్న వారు ఇచ్చే రిఫరల్ ఐడీ ద్వారా గేమ్‌లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న ఆçప్షన్‌లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఒకటి ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత గేమ్‌లో ప్రోగ్రామింగ్ రన్ అయి, ఓ రంగు వచ్చి ఆగుతుంది. పందెం కాసినవారు ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్ల డబ్బు వారి పేటీఎం ఖాతాలోకి జమ అవుతుంది. రాకపోతే పందెం కాసిన మొత్తం ఆ సంస్థకు చెందుతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire