ఆ నలుగురు మంత్రుల మధ్య గ్యాపెందుకు?

ఆ నలుగురు మంత్రుల మధ్య గ్యాపెందుకు?
x
Highlights

తెలంగాణలో అదో రాజకీయ చైతన్య అడ్డ. ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన గడ్డ కూడా.

తెలంగాణలో అదో రాజకీయ చైతన్య అడ్డ. ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన గడ్డ కూడా. ఉవ్వెత్తు ఉద్యమ ఫలితానికి ఆ జిల్లా నుండి నలుగురు మంత్రులున్నారు...ఇంకో కేబినేట్ హోదా గల నేత కూడా ఉన్నారు. కాకపోతే వారు రాష్ట్రానికి మంత్రులే అయినా ఆ జిల్లాలో కూడా స్వతంత్రత లేదట. కేవలం ఆ కేబినేట్ మంత్రులు వారి అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితమట. పార్టీ క్యాడర్, అభిమాన సంఘాలున్నా మీ మంత్రి వద్దకే వెళ్లాలి తప్ప, ఇటు రావొద్దని ఓపెన్ గా చెప్పేస్తున్నారట. ఇంతకీ ఆ మంత్రులు ఎందుకు, లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు... వారు కనీసం జిల్లాలో కూడా ఎందుకు వేలు పెట్టడం లేదు.

ఇదిగో ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాని, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర్రంలో కాని రాజకీయ చైతన్య ఖిల్లానే. తెలంగాణ ఉద్యమ గడ్డ కరీంనగర్ కు, సిఎం కేసిఆర్ కేబినేట్ లో మంచి ప్రాధాన్యతే కల్పించారు. ఈ ఉమ్మడి జిల్లా నుంచి ప్రస్తుతం నలుగురు కేబినేట్ మంత్రులున్నారు. గతంలో ఎప్పుడు ఒకరికి మించి మంత్రులు లేరు..ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే జిల్లాకి రెండు మంత్రి పదవులు వచ్చాయి. అయితే తెలంగాణ వచ్చాక మొదటి ప్రభుత్వంలో కూడా రెండే మంత్రి పదవులు ఉన్నా, జిల్లాకి రెండో ప్రభుత్వంలో నాలుగు మంత్రి పదవులు వచ్చాయి.

అయితే ఇంతమంది మంత్రులు ఉన్నప్పటికీ, వాళ్ళు బార్డర్ గీసుకుని మరి తమ పరిధిలో మాత్రమే ఉంటున్నారట. ఇదిగో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మంత్రులుగా కెటియర్, ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఉన్నారు. అయితే ఈ నలుగురు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారి కూడా ఒకే వేదికపై కనపడలేదు. దీనికి కారణం ఎవరికివారు తమ పరిధిలో ఉంటూ ..తమ పరిధిలోకి వేరే వారికీ సంబంధం లేకుండా పనులు చేసుకుంటున్నారు.

ఇదిగో టీఆర్ఎస్‌ ఫైర్‌ బ్రాండ్, రాష్ట్రమంతటా చక్రం తిప్పుతున్న, ప్రభుత్వ పగ్గాలు తన చేతిలోనే ఉన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం తర్వాత సీఎంగా కేటిఆర్ ఉన్నా, జిల్లా విషయానికి వచ్చేసరికి కామోష్. సిరిసిల్ల జిల్లా నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కెటిఆర్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మిగితా ప్రాంతాలకి.,జిల్లా కేంద్రాల్లో జరిగే ఉమ్మడి జిల్లా అధికారిక సమావేశాలకు దూరంగానే ఉంటారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటం, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి కావడంతో బిజీ షెడ్యూల్స్ ఉంటాయంటున్నారు కార్యకర్తలు. మిగిలిన క్యాడర్ తన వద్దకు ఎవ్వరు వచ్చినా మీ మంత్రి వద్దకే వెళ్లండి....తన దగ్గరకు రావొద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారట. ప్రగతిబవన్ లో, హైదారాబాద్ అన్ని శాఖలపై సమీక్షలు చేస్తున్నా జిల్లా విషయానికొచ్చేసరికి కేవలం సిరిసిల్ల అధికారులు, తన నియోజకవర్గ నేతలతో మాత్రమే మాట్లాడుతున్నారట కేటిఆర్. కారణం ఏంటని అందరూ గుసగుసలాడుతోన్న ఎవ్వరూ ధైర్యం చేసి అడిగే పరిస్థితి లేదు.

ఇక మరో మంత్రి ఈటెల రాజేందర్. గత సర్కారులో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న రాజేందర్ ఇప్పుడు వైద్యారోగ్య శాఖ చూస్తున్నారు. గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చక్రం తిప్పినా, ఇప్పుడాయన తన సెగ్మెంట్ హుజురాబాద్ కే పరిమితమయ్యారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటనలు మానేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి ఈసారి కేబినేట్ బెర్త్ సంపాదించుకున్న మంత్రి గంగుల కమలాకర్ తో తనకు సఖ్యత లేదన్న ఓపెన్ సీక్రెట్. గంగుల విశయంలో అనేకసార్లు పార్టీ హైకమాండ్ దగ్గర తన అలక, తన వాదన వినిపించారట కూడా.

కరీంనగర్‌లో ఆయనుండగా నేను వేలు పెడితే బాగోదు అనుకున్నారో ఏమో కాని, ఈటెల రాజేందర్ కరీంనగర్ మాటే ఎత్తడం మానేసారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్బంగా చాలామంది టికెట్ల కోసం రాజేందర్ వద్దకు వెళ్లినా, తనవల్ల కాదని చేతులేత్తేసారే తప్ప, గంగులకు ఫోన్ చేసి పలానా వారికి టికెట్లు ఇవ్వమని అడగలేదు. మంత్రి గంగుల కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ధోరణిలో మిగతా సెగ్మెంట్ల జోలికి పోవడం లేదు. తన చుట్టూ సీనియర్లు, సీనియర్ మంత్రుల సెగ్మెంట్లు ఉండటంతో తనకెందుకొచ్చింది గొడవ అని హైకమాండ్ సూచనల మేరకు చెప్పింది చేసుకుంటూ పోతున్నారట.

ముగ్గురు ఇలా ఉంటే, మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలు,పెద్దపల్లి జిల్లా కి మాత్రమే పూర్తిగా పరిమితం అయ్యారట. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంత్రులు ఎవరికివారు గిరి గీసుకుని ఎవరి లిమిట్్‌లో వాళ్ళు పని చేసుకుంటున్నారట. తమ శాఖకి సంబంధించిన అధికారిక సమావేశాలు ఉన్నా కూడా, ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాలకి వెళ్లడం లేదట మంత్రులు ఇలా ఉండటంతో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మాత్రం మంత్రుల దగ్గర ర్యాపో ఉండటం కోసం అందర్నీ కలుస్తూ తమ నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారు.

ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నలుగురు మంత్రులు, నాలుగు దిక్కులు అన్నట్టుగా ఎవరిపని వారు చేసుకుంటూపోతున్నారు తప్ప, ఉమ్మడిగా ముందుకు వెళ్లడం లేదన్న చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానమే వారి మధ్య గీత గీసిందా..లేదంటే ఎవరికి వారు లిమిట్స్ పెట్టుకున్నారా అన్నది ఎవ్వరికీ బోధపడ్డంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమకు జిల్లాలో మునుపటిలా స్వతంత్రత లేదని బాధపడిపోతున్నారట నలుగురిలో ముగ్గురు మంత్రులు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories