రాష్ట్రంలోనే ఆ నియోజకవర్గం ఓ ప్రత్యేకతను చాటుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఆ నియోకవర్గం వైపే చూశాయి. అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రజల తీర్పు...
రాష్ట్రంలోనే ఆ నియోజకవర్గం ఓ ప్రత్యేకతను చాటుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఆ నియోకవర్గం వైపే చూశాయి. అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రజల తీర్పు ఎలా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా దృష్టి సారించాయి. ఆ నియోజకవర్గమే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం. కాంగ్రెస్ ఫైర్ బాండ్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే తాను గెలిచినా ఓడినా తన చివరిశ్వాస వరకు కొడంగల్‌లోనే ఉంటా కొడంగల్ అభివృద్ది కోసమే పాటుపడతానని రేవంత్ రెడ్డి హామి ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆయన మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించడంతో, కొడంగల్‌ను మర్చిపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలెవరైనా అవసరం ఉంటే హైదరాబాద్ వెళ్లిరావాల్సిందే తప్ప, కొడంగల్‌లో రేవంత్ అన్ని సర్దుకున్నారు అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దూకుడును ఎందుకు ప్రదర్శించడం లేదు పార్టీకి పెద్దదిక్కుగా ఉండాల్సిన రేవంత్ కేవలం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికే పరిమితమయ్యారా.. ? ఇన్నాళ్లు ఆదరించి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలను రేవంత్ పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి అనూహ్యంగా కొడంగల్‌లో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, తనను ఓడించిన కొడంగల్ ప్రజలపై రేవంత్ ఆగ్రహంతో ఉన్నారా.. ? అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.
ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత కొడంగల్ నియోజకవర్గంతో దాదాపుగా రేవంత్ రెడ్డి సంబంధాలు దూరమయ్యాయి. ఎన్నికల సమయంలో తన నివాసంలో కార్యకర్తల సమావేశంలో చాలా భావోద్వేగంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆధారాభిమానాల వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని, ఏమిచ్చినా కొడంగల్ ప్రజల ఋణం తీర్చుకోలేనిదని, తన తుది శ్వాసవరకు ఇక్కడే ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
కానీ ఎన్నికల అనంతరం ఓటమి చెందడంతో కొడంగల్ ప్రజలకు దూరమయ్యారు రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనకపోవడం, నియోజకవర్గంతో రేవంత్ సంబంధాలు తెంచుకున్నారన్న సంకేతాలు ప్రజలకు వెళ్లినట్టయ్యింది.
ఎంపీ అయిన తర్వాత కోస్గితో పాటు నాగర్ కర్నూల్‌లో పర్యటించారు రేవంత్ రెడ్డి. ఐతే కోస్గి సన్మాన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, తనను ఓడించిన కొడంగల్ ఓటర్లకు కృతజ్తతలు అంటూ చెప్పిన మాటలు, చర్చనీయాంశమయ్యాయి. మీరు ఇక్కడ ఓడించడం వల్లే తాను ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్లగలిగానన్న వ్యాఖ్యలపై ఇంకా చర్చ జరుగుతోంది. అంటే కోపంతో అన్నారా నిజంగానే కృతజ్ణతాపూర్వకంగా అన్నారా అన్నది ఎవరికితోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. కొడంగల్‌కు ఇక తాను దూరం అయ్యాను అన్న సంకేతాలు ఇవ్వకనే ఇచ్చినట్టయ్యిందని కొందరు అనుకుంటుంటే, ఎమ్మెల్యేగా గెలిచి వుంటే, అసెంబ్లీలో ఒంటరిపోరు చెయ్యాల్సి వచ్చేదని, ఇప్పుడు పార్లమెంట్‌లో ధాటిగా మాట్లాడి, జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగే అవకాశమొచ్చిందని మరికొందరంటున్నారు.
ఐతే కొడంగల్ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డిని ఆదినుంచి అభిమానిస్తూ, ఆదరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండుసార్లు కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొట్ట మొదటిసారిగా టీడీపీ నుంచి పోటి చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడిపీలో చేరి, కొత్తగా కొడంగల్‌లో అడుగుపెట్టిన ఆయన, కేవలం 15 రోజుల ఎన్నికల ప్రచార వ్యవధిలోనే టీడీపీ అభ్యర్థిగా పోటి చేసి సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన గురునాథ్ రెడ్డిపై గెలుపొందారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనంలో సైతం, కొడంగల్‌లో విజయబావుటా ఎగరేశారు. 2009, 2014 టీడీపీతో విజయం సాధించిన రేవంత్, 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత స్థావరాన్ని రాజధానికి మార్చి, ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.
ఒక్కసారి ఓటమితోనే నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి సంబంధాలు తెంచుకున్నారా అని నియోజకవర్గ ప్రజలు తలోరితిలో చర్చించుకుంటున్నారు. చివరి శ్వాస వరకు కొడంగల్‌లోనే ఉంటానన్న ఆయన ఎమ్మెల్యేగా ఓటమితో ఎందుకు ఇటువైపు తిరిగిచూడటం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ బలహీన పడుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జిల్లాలో పార్టీని బలోపేతం చెయ్యాల్సిన బాధ్యతను విస్మరించి కేవలం మల్కాజిగిరికే పరిమితం కావడం పట్ల హస్తం కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. అయితే మొన్న నాగర్ కర్నూల్‌లో పర్యటించిన రేవంత్, నల్లమల్లలో యురేనియం వెలికితీతపై నిరసన వ్యక్తం చేశారు. ఇలా అప్పుడప్పుడైనా పాలమూరులో పర్యటించి, పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయాలని, కార్యకర్తలు కోరుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire