ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఇన్నాళ్ల మౌనం వెనక కథేంటి?

ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఇన్నాళ్ల మౌనం వెనక కథేంటి?
x
Highlights

తెలంగాణ బిజేపిలో ఆయన మొన్నటి వరకు ఓ కీలకమైన నేత వాగ్దాటి ఉన్న నాయకుడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కనిపించకుండా పోయారు. ఎమ్మెల్యేగా...

తెలంగాణ బిజేపిలో ఆయన మొన్నటి వరకు ఓ కీలకమైన నేత వాగ్దాటి ఉన్న నాయకుడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కనిపించకుండా పోయారు. ఎమ్మెల్యేగా గెలువక ముందు పార్టీ ఆపీస్‌నే పట్టుకొని ఉండే ఆయన, ఒక్కసారి గెలిచి ఓడిపోయిన తరువాత మాత్రం పార్టీతో తనకేం అవసరమనే భావనలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారట. మంచి జోష్ మీద పార్టీ ఉన్నా ఆయన మాత్రం ఎక్కడా కనిపించపోవడంతో, పార్టీలో ఆయనెక్కడా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ ఎవరాయన...?

తెలంగాణ బిజేపిలో కీలక నేతల్లో ఒకరు తాజామాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. అసెంబ్లీ బయటా లోపలా ధారాళంగా మాట్లాడి, పార్టీ బలమైన గళాల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో మోడీ హవా, టీడీపీ పొత్తుతో బీజేపీ నుంచి ఉప్పల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. నాటి నుంచి మౌనవ్రతంలోకి వెళ్లిపోయారు. చాలా నెలల తర్వాత, మొదటిసారి ప్రెస్‌మీట్‌ పెట్టారు. మరి నిత్యం విమర్శలతో విరుచుకుపడే ఎన్వీఎస్‌ఎస్‌, ఇన్నాళ్లు ఎందుకు మౌనం పాటించారన్నది మరోసారి చర్చనీయాంశమైంది.

2019 ఎన్నికల తరువాత ప్రభాకర్, కమలం పార్టీలో కనిపించకుండా పోయారనే చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. ఆయన్ను ఎమ్మెల్యేగా చేసిన పార్టీని, ఆయన పట్టించుకోవడంలేదనే బీజేపీలోని నేతలు మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తరువాత పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఎన్వీఎస్ అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారనే చర్చ పార్టీలో ఉంది. మాములుగానే పార్టీలో ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ది భిన్నమైన స్టైల్ అనే చర్చ పార్టీలో సాగింది. పార్టీకి ప్రస్తుతం తన అవసరముందనే భావనలో ఆయన ఉంటారనే రుసరుసలు కూడా పార్టీలో బాగా వినిపించాయి. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తన ఉప్పల్ నియోజికవర్గంలో పర్యటనలు చేశారా అంటే అదీ కూడా లేదన వాదన పార్టీలో గట్టిగానే సాగింది.

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ మాంచి జోష్‌లోకి వస్తోందని, ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. నాలుగు ఎంపీ సీట్లు, వరుసగా అమిత్‌ షా పర్యటనలు, మొన్న నడ్డా టూర్‌తో అందుకు నిదర్శమని మాట్లాడుకుంటున్నారు. అన్ని పార్టీల నుంచి నేతలు కమలం గూటికి చేరుతున్నారు. కానీ ఎన్వీఎస్‌ఎస్‌ మాత్రం తన వంతు పాత్ర పోషించకుండా, తనకు పట్టనట్టు వ్యవహరిస్తురన్నా చర్చ పార్టీలో ఉంది. ఉప్పల్ నియోజికవర్గంలో చాలామంది నేతలు బిజేపిలో చేరడానికి సిద్దంగా ఉన్నా, ఆయన మాత్రం తనకేం అవసరం లేదనేవిధంగా వ్యవహరిస్తురన్నారే సొంత పార్టీ నాయకులే నొసలు చిట్లిస్తున్నారట. అయితే, తెలంగాణలో బీజేపీ జోష్‌ అంటూ, కమలం నేతలు వ్యూహాలు సిద్దం చేస్తున్న నేపథ్యంలో, ఇన్నాళ్ల మౌనవ్రతాన్ని బ్రేక్‌ చేశారు ప్రభాకర్.

ప్రభాకర్‌ సైలెన్స్‌ బ్రేక్ వెనక మరో ఇంట్రెస్టింగ్ స్టోరి కూడా వినిపిస్తోంది. ఉప్పల్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన, టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కుమారుడు, వీరేందర్‌ గౌడ్‌, బీజేపీ కండువా కప్పుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలోనే, ప్రభాకర్‌ మళ్లీ మాట్లాడ్డం మొదలుపెట్టారన్న చర్చ జరుగుతోంది. చాలా రోజుల తరువాత ప్రభాకర్ పార్టీ ఆఫీస్‌కు రావడంతో, పార్టీలో ఇదే చర్చ వినిపిస్తొంది. ఎక్కడ, ఉప్పల్‌ సీటులో బీజేపీ అభ్యర్థిగా వీరేందర్‌ గౌడ్‌ నాటుకుపోతారోనన్న ఆందోళనే, మరోసారి ప్రభాకర్‌ను ఆఫీసు మెట్లెక్కించిందని, కమలం నేతలే మాట్లాడుకుంటున్నారట. మొత్తానికి నిత్యం వాగ్దాటితో చెలరేగిపోయే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, కొన్ని నెలల పాటు మౌనం వహించి, మళ్లీ మైక్‌ అందుకోవడంపై ఎవరికివారు తమకు తోచిన విధంగా చర్చించుకుంటున్నారు. అసలు విషయం మాత్రం, ప్రభాకర్‌కే ఎరుక.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories