Lok Sabha Elections: కేసీఆర్ ప్రచారానికి ఈసీ ఎందుకు 48 గంటలు బ్రేక్ వేసింది?

Why did EC Break KCR
x

Lok Sabha Elections: కేసీఆర్ ప్రచారానికి ఈసీ ఎందుకు 48 గంటలు బ్రేక్ వేసింది?

Highlights

Former Telangana CM KCR: తెలంగాణ మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

Former Telangana CM KCR: తెలంగాణ మాజీ సీఎం, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. వచ్చే 48 గంటల పాటు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్‌పై ఆంక్షలు విధించింది. కాంగ్రెస్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గత రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అంటె శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ప్రచారం చేయకూడదంటూ కేసీఆర్‌పై ఆంక్షలు విధించింది.

బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు సిరిసిల్ల జిల్లాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అమలులోకి నిషేధం..

కాగా, నిషేధం అమలులో ఉన్న సమయంలో బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటర్వ్యూలు, మీడియాతోనూ బహిరంగంగా మాట్లాడకూడదని ఈసీ పేర్కొంది. అలాగే, ఎలక్ట్రానిక్‌ మీడియాతోపాటు సోషల్ మీడియా, ప్రింట్‌ మీడియాలలోనూ ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఆదేశించింది. గతంలోనూ కేసీఆర్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మాట్లాడరని ఈసీ తెలిపింది.

నిషేధం ఎందుకంటే..

‘‘2019, 2023లలోనూ కేసీఆర్‌కు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచనలు, సలహాలు జారీ చేశాం. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఆయన‌ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీంతో ఆయన అభ్యంతర వ్యాఖ్యలు, దూషణల ద్వారా ఎన్నికల నియమావళికి విరుధ్దంగా మాట్లాడారని గమనించాం. అందుకే కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం అమలు చేస్తున్నాం’’ అంటూ ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మోడల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన..

ఏప్రిల్ 5న కేసీఆర్ చేసిన ప్రకటనలకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిషేధం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా, ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు జమ్మికుంటలో గురువారం నిర్వహించాల్సిన బస్సు యాత్ర, రోడ్‌షోను బీఆర్‌ఎస్ అధినేత రద్దు చేశారు.


మహబూబాబాద్‌లో ఉత్తర్వులు అందజేత..

మహబూబాబాద్‌ పట్టణంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు.. కేసీఆర్‌ బస్సు యాత్ర వద్దకు చేరుకుని ఉత్తర్వులను అందజేశారు. అనంతరం కేసీఆర్‌ ఎలక్షన్ ఆఫీసర్లు సూచించిన మేరకే తన ప్రచారాన్ని ముగించారు. అంటే బుధవారం రాత్రి 8 గంటలలోపే ఎన్నికల ప్రచారాన్ని ముగించి, అనంతరం స్మహబూబాబాద్‌ పరిధిలోని స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు.

కేసీఆర్ ఏమన్నారంటే..

తనపై వచ్చిన ఫిర్యాదుపై కేసీఆర్ స్పందిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ విధానాలు, కార్యక్రమాలకే తన విమర్శలు పరిమితమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ నేతలపై తాను ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories