TS BJP: తెలంగాణ కమలంలో.. ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా?

Will Those Who Are MPs Contest As MLAs In The Telangana BJP
x

TS BJP: తెలంగాణ కమలంలో.. ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా?

Highlights

TS BJP: కరీంనగర్‌, వేములవాడ, ఆదిలాబాద్, ముథోల్‌ నుంచి పోటీకి సంజయ్‌ సన్నాహాలు?

TS BJP: అసెంబ్లీ ఎన్నికలపై లోక్‌సభ ఎంపీల గురి... ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన పార్టీల్లో ఎంపీలుగా ఉన్నవారంతా అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ పాలిటిక్స్ కంటే.. లోకల్‌ పాలిటిక్స్‌లో తమ పట్టు పెంచుకోవడంపైనే ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌లో పలువురు ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తుండగా.. అటు కాంగ్రెస్‌లో కూడా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కమలం పార్టీలో కూడా సమీకరణాలు ఇలాగే కనిపిస్తున్నాయి. అయితే ఎంపీలంతా పక్కా వ్యూహంతోనే ఈసారి అసెంబ్లీకి వెళ్లాలనుకుంటున్నారా..? అధికారంలోకి రాక‌పోయినా కీల‌కంగా ఉండొచ్చన్న ప్లాన్‌లో భాగంగానే అసెంబ్లీ బరికి సిద్ధమవుతున్నారా? అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ బీజేపీలో ఎంపీలుగా ఉన్న వారితో పాటు మాజీ ఎంపీలు కూడా ఈ సారి అసెంబ్లీ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేలా అధిష్టానం ప్లాన్ చేస్తుందంటూ గతంలోనే ప్రచారం సాగింది. అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదంటూ కొందరు నేతలు ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీలు కచ్చితంగా బరిలోకి దిగే అవకాశాలున్నాయంటూ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు.. ఈసారి అసెంబ్లీ బరిలో దిగుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

అంబర్‌పేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన కిషన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయి సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయన మరోసారి అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావు ఆయన సొంత నియోజకవర్గం బోథ్ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. గతంలోనూ బోథ్ స్థానంలో పోటీ చేసిన బాపూరావు.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కరీంనగర్‌ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓటమిపాలైన బండి సంజయ్.. అదే స్థానం నుంచి పార్లమెంట్‌ మెట్లెక్కారు. ఇప్పుడు ఆయన కరీంనగర్, వేములవాడ నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలు కాకపోయినా.. ముథోల్, ఆదిలాబాద్ నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలున్నాయి.గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అర్వింద్ ఈసారి ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఛాన్స్ లేకపోతే.. నిజామాబాద్ అర్బన్ లేదా రూరల్ నియోజకవర్గాల నుంచి కూడా అర్వింద్ పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఎంపీగా గెలవాలంటే.. నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో పట్టు సాధించాలి. అందులో ప్రతీ స్థానం అభ్యర్థులకు కీలకమే. ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆశించిన పట్టు సాధించకపోతే విజయం సాధించడం కష్టమే. అందుకే ఒక లోక్‌సభ నియోజకవర్గం కంటే.. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించుకోవడం బెటర్ అనే ఆలోచనలో ప్రస్తుత బీజేపీ ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న నేతలు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నేతలుగా ఉన్నవారే. అందుకే పార్లమెంట్‌ కంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిస్తే.. పార్టీ అధికారంలోకి రాకపోయినా స్టేట్ పాలిటిక్స్‌లో మరింత కీలకంగా మారే అవకాశాలుంటాయి. ఈ ప్లాన్‌తోనే ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలనే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories