Crime rate in Telangana in 2024: తెలంగాణలో క్రైమ్ రేట్ ఎందుకు పెరిగింది?

Crime rate in Telangana in 2024: తెలంగాణలో క్రైమ్ రేట్ ఎందుకు పెరిగింది?
x
Highlights

Crime rate in Telangana in 2024: తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకు సగటున 8 రేప్ కేసులు చొప్పున నేరాలు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్,...

Crime rate in Telangana in 2024: తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకు సగటున 8 రేప్ కేసులు చొప్పున నేరాలు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్, కిడ్నాప్‌లు, హత్యలు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంఖ్య పెరిగింది. అసలు క్రైమ్ రేట్ ఎందుకు పెరిగింది? మహిళలపై అత్యాచారాల కేసుల్లో ఎక్కువగా తెలిసిన వారే నిందితులుగా తేలిన కేసులే ఎక్కువగా ఉండడం ఆందోళన కల్గిస్తోంది. మరో షాకింగ్ విషయమేమిటంటే నేరాలకు పాల్పడిన వారికి గతంతో పోలిస్తే తక్కువ శిక్షలు పడ్డాయి. ఇందుకు కారణాలు ఏంటి? పోలీసులు దీనికి విరుగుడుగా ఏం చేయనున్నారు? కొత్త సంవత్సరంలో నేరాలకు ఎలా చెక్ పెట్టాలని భావిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్

తెలంగాణలో 2023తో పోలిస్తే క్రైమ్ రేట్ 9.87 శాతం పెరిగింది. మహిళలపై రేప్ కేసులు, సైబర్ నేరాలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు కూడా పెరిగాయి. తెలంగాణ డీజీపీ జితేందర్ విడుదల చేసిన వార్షిక క్రైం రిపోర్ట్ ఈ గణాంకాలను బయటపెట్టాయి.

ఈ ఏడాది తొలి 11 నెలల్లో రాష్ట్రంలో 2,34,158 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది అంటే 2023లో ఇది 2,13,121 గా రికార్డైంది. సైబర్ నేరాలు 43.44 శాతం పెరిగాయి. మహిళలపై దాడులు, వేధింపులు 4.78 శాతం పెరిగాయి. ఇక 142 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. 4682 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మహిళల హత్యలు 13.15 శాతం పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై కేసుల సంఖ్య పెరిగింది. 2023లో వీరిపై 1877 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,257 కేసులు రికార్డయ్యాయి.

దోషులకు శిక్షల్లో తగ్గుదల

నేరాల పెరుగుదలతో పాటు పలు కేసుల్లో దోషులకు పడిన శిక్షలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. 2023లో పలు రకాల కేసుల్లో 39,371 మందికి శిక్షలు పడ్డాయి. ఈ ఏడాదిలో కేవలం 28,477 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. 18 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి మరణ శిక్షలు విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన 51 కేసుల్లో 70 మందికి జీవితఖైదు విధించారు. 77 ఫోక్సో కేసుల్లో 82 మందికి జీవిత ఖైదు విధించారు.

దోషులకు శిక్ష పడకుండా ఉండడానికి కోర్టుల్లో సరైన ఆధారాలు చూపకపోవడం, నేరం రుజువు చేసేందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టులో సమర్పించకపోవడం వల్ల కూడా దోషులకు శిక్షలు పడడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగంలో దేశంలో తెలంగాణలోని పోలీస్ శాఖ టాప్‌లో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో మరిన్ని కెమెరాలను అమర్చనున్నారు. దీంతో నేరాలను అదుపు చేయవచ్చని పోలీస్ శాఖ భావిస్తోంది.

మహిళలపై పెరిగిన నేరాలు

ఈ ఏడాది మహిళలపై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదిలో 2945 అత్యాచార కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 2,283 రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నమోదైన 2,922 కేసుల్లో తెలిసిన వారే బాధితులపై అత్యాచారం చేశారు. అంటే తెలిసినవారని నమ్మి బాధితులు మోసపోయారని ఈ కేసుల వివరాలు చెబుతున్నాయి. ప్రేమ పేరుతో నమ్మించి రేప్ చేసిన ఘటనలు, ఒంటరి మహిళలపై అత్యాచారం, లిఫ్ట్ ఇస్తానని చెప్పి రేప్ చేసిన ఘటనలు నమోదయ్యాయి. ఇక గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అత్యాచారానికి గురైన కేసులు 23 మాత్రమే నమోదయ్యాయి. అత్యాచారానికి గురైన వారిలో 15 నుంచి 18 ఏళ్ల లోపు వారు 1970 మంది ఉన్నారు. 18 ఏళ్ల పైబడిన వారు 888 మంది.

ఇక మర్డర్ కేసులు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయి. 2023లో 213 హత్యలు జరిగాయి. ఈ ఏడాదికి అవి 241కి చేరాయి. లైంగిక కారణాలతో జరిగిన హత్యలు 102 రికార్డయ్యాయి. భూ వివాదాల్లో 82 మర్డర్లు జరిగాయి. కుటుంబ గొడవలతో 229 మంది హత్యకు గురయ్యారు.డబ్బుల వివాదాల్లో 53 మర్డర్ కేసులు నమోదయ్యాయి.

కిడ్నాప్ లు కూడా పెరిగినట్టు వివరాలు చెబుతున్నాయి. 2023లో 884 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదికి అవి 1122కి పెరిగాయి. సైబర్ క్రైమ్ కేసులు 25,184 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ కేసుల పెరుగుదల 43.33 శాతం పెరిగింది. ఇక షీటీమ్స్‌కు 10,862 ఫిర్యాదులు అందాయి. అయితే ఇందులో 830 మాత్రమే ఎఫ్ఐఆర్ చేశారు. మిగిలిన ఫిర్యాదుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉంది. రాష్ట్రంలో నేరాల పెరుగుదలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రే ఇందుకు బాధ్యత అని విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న హోంశాఖను మరో మంత్రికి కేటాయిస్తే నేరాల అదుపునకు ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని విపక్షాలు అంటున్నాయి. సాధారణ పాలనతో పాటు రాష్ట్ర, అభివృద్ది, సంక్షేమం ఇతరత్రా అంశాలపై నిత్యం బిజీగా ఉండే సీఎం వద్దే హోంశాఖ ఉండడం వల్ల ఆ శాఖపై అంతగా ఫోకస్ ఉండడం లేదనే అభిప్రాయపడుతున్నారు.

మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేస్తే తన వద్ద శాఖలను కొత్త మంత్రులకు సీఎం కేటాయించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీస్ శాఖ అంటే కొంత భయం ఉండేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. ఇది కూడా నేరాల పెరుగుదలకు పరోక్షంగా కారణమనే అభిప్రాయాలున్నాయి.

కొత్త చట్టాల కింద కేసులు

కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టాల కింద 85,190 కేసులు నమోదయ్యాయి. జీరో ఎఫ్ఐఆర్ కింద 1,313 కేసులు నమోదు చేశారు. డయల్ 100కు 16 లక్షల 92 వేల మంది ఫోన్ చేశారు. మరో వైపు మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 41 మంది సరెండర్ అయ్యారు.

కొత్తగా 13 వేల మంది నియామకం

ఈ ఏడాది పోలీస్ శాఖలో 13 వేల మందిని నియమించారు. పెట్రోలింగ్ కోసం వెయ్యి వాహనాలు, 2,100 బ్లూకోట్ పెట్రోలింగ్ బైక్స్ అదనంగా ఈ ఏడాది ప్రభుత్వం అందించింది. బాధితులు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో చేరేందుకు ఈ వాహనాలు దోహదపడతాయని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక సీసీ కెమెరాల వాడకంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు టాప్‌లో ఉన్నారు.

కొత్త సంవత్సరంలో తెలంగాణ పోలీస్ శాఖ డిజిటల్ క్రైమ్‌ను అరికట్టేందుకు ఫోకస్ పెట్టాలని సీనియర్ జర్నలిస్ట్ గౌరిశంకర్ కోరారు. భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుదలపై బీఆర్ఎస్ మండిపడింది. సీఎం పనితీరుకు ఇది నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

టెక్నాలజీ పెరుగుదల కూడా పరోక్షంగా సైబర్ క్రైమ్ పెరిగేందుకు కారణమౌతోంది. నేరాలు చేసిన వారికి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని ప్రభుత్వం నుండి సంకేతాలు పంపితే నేరాలు తగ్గే అవకాశం ఉంది. నేరాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలను కూడా పోలీసులు సేకరించి కోర్టుల్లో సమర్పిస్తేనే నేరాలు అదుపులోకి వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories