ఒంటి చేత్తో విజయాలు అందించిన పొంగులేటి ఇప్పుడెందుకు ఒంటరయ్యారు?

ఒంటి చేత్తో విజయాలు అందించిన పొంగులేటి ఇప్పుడెందుకు ఒంటరయ్యారు?
x
Highlights

పెనం నుండి ఆ లీడర్ పోయిలో పడ్డారని ఫీలవుతున్నారా...? ఒంటి చేత్తో విజయాలను అందించిన ఆయన, ఇప్పుడు రాజకీయంగా ఒంటరి అయ్యారా..? ఉన్న పదవి వదులుకొని...రాని...

పెనం నుండి ఆ లీడర్ పోయిలో పడ్డారని ఫీలవుతున్నారా...? ఒంటి చేత్తో విజయాలను అందించిన ఆయన, ఇప్పుడు రాజకీయంగా ఒంటరి అయ్యారా..? ఉన్న పదవి వదులుకొని...రాని పదవులకు ఆశపడి భంగ పడుతున్నారా...? అధిష్టానం ఆశీస్సులు ఉన్నా, అడ్డుపడే వారు ఎక్కువయ్యారా? ఇంతకీ ఆ లీడర్ బ్యాడ్ లక్‌లో ఉన్నారా? లేక పొలిటికల్‌గా బ్యాక్ బెంచిలో కూర్చున్నారా.

కాలం చేసే మాయ మామూలుగా వుండదు. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలుతాయి. ఇందుకు నిదర్శనం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిన్నటి వరకూ ఖమ్మం జిల్లాలో ఏ మూలకు వెళ్లినా మార్మోగిన ఈ పేరు ఇపుడు అక్కడక్కడ మాత్రమే వినిపిస్తుండటం శీనన్న అనుచరులకు మింగుడుపడటం లేదు. రాజకీయాల్లోకి రాకముందు బడా కాంట్రాక్టర్ గా మాత్రమే తెలిసిన పొంగులేటి, వైఎస్ జగన్ ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై గెలుపు సాధించారు. తనతో పాటు పినపాక, అశ్వారావుపేట, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం తన అనుచరులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని సత్తా చాటారు. జిల్లాలో పొంగులేటి చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ఆయనను కారు పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి కెటిఆర్ స్వయంగా ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి వచ్చి, తమ పార్టీలో చేర్చుకుంటున్నామని ప్రకటించారు. అప్పటి వరకూ జిల్లా టీఆర్ఎస్‌లో తిరుగులేని నేతగా ఉన్న తుమ్మలకు గట్టి పోటీనిచ్చే నేతగా పొంగులేటి అనతికాలంలోనే ఎదిగిపోయారు. ప్రతీ నియోజకవర్గంలోను తనకుంటూ ఓ వర్గాన్ని ఏర్పాటుచేసుకుని తిరుగులేని నేతగా మారారు. కానీ కాల ప్రవాహంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, రివర్స్‌ గేర్ వేశాయి.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా చక్రం తిప్పుతున్న పొంగులేటి రాజకీయ జీవితంలో, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు మొదటికే మోసం వచ్చిన చందంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భిన్నమైన ఫలితాలొచ్చాయి. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఖమ్మంలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్ విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైరా, కొత్తగూడెం,పాలేరు,అశ్వారావుపేట వంటి పలు నియోజకవర్గాల్లో పొంగులేటి అనుచరులు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఓటమికి పనిచేశారంటూ పార్టీ అధినేతకు ఫిర్యాదులు అందాయి. అసెంబ్లీ ఫలితాల తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో సాక్షాత్తూ పార్టీ అధినేత కెసిఆర్ ఖమ్మంలో కొందరు సొంతపార్టీ నేతలే తమవారిని ఓడించారని ప్రకటించడం సంచలనంగా మారింది.

ఎప్పుడైతే ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కారుపార్టీ బోల్తాపడింతో అప్పటి నుంచి పొంగులేటి రాజకీయ జీవితంలో చీకట్లు కమ్ముకోవడం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పొంగులేటి వ్యతిరేక వర్గీయులంతా ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో, సిట్టింగ్ ఎంపిగా ఉన్న ఆయనకు సీటు దక్కకుండా చేయడంలో విజయం సాధించారు. పార్టీ టికెట్ ప్రకటిస్తే చాలు సునాయాసంగా గెలుపొందగలిగే పరిస్థితుల్లో కళ్లముందే సీటు గల్లంతవడం కొత్తగా పార్టీలోకి వచ్చిన నామా నాగేశ్వరరావు గెలుపుకోసం పనిచేయాల్సి రావడం పొంగులేటి వర్గీయులకు అస్సలు మింగుడుపడలేదు. పార్లమెంటు ఎన్నికల నుంచి ఆయన పార్టీ మారుతారనే ప్రచారం విపరీతంగా జరిగినా, పొంగులేటి మాత్రం ఖండిస్తూ వచ్చారు. సిట్టింగ్ ఎంపి సీటును త్యాగం చేసిన తనకు రాజ్యసభ సభ్యత్వం వస్తుందనే దీమాతో ముందుకు సాగారు. పార్టీ అధినేత కెసిఆర్‌తో చనువు లేకున్నా యువ నేత కెటిఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం రాజ్యసభకు పంపుతుందనే నమ్మకం, చివరినిమిషంలో వమ్ముకావడం పొంగులేటి రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.

ఇన్నాళ్లు ఎదురుచూసిన రాజ్యసభ సీటు కూడా ఇటీవల పార్టీలోకి వచ్చిన తనసామాజిక వర్గానికిచెందిన సురేష్ రెడ్డి తన్నుకుపోవడం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీవ్రమైన వత్తిడికి గురిచేస్తోంది. ఎంతో నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకుని ముందుకు సాగుతున్నా, పార్టీ పెద్దలకు మాత్రం తనపై ఏమాత్రం నమ్మకం లేకపోవడం పొంగులేటి అనుచరుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నిన్నటి వరకూ జిల్లాలో పొంగులేటి అనుచరులుగా ఉన్నవారు సైతం క్రమంగా దూరమవుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మధిర నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్కకు ప్రత్యర్థిగా టిఆర్ఎస్ సీటు ఇప్పించుకున్న తన అనుచరుడు, లింగాల కమల్ రాజ్ గెలుపుకోసం కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం లేకుండాపోయింది. అదే కమల్ రాజ్ జెడ్పీ ఛైర్మన్ కాగానే ప్రస్తుత జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ శిబిరంలోకి వెళ్లిపోయారు. మరోవైపు తన రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసిన, వైరా నియోజకవర్గ రాజకీయ వర్గపోరులో వెన్నంటి నడిచిన మరో అనుచరుడు బొర్రా రాజశేఖర్ మార్క్ పెడ్ వైస్ ఛైర్మన్ పదవి రాగానే దూరంగా మసులుతుండటం కూడా పొంగులేటిని మనస్థాపానికి గురిచేస్తోంది. ఇలా నిన్నటి వరకూ పొంగులేటిని అంటిపెట్టుకున్నవారంత క్రమంగా దూరమవుతుండటం, కనుచూపు మేరల్లో రాజకీయ భవిష్యత్ కనిపించకపోవడం పొంగులేటి శిబిరాన్ని నిరుత్సాహానికి గురిచేస్తోంది.

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుత స్థితికి కొందరు అనుచరులు ఇచ్చిన పనికిరాని సలహాలే కారణమనే చర్చ జిల్లాలో సాగుతోంది. ఒకే పార్టీలో ఉండి గ్రూపులు ప్రోత్సహించడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించడం ప్రాంతీయ పార్టీలో వ్యక్తి కన్నా పార్టీ మిన్న అనే విషయాన్ని పూర్తిగా విస్మరించడం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి మింగుడుపడని అంశాలుగా మారాయనే వాదన వినిపిస్తోంది. తనకున్న ఆర్థిక వనరుల సాయంతో జిల్లాలో వ్యక్తిస్వామ్య రాజకీయాలకు తెరలేపిన పొంగులేటి వ్యవహారశైలిని, పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించడంతోనే, ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ లో కనుచూపుమేరా భవిష్యత్ లేకపోయినా, తెలంగాణా ప్రభుత్వంలో కొనసాగుతున్న సివిల్ కాంట్రాక్టులు కెటిఆర్‌తో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఉందిలే మంచికాలం ముందుముందునా అంటూ కారుపార్టీలో కాలక్షేపం చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం గురించి పొంగులేటి ఆలోచించడం లేదని సన్నిహితవర్గాల ఆశ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories