టికాయత్‌ అన్నారా...అనిపించారా.. కేసీఆర్‌పై రైతు నేత ఎందుకలా అన్నారు?

Why Rakesh Tikait Slams CM KCR
x

టికాయత్‌ అన్నారా...అనిపించారా.. కేసీఆర్‌పై రైతు నేత ఎందుకలా అన్నారు?

Highlights

Rakesh Tikait: ఎంత మాట...ఎంత మాట...గులాబీ దళాధిపతిని రైతు ఉద్యమ నాయకుడు ఎంత మాటన్నాడు అసలు ఆయనే అలా అన్నారా?

Rakesh Tikait: ఎంత మాట...ఎంత మాట...గులాబీ దళాధిపతిని రైతు ఉద్యమ నాయకుడు ఎంత మాటన్నాడు అసలు ఆయనే అలా అన్నారా? లేదంటే ఆయనతో ఎవరైనా అనిపించారా? కర్షక లీడర్‌ నుంచి అలాంటి కటువైన పొలిటికల్‌ డైలాగ్‌ దూసుకొచ్చిందేమిటి? ఇంతకీ రాకేష్ టికాయత్‌, సీఎం కేసీఆర్‌ను ఏమన్నారు? ఎందుకలా అన్నారు? ఈ మాటల వెనక మతలబు వుందా?

రాకేశ్‌ టికాయత్‌. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత. సాగు చట్టాలపై ఏడాదిగా పట్టు సడలని సంకల్పంతో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న లీడర్. గాలి, వాన, ఎండ, చలిని లెక్క చెయ్యకుండా, లాఠీ దెబ్బలు, పోలీసుల కాల్పులు, నేతల వాహనాలకు వెరవకుండా, రైతు ఉద్యమాన్ని మరో స్వాతంత్ర్య సంగ్రామంలా నడిపించిన లీడర్ రాకేశ్ టికాయత్. అయితే, హైదరాబాద్‌ మహాధర్నాకు వచ్చిన టికాయత్, సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వెళ్లారు. అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చీనీయాంశమైంది. ఇంతకీ టికాయత్‌ సాబ్‌ ఏమన్నారు?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, టీఆర్‌ఎస్ బీ టీం అట. ఔను మీరు విన్నది నిజమే. బీజేపీకి టీఆర్ఎస్‌ తోక పార్టీ అట. ఇవేవో కాంగ్రెస్ ఆరోపణలు కావు. దేశవ్యాప్తంగా పాపులరైన కర్షక లీడర్ రాకేష్ టికాయత్ అన్న మాటలివి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ పార్టీనే ఎక్కువగా మద్దతు ఇస్తోందని ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు టికాయత్. బీజేపీకి టీఆర్‌ఎస్‌ సహా వైసీపీ, మజ్లిస్‌ పార్టీలు బీ టీమ్‌ అని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాలా మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ సాగు చట్టాలకు వ్యతిరేకమని చెబితే నమ్మలేమన్నారు.

కేసీఆర్‌పై టికాయత్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఒకవైపు బీజేపీ మీద కేసీఆర్ ఓ రేంజ్‌లో ఫైట్ చేస్తుంటే, టికాయత్ ఇలాంటి కామెంట్లు చెయ్యడం చర్చనీయాంశమైంది. రైతుల ఉద్యమంపై తమ వైఖరిని టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతుల ఆందోళన చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇందిరాపార్కు వద్ద అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ శాఖ నిర్వహించిన మహాధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు టికాయత్. ఢిల్లీ శివార్లలో రైతు ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తామని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని ప్రస్తావించిన టికాయత్, తెలంగాణాలో కూడా మరణించిన రైతు కుటుంబాలకూ పరిహారం ఇవ్వాలని కోరారు.

రాకేశ్ టికాయత్‌ వ్యాఖ్యల సారాంశమేంటి? బీజేపీకి టీఆర్ఎస్‌ బీ టీం అని వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేంటి? ఆయన సొంతంగా అన్నారా? లేదంటే విపక్షాలే అలా పలికించాయా? ఇప్పుడివే ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని చెప్పే రాకేశ్‌ టికాయత్, ఫక్తు పొలిటికల్ కామెంట్లు చెయ్యడం పట్ల రకరకాల చర్చ జరుగుతోంది. రాకేశ్ టికాయత్, బీకేయూ అంటే భారతీయ కిసాన్ యూనియన్ నేత. మీరట్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చదివారు. ఎల్‌ఎల్్బీ చేశారు. 1992లో ఢిల్లీ పోలీస్‌ డిపార్ట్‌‌మెంట్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు.

బీకేయూను ఆయన తండ్రి మహేంద్ర టికాయత్‌ స్థాపించారు. ఆ‍యన మరణం తర్వాత రాకేశ్‌ తికాయత్‌ బాధ్యతలు తీసుకున్నారు. 2007లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ కిసాన్ దళ్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే 2014 ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ టికెట్‌ మీద అమ్రోహ లోక్‌సభ స్థానం నుంచి పోటీపడ్డారు. అంటే, రాకేశ్‌ టికాయత్‌ పూర్తిగా రాజకీయ నేత కాకపోయినా, ఆయన రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు, ఆయన కాంగ్రెస్‌ మద్దతుతోనే బరిలోకి దిగారు. అంటే, రాకేశ్‌ టికాయత్‌‌కు కాంగ్రెస్‌తోనే సంబంధాలున్నాయి. మరి అందుకే కాంగ్రెస్‌ టోన్‌లోనే, రాకేశ్‌ టికాయత్‌ కేసీఆర్‌పై ఇలాంటి సంచలన ఆరోపణలు చేశారా? సరిగ్గా కాంగ్రెస్‌ బాటలోనే కేసీఆర్‌పై‌ విమర్శలు చేశారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీల మధ్యే కొన్ని నెలలుగా డైలాగ్‌ వార్‌ సాగుతోంది. హుజురాబాద్‌ తర్వాత అది మరింత తీవ్రమైంది. వరిధాన్యం కొనుగోళ్లపై గులాబీ-కమలం మధ్య యుద్దం మరింత తీవ్రమైంది. దీంతో టీఆర్‌ఎస్-బీజేపీలు ఒక్కటేనంటూ, బీజేపీకి టీఆర్ఎస్ బీ టీం అంటూ కాంగ్రెస్‌ విమర్శిస్తూ వస్తోంది. ఇప్పుడు రాకేశ్ టికాయత్‌ కూడా, ఇలాంటి ఆరోపణలే సంధించారు. అయితే, టికాయత్‌ వ్యాఖ్యలను మాత్రం టీఆర్ఎస్ ఖండిస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్‌పై రైతు సంఘం నేత రాకేశ్‌ టికాయత్‌ కామెంట్లు కలకలం రేపుతున్నాయి. రైతు సంఘం నేతలా కాకుండా, పక్కా రాజకీయ పార్టీ లీడర్‌గా మాట్లాడారని టీఆర్ఎస్, బీజేపీలు విమర్శిస్తుంటే, వున్నదే ఆయన అన్నారని కాంగ్రెస్ సమర్థిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories