తెలంగాణ విద్యుత్ ఒప్పందాల పై కమిషన్ చట్ట విరుద్ధమా... కేసీఆర్ వాదనేంటి?

Why KCR Is against Justice L Narasimha Reddy Commission?
x

తెలంగాణ విద్యుత్ ఒప్పందాల పై కమిషన్ చట్ట విరుద్ధమా... కేసీఆర్ వాదనేంటి?

Highlights

తెలంగాణ విద్యుత్ ఒప్పందాల పై కమిషన్ చట్ట విరుద్ధమా... కేసీఆర్ వాదనేంటి?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ ఆ పిటిషన్ లో హైకోర్టును కోరారు.


జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ ఎందుకు?

కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్న సమయలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి తోడుగా ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోళ్లను చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై జ్యుడిషీయిల్ విచారణ చేపడుతామని ప్రకటించారు. ఇందు కోసం జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో జ్యుడిషీయల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

విద్యుత్ కొనుగోలు, సరఫరా, ఒప్పందాలు, వివాదాలపై ఈ కమిషన్ విచారణ నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి తమకు తెలిసిన సమాచారం ఇవ్వాలని కమిషన్ మీడియా ద్వారా కోరింది. అయితే ప్రొఫెసర్ కోదండరామ్, విద్యుత్ రంగ నిపుణులు రఘు సహా పలువురు కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలను చెప్పారు.


కేసీఆర్ కు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు


కేసీఆర్ ను కమిషన్ ముందు హజరు కావాలని జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి కమిషన్ లేఖ పంపింది. కమిషన్ ముందు హజరై అభిప్రాయాలు తెలిపిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ఆ లేఖలో తెలిపింది. ఈ నెల 19న కేసీఆర్ కు లేఖ కమిషన్ నుండి లేఖ అందింది. వారం రోజుల్లోపుగా కమిషన్ ముందు హజరు కావాలని కోరింది. అయితే జూన్ 25తో వారం రోజుల గడువు పూర్తైంది. దీంతో మరోసారి కమిషన్ నుండి కేసీఆర్ కు లేఖ పంపారు. తన అభిప్రాయాలు చెప్పాలని ఆ లేఖలో కోరారు. కేసీఆర్ తో పాటు అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డికి కూడా కమిషన్ లేఖ రాసింది. అయితే కమిషన్ ఏర్పాటునే బీఆర్ఎస్ నాయకులు తప్పుబడుతున్నారు.


కేసీఆర్ వాదన ఏంటి?

ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ తప్పుబడుతున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా, ఒప్పందాలు, వివాదాలను విద్యుత్ నియంత్రణ మండలికి మాత్రమే ఉందని కేసీఆర్ వాదిస్తున్నారు. జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదని బీఆర్ఎస్ చెబుతుంది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ చట్టంలోని 61, 62, 86 సెక్షన్లకు విరుద్దంగా ఈ జీవో ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జ్యుడిషీయల్ కమిషన్ విచారణ విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోకి వస్తాయంటున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.

ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఈఆర్సీలోనే తన అభ్యంతరాలను వ్యక్తం చేశారని కూడా బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.


జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలంటున్న కేసీఆర్

ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిని విచారణ కమిషన్ నుండి తప్పుకోవాలని కోరుతూ కేసీఆర్ ఈ నెల 15న లేఖ రాశారు. తొమ్మిదిన్నర ఏళ్లలో విద్యుత్ రంగంలో చేసిన కృషిని ప్రస్తావించారు. అప్పట్లో తెలంగాణలో ఉన్న విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో పీపీఏ చేసుకున్నట్టుగా ఆ లేఖలో కేసీఆర్ చెప్పారు.

ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని తప్పుబట్టే విధంగా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ మాట్లాడడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విషయానికి సంబంధించి కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను దామరచర్లలో ఏర్పాటు చేయడానికి గల కారణాలను వివరించారు. విచారణ పూర్తి కాకుండానే మీడియా సమావేశంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టేలా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి మాట్లాడారని కేసీఆర్ ఆ లేఖలో చెప్పారు. ఇలా చేయడంపై తాను బాధపడినట్టుగా తెలిపారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు చెప్పినట్టుగా ఈ మాటలున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. విచారణ కమిషన్ నుండి తప్పుకోవాలని జస్టిస్ ఎల్. నరసింహరెడ్డిని ఆయన కోరారు.

ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేస్తే విచారణకు ఎందుకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. విచారణకు హజరు కాకుండా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును తప్పుబట్టడంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories