కిషన్‌ రెడ్డి, రేవంత్‌లకు చావోరేవో ఎందుకు?

కిషన్‌ రెడ్డి, రేవంత్‌లకు చావోరేవో ఎందుకు?
x
Highlights

వారిద్దరూ వేరు వేరు పార్టీలు. అగ్రెసివ్‌ లీడర్స్. తమదైన హోదాల్లో దూసుకెళుతున్న నేతలే. అయితే, ఇప్పుడా ఇద్దరు డైనమిక్ నాయకులకు, గ్రేటర్ కార్పొరేషన్...

వారిద్దరూ వేరు వేరు పార్టీలు. అగ్రెసివ్‌ లీడర్స్. తమదైన హోదాల్లో దూసుకెళుతున్న నేతలే. అయితే, ఇప్పుడా ఇద్దరు డైనమిక్ నాయకులకు, గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు పరీక్షగా మారాయట. డూ ఆర్ డైగా పరిణమించాయట. తమతమ పార్లమెంట్ పరిధుల్లో, గెలిచే డివిజన్ల సంఖ్య కాస్త ఇటు అటు అయినా, హోదాలే తారుమారు అవుతాయట. ఆయా పార్టీల హైకమాండ్‌ల టార్గెట్‌ విధించాయట. ఇంతకీ ఎవరా ఇద్దరు లీడర్స్? చావోరేవో పోరులో, వారెలా ఫైట్ చేస్తున్నారు?

ఎన్నికలు ఎవరికైనా ప్రతిష్టాత్మకమే. గెలిస్తే జేజేలు. పట్టాభిషేకాలు. ఓడినా అదే రేంజ్‌లో పరాభవ మాటలు. వీరింతే, వీరి వ్యూహాలింతే అన్నట్టుగా హేళనలు. భవిష్యత్తులో పదవులు, హోదాల గండాలు. కత్తిమీద సాములాంటి ఎన్నికలు. ఫలితం అటు ఇటు అయినా అంతే. ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి. గ్రేటర్ ఎన్నికలు వీరికి చావోరేవోగా మారాయి.

మొదట కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచారు. కేంద్ర హోంమంత్రి పదవి చేపట్టారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని డివిజన్లలో, గతంలో బీజేపీ పెద్దగా గెలవలేదు. కానీ ఇప్పుడు అలాకాదు. గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే, ఇక్కడ ఎంపీ, అందులోనూ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. సికింద్రాబాద్‌ డివిజన్లలో అత్యధిక డివిజన్లు గెలవాల్సిందేనని, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం టార్గెట్‌ విధించిందట. అందుకే సికింద్రాబాద్ చుట్టుపక్కల గల్లీగల్లీకి తిరుగుతున్నారు కేంద్రమంత్రి. కొన్ని చోట్ల ఇంటింటికీ కూడా తిరుగుతూ, బీజేపీ అభ్యర్థులకు ఓటెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ డివిజన్‌లో కాంగ్రెస్‌తో పాటు టీడీపీకి ఓటు బ్యాంకు బలంగా వుండేది. ఇప్పుడు ఏ పార్టీకా పార్టీ సొంతంగా పోటీ చేస్తోంది. దీంతో ఓట్ల చీలిక ఎవరికి లాభమో, ఎవరికి నష్టమోనని కిషన్ రెడ్డి టెన్షన్‌ పడుతున్నారట. ఒకవేళ ఇక్కడ ఎక్కువ డివిజన్లను కిషన్‌ రెడ్డి సాధించలేకపోతే, కేంద్రమంత్రి పదవికే ఇబ్బంది తప్పదన్న మాటలు, కాషాయ సర్కిల్స్‌లోనే జోరుగా వినిపిస్తున్నాయి.

ఇక రేవంత్ రెడ్డి. టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. గ్రేటర్ ఎన్నికల రణక్షేత్రంలో, తానే ఒక సైన్యంలా పోరాడుతున్నారు. గల్లీ గల్లీకి తిరుగుతున్నారు. ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిపై ఎక్కువగా దృష్టిపెట్టారట. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలిస్తేనే, రేవంత్‌కు పార్టీలో మన్నన లేదంటే, కొంత ఇబ్బందే. అందులోనూ పీసీసీ రేసులో ఆయనే ముందున్నారు. ఒకవేళ మల్కాజిగిరిలో ఓట్లు-సీట్లు అటుఇటు అయినా, పార్టీలోని ప్రత్యర్థులు పీసీసీ పీఠంపై పీఠముడి వేయించడం ఖాయం. తన ఎంపీ ఏరియాలోనే డివిజన్లు గెలిపించలేకపోయారు, ఇక రాష్ట్రమంతా అసెంబ్లీ సీట్లను ఎలా గెలిపిస్తారని, అధిష్టానానికి రిపోర్ట్‌లు వెళ్లడం ఖాయం. అందుకే కాలికి బలపం కట్టుకుని, మల్కాజిగిరి వీధువీధులన్నీ తిరుగుతున్నారు రేవంత్. వీలైనన్నీ ఎక్కువ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు.

ఇదీ ఇద్దరు కీలక లీడర్ల గ్రేటర్ చాలెంజ్. స్థానాల సంఖ్య తారుమారయితే, వారి హోదాలు కూడా తలకిందులు ఖాయమన్న మాటలు, ఆయా పార్టీల్లోనే జోరుగా వినిపిస్తున్నాయి. హైకమాండ్ టార్గెట్‌‌ రీచ్‌ అయ్యేందుకు, డూ ఆర్ డైగా ఫైట్ చేస్తున్నారు కిషన్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి.


Show Full Article
Print Article
Next Story
More Stories