Telangana: బీఆర్ఎస్‌ను రేవంత్ రెడ్డి ఖాళీ చేస్తారా?

Telangana: బీఆర్ఎస్‌ను రేవంత్ రెడ్డి ఖాళీ చేస్తారా?
x
Highlights

బీఆర్ఎస్ అన్నది గతం. ఇక ముందు టార్చిలైట్ పట్టుకొని వెతికినా కూడా బీఆర్ఎస్ కన్పించదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూలై 4న దిల్లీలో వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

బీఆర్ఎస్ అన్నది గతం. ఇక ముందు టార్చిలైట్ పట్టుకొని వెతికినా కూడా బీఆర్ఎస్ కన్పించదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూలై 4న దిల్లీలో వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరంతా తెలంగాణ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు గులాబీ బాస్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీలు పార్టీ మారడం ఆ పార్టీ నాయకత్వాన్ని రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

బీఆర్ఎస్ నాయకులు వరసగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం వెనుక ఇంకా పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. శాసన మండలి, శాసనసభ బీఆర్ఎస్ పక్షాలను గంపగుత్తగా కాంగ్రెస్‌లో విలీనం చేసే పెద్ద ప్లాన్ అమలవుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రక్రియ ఇంకో నెల రోజుల్లో పూర్తయిపోతుందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ వలసలు

అది 2024 మార్చి 17... హైద్రాబాద్ లో రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమం.... కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నవారికి గేట్లు తెరుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీన్ కట్ చేస్తే మీట్ ది ప్రెస్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేపటికే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ ఏడాది మార్చి 17న బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

2024 ఏప్రిల్ 07 ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 2024 మార్చి 31న కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. 2024 జూన్ 21న మాజీ అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పోచారం కారు దిగిన మూడు రోజులకే 2024 జూన్ 24న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మండలిలో బలం పెంచుకొనేందుకు కాంగ్రెస్ వ్యూహం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు ఆ పార్టీ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. జూలై 5న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, దండె విఠల్, ఎం.ఎస్. ప్రభాకర్, యెగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, బస్వరాజ్ సారయ్యలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శాసనమండలిలో ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి బీఆర్ఎస్ ను వీడడం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేసింది. శాసనమండలిలో కాంగ్రెస్ కు నామమాత్రంగానే బలం ఉంది. దీంతో మండలిలో బలం పెంచుకొనేందుకు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ నాయకత్వం గాలం వేసిందని రాజకీయవర్గాల్లో టాక్.

ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అప్పటిలోపుగా శాసనసభలో, శాసనమండలిలో వీలైనంత మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో బిల్లులు పాసయ్యేందుకు కాంగ్రెస్ కు అవసరమైన బలం ఉంది. కానీ, మండలిలో బలం లేనందున ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ వల వేసింది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు. అయితే ఇందులో బీఆర్ఎస్ కు 25 మంది ఎమ్మెల్సీలున్నారు.

కాంగ్రెస్ కు మండలిలో అధికారికంగా నలుగురు ఎమ్మెల్సీలున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2023 నవంబర్ కు ముందు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మండలిలో ఆ పార్టీ బలం 12కు చేరింది. మరో 9 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే మండలిలో ఆ పార్టీకి ఇబ్బంది ఉండదు.

బీఆర్ఎస్ ను ఎందుకు వీడుతున్నారు?

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారానికి దూరమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు మూడు స్థానాల్లో గెలిచినా పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితులు అన్ని సర్దుకుంటాయి... అధికారంలోకి వస్తామని పార్టీ ప్రజా ప్రతినిధుల్లో విశ్వాసం నింపేలా మాట్లాడారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఈ సమావేశం జరిగిన రెండు రోజులకే చేవేళ్ల ఎమ్మెల్యే కారు దిగారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి , కే.కేశవరావు లాంటి నాయకులు కారు దిగడం చర్చనీయాంశంగా మారింది.

తమ రాజకీయ స్వార్థం కోసమే బీఆర్ఎస్ ను వీడుతున్నారని పార్టీని వీడిన వారినుద్దేశించి గులాబీ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలను పార్టీ మారిన నాయకులు తోసిపుచ్చుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు బాగున్నాయని చెబుతున్నారు. రైతు సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ విధానాలు నచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్ చూపిన బాటలోనే

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. 2014, 2018లలో వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల శాసనసభపక్షాలను బీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం అదే దారిలో రేవంత్ వెళ్తుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న మాట.

అసెంబ్లీలో, మండలిలో కూడా బీఆర్ఎస్ నుండి రెండింట మూడొంతుల మంది ప్రజా ప్రతినిధులను తమ వైపునకు తిప్పుకొనేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కు ఆ పార్టీ తెరతీసింది. టార్చిలైట్ పట్టుకొని వెతికినా కూడా బీఆర్ఎస్ కన్పించదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన గంటల వ్యవధిలోనే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని నెలలకే గులాబీ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గ్రేటర్ లో కూడా బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తప్పదనే ప్రచారం సాగుతుంది. వలసలకు గేట్లు ఎత్తితే ఎలా ఉంటుందో కేసీఆర్ కు తెలిసివచ్చేలా చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories