తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి, క్యాబినెట్ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడింది?

Why did Telangana PCC chief appointment and cabinet expansion break?
x

తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి, క్యాబినెట్ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడింది?

Highlights

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆరు స్థానాలను భర్తీ చేయాలి. ప్రస్తుతం హైద్రాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు.

ఆషాఢ మాసంలోగా మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలనుకున్న రేవంత్ రెడ్డి ఆశ నెరవేరలేదు. పీసీసీ పదవికి కొత్త బాస్‌ను నియమించే ప్రయత్నాలకూ తాత్కాలికంగా బ్రేక్ పడింది.

మామూలుగా అయితే టీపీసీసీ చీఫ్ పదవికి జూలై 7 ఆదివారంతో రేవంత్ రెడ్డి పదవీ కాలం పూర్తవుతుంది. దీనికి కొన్ని వారాల ముందే పీసీసీకి కొత్త బాస్ ను ఎంపిక చేయాలని రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈనెల 7న పీసీసీకి కొత్త బాస్ వచ్చేవారు. మరి అలా ఎందుకు జరగలేదు? పీసీసీ చీఫ్ విషయంలో సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ల పేచీలతో పీసీసీకి కొత్త బాస్ ఎంపికను అధిష్టానం తాత్కాలికంగా వాయిదా వేసింది. దీనితో పాటు కేబినెట్ విస్తరణను కూడా పక్కన పెట్టాలని రేవంత్ కు కాంగ్రెస్ నాయకత్వం సూచించింది.


సీనియర్ల ఆధిపత్యపోరు పీసీసీ చీఫ్ నియామకం వాయిదా

బీసీ, ఎస్ సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిలో ఒకరికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బీసీ సామాజిక వర్గం నుండి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ, ఎస్ సీ సామాజిక వర్గం నుండి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్ ల పేర్లు పీసీసీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్లలో మధు యాష్కీకి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మెజారిటీ నాయకులు మద్దతు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారని సంకేతాలిచ్చారని పార్టీ వర్గాల్లో టాక్. మరో ఇద్దరు మంత్రులు తమ వారికి పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని పార్టీ నాయకత్వం వద్ద ప్రతిపాదించారు. పీసీసీ చీఫ్ పదవికి పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక తాత్కాలికంగా వాయిదా పడింది.


మంత్రివర్గ విస్తరణతో పీసీసీకి కొత్త బాస్ ఎంపికకు లింక్

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆరు స్థానాలను భర్తీ చేయాలి. ప్రస్తుతం హైద్రాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ప్రజా ప్రతినిధులకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.

ఆరు మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, రెండు బీసీలకు, ఒకటి మైనారిటీకి, ఒకటి ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తోంది.

అయితే ఇటీవలనే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి వయోభారం కారణంగా మంత్రి పదవి కాకుండా నామినేటేడ్ పదవిని కేటాయిస్తారనే చర్చ కూడ లేకపోలేదు. ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

ప్రేమ్ సాగర్ రావుది ఓసీ సామాజికవర్గం. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో ఓసీలు ఎక్కువగా ఉన్నారు. ఓసీల స్థానంలో ఇదే జిల్లా నుండి ఎస్టీ లేదా ఎస్సీలకు చోటు కల్పించాలని భావిస్తే గడ్డం వివేక్ లేదా బొజ్జ పేర్లు తెరమీదికి వచ్చాయి. రంగారెడ్డి నుండి పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరికి కేబినెట్ లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది.

కేబినెట్ లో చోటు దక్కే సామాజిక వర్గాలకు కాకుండా ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. అయితే ఈ ఆరు మంత్రి పదవుల్లో ఒకటి రెండు తమ అనుచరుల పేర్లను కొందరు మంత్రులు అధిష్టానం వద్ద ప్రతిపాదించారని సమాచారం.


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబినెట్ బెర్త్ దక్కేనా?

భువనగిరి ఎంపీ స్థానంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. అయితే ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వం ఎటూ తేల్చలేదని సమాచారం. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇప్పటికే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిస్తే మరికొందరి నుండి కొత్త డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన భార్య పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లు టాక్ వినిస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాలు నాయక్ కు మంత్రి పదవిని ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ లు కూడా కేబినెట్ లో బెర్త్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ లు ఓసీ సామాజిక వర్గం. ఎన్నికల సమయంలో ముదిరాజ్ లకు మంత్రి పదవి ఇస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో శ్రీహరికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. కేబినెట్ లో తమ వారికి చోటు విషయమై కొందరు నాయకులు అధిష్టానం వద్ద ఒత్తిడి తేవడంతో కేబినెట్ విస్తరణ కూడా వాయిదా పడింది.

దాంతో, ఆషాఢ మాసం రాకముందే కేబినెట్ విస్తరణను పూర్తి చేయాలనుకున్న రేవంత్ రెడ్డి కోరిక నెరవేరలేదు. మళ్ళీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని ఆయన ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories