Telangana: మంత్రి ఈటల ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యారు?
Telangana: మంత్రి ఈటల ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యారు? ఈటల కావాలనే రాజకీయాలు చేస్తున్నారా? లేక పొమ్మనలేక పొగబెట్టేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందా?
Telangana: మంత్రి ఈటల ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యారు? ఈటల కావాలనే రాజకీయాలు చేస్తున్నారా? లేక పొమ్మనలేక పొగబెట్టేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందా? తాజాగా భూకుంభకోణమంటూ పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ఈటలను కేబినెట్ నుంచి సాగనంపేందుకు రంగం సిద్ధమైందన్న అభిప్రాయం నెలకొంది. ధిక్కారం స్వరాన్ని అణచివేయాలని అధికార పార్టీ భావిస్తుంటే తన తప్పేం లేదంటూ ఈటల ఘాటుగా సమాధానమిస్తున్నారు. ఈటల మాటల వెనుకున్న మర్మాన్ని అధికార పార్టీ గ్రహించి పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిందా? ఈటల తప్పించేందుకు కారణాలు వెదుకుతున్న పార్టీ హైకమాండ్ అందుకు తగిన విధంగా పావులు కదుపుతోందా ?
తెలంగాణ ఉద్యమంలో తూటాల్లాంటి మాటలతో అగ్గిరాజేసిన మంత్రి ఈటల ఇప్పుడు స్వపక్షంలో విపక్షంగా మారారు. గులాబీదళంలో పరోక్షంగా ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. మీడియాలో చేసే ప్రసంగాలు సంచలనం కావడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఒకదాని తర్వాత మరో ప్రకటన చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈటల మాటల్లో అంతర్యమేంటన్నదానిపై తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ ధిక్కార స్వరానికి ఫలితం అనుభవిస్తారా? లేక మొత్తం వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్న చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికలన్నీ పూర్తి చేసిన సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈటల భూవివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దాదాపుగా నాలుగున్నరేళ్ల కిందట భూవ్యవహారాన్ని ఇప్పుడు తవ్వితీశారు. ఈటల భూదందాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సాయంత్రం నుంచి మొదలైన కథనాలు ఈటల ప్రెస్ మీట్ వరకు గమనిస్తే ఈటలను కేబినెట్‌నుంచి ఉద్వాసన చేస్తున్నారన్నట్టుగా సాగాయి.
మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదని పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని బతికొచ్చినోన్ని అసలే కాదని గులాబీ జెండా ఓనర్లమంటూ చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ పార్టీలో మంటపుట్టించాయి. పదవులు అడుక్కొనే వాళ్లం కాదన్న ఈటల అధికారం శాశ్వతం కాదని న్యాయం, ధర్మం, మాత్రమే శాశ్వతమని దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందంటూ 2019, అక్టోబర్ 29న ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి రాజేందర్ నుంచి ఈటెల్లాంటి వ్యాఖ్యానాలు వస్తూనే ఉన్నాయి. మళ్లీ చల్లారుతూనే ఉన్నాయి. కానీ అవే ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఈటలను ఇరుకునపెడుతున్నాయ్.
అయితే ఈ మాటలే తెలంగాణ సమాజం నుండి ఈటలకు మద్దతు పెరిగేలా చేశాయన్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతూవస్తోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీ ముఖ్యులు ఫోన్లో సంప్రదించడం, ఒకరిద్దరు ముఖ్యులు వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయడం, వాట్ నెక్స్ట్ అనే ప్లాన్లు ఈటల సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఇంటెలిజన్స్ వర్గాలు నివేదికలివ్వడంతో కేసీఆర్ తన సహజ శైలి వ్యూహాన్ని అమలు చేయడం ఆరంభించారు. మనసుకు నచ్చకుంటే ఎంతటి వారినైనా పక్కన పెడతారని చెప్పడానికి ఈటల వ్యవహారం మరో నిదర్శంగా చెబుతున్నారు విశ్లేషకులు. గతంలో డిప్యూటి సీఎం రాజయ్యకు ఉద్వాసన పలికినట్టుగానే ఈ సారి ఈటలను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయం ఈటలకూ తెలుసు.
అయితే కేసీఆర్‌కు సోదరుని వలే, కుడి భుజంగా ఉన్న ఈటలపై ఇప్పటికిప్పుడు ఎందుకు కత్తి కట్టారో అర్థం కావడం లేదంటున్నారు పార్టీ నేతలు. భూముల ఆరోపణల వ్యవహారం ఏమవుతుందన్న క్లారిటీ అటు కేసీఆర్‌కు ఇటు తెలంగాణ సమాజానికీ చాలా బాగా ఉంది. ఒకవేళ భూవ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చకుంటే పౌరసరఫరాల కుంభకోణాన్ని సైతం తెరపైకి తెస్తారన్న ప్రచారం కూడా విన్పిస్తోంది. గతంలో ఇదే శాఖకు మంత్రిగా ఉన్న ఈటలపై పుంకాను పుంకాలుగా వార్తలు స్థానిక దిన పత్రికల్లో వచ్చాయి. అయితే అవినీతి ఆరోపణలును కేసీఆర్ అస్సలేం పట్టించికోలేదు. తాజా దూకుడు వెనుక ఇద్దరికి మధ్య ఎక్కడ చెడిందో అర్థం కావడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే కేటీఆర్‌ను సీఎం చేసేందుకు రంగం సిద్దం చేసుకున్న కేసీఆర్ ఉన్నపళంగా నిర్ణయం మార్చుకున్నారు. దాదాపు ముహుర్తం ఖరారే అన్నట్టుగా ప్రచారం జరిగింది. కేటీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ మంత్రులు బహిరంగ వేదికలపై కామెంట్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మానసికంగా సిద్దమయ్యారు. కానీ మొత్తం వ్యవహారం బెడిసికొడుతుందన్న అభిప్రాయంతో కేసీఆర్ ఆ ఆలోచన మానుకున్నారు. సీఎం మార్పు ఇప్పట్లో ఉండదని సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లోనే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కొందరు పార్చీ పెట్టాలని చూస్తున్నారని పార్టీ పెట్టడం పాన్ డబ్బా లాంటిది కాదని కేసీఆర్ ఈటలనుద్దేశించి అన్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో ఈటల లాంటి సీనియర్లుండగా అనుభవం లేని కేటీఆర్ ఎందుకంటూ విపక్ష నేతల హాట్ కామెంట్ల వెనుక ఈటల హస్తం ఉందని కేసీఆర్ స్మెల్ చేశారన్న అభిప్రాయం కూడా కొందరు పార్టీ నేతల్లో ఉంది. ఈటల ఒక పార్టీ అగ్రనేతతో టచ్ లో ఉన్నారని ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూడా కేసీఆర్‌కు తెలుసునని తాజా నిర్ణయం కూడా అందులో భాగమేనంటున్నారు కొందరు నేతలు.
మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పలు అంశాలపై పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నర్మగర్భంగా మాట్లాడటంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీశాయ్. గులాబీ జెండా ఓనర్లం అంటూ హాట్ కామెంట్స్ చేసినప్పటి నుంచి పలు సందర్భాల్లో ఈటల మాట్లాడిన ప్రతి మాట రాజకీయ వర్గాల్లో హీట్ పెంచింది. ఇటీవల ఏకంగా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి రెండుసార్లు ఒంటరిగా సొంత వాహనంలో డ్రైవర్ ను తీసుకుని రహస్య ప్రాంతానికి వెళ్లి వచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడకు వెళ్లారు ఎందుకు వెళ్లారనేది ఇప్పటికీ పార్టీ ముఖ్యులకు తెలియలేదంటే ఈటల ఎంత పక్కా వ్యూహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కొంతమందితో కలిసి కొత్త పార్టీ పెడుతున్నారని, కొంతమంది ప్రతిపక్ష నేతలతో కలిసి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడని, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయ్. ఇలాంటి సమయంలో భూ వ్యవహారం ఇప్పుడు తెరపైకి తీసుకురావడంతో ఈటలకు ఉద్వాసన పలుకనున్నారనే చర్చ మొదలయ్యింది. దీనిపై పలుచోట్ల ఈటల వర్గీయులు రోడ్డెక్కారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire