ఆర్కే మరణం తర్వాత ఏవోబీలో దళం పరిస్థితి ఏమిటి.. పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారు?

Who Will Take Over the Party Responsibilities After RK
x

ఆర్కే మరణం తర్వాత ఏవోబీలో దళం పరిస్థితి ఏమిటి.. పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారు?

Highlights

Maoists: ఏవోబీలో మావోయిస్టుల వ్యూహాలు మారుతున్నాయి.

Maoists: ఏవోబీలో మావోయిస్టుల వ్యూహాలు మారుతున్నాయి. గతంలో ఉన్నంత బలంగా ప్రస్తుతం లేకపోవడంతో మావోయిస్టుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఆర్కే మృతితో ఈ తరహా ప్రచారం మరింత పెరిగింది. మారుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు ఏవోబీలో ఎటువంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అనే అంశాలపై పోలీసులు నిఘా పెట్టారు.

సమస్యలతో మావోయిస్టులు సతమతమవుతున్నారు. వ్యూహకర్తల కొరత, లొంగిపోతున్న సీనియర్లు, కామ్రేడ్ల అకాల మరణాలు ఇలా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మరణంతో గట్టి దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కేది విప్లవోద్యమంలో తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు బృందానికి ఆయన నాయకత్వం వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడి కేసులో ఆర్కే నిందితుడిగాను ఉన్నారు. ఆర్కే మరణంతో ఏవోబీలో దళం పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆర్కే మరణంతో మావోయిస్టు పార్టీలో ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి. ఆయన స్థానంలో పార్టీ బాధ్యతలు ఎవరు స్వీకరించనున్నారు అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కీలక నేతల మరణాలు, లొంగుబాట్ల నేపథ్యంలో ఉనికి కోసం మావోయిస్టు పార్టీ వ్యూహం మార్చుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేడర్‌ను కాపాడుకునేందుకు ఈశాన్య రాష్ట్రాలకు తరలివెళ్లాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలను వదిలేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమబెంగాల్ ద్వారా నాగాలాండ్ చేరుకోవాలని నిర్ణయించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేని వాతావరణం కావడంతో ఉన్న నేతలను, కేడర్‌ను కాపాడుకునే పనిలో మావోయిస్టు పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏవోబీలో ఉన్న ఆరు కమిటీలను రెండు కమిటీలుగా, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న నాలుగు కమిటీలను రెండు కమిటీలుగా మావోయిస్టు పార్టీ మార్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అరకులో ప్రజాప్రతినిధుల హత్యల అనంతరం ఏవోబీలో కొంత కాలం పోలీసులు, మావోయిస్టుల మధ్య ప్రతీకార దాడులు సాగాయి. గత కొన్ని మాసాలుగా విశాఖ మన్యంలో కూడా అడపాదడపా మావోయిస్టుల హడావుడి తప్ప భారీ సంఘటనలు జరగలేదు. కానీ ఆర్కే మృతితో ఎవోబీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు పోలీసుల కళ్లన్నీ ఏవోబీ పైనే ఉన్నాయి. ఏవోబీలో ఆర్కే మరణం తరువాత ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. మావోయిస్టు పార్టీలో ఆర్కే కీలక పాత్ర పోషించే వారు. హ్యూహాలు రచించడంతో పాటు రిక్రూట్మెంట్ విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి ఆర్కే. మరోవైపు దళంలో ఉన్న అనేక మంది సీనియర్లు అనేక కారణాల వలన జనజీవన స్రవంతిలో కలిసి పోతున్నారు. ఈ తరుణంలో ఆర్కేలా పార్టీని ఎవరు ముందుకు తీసుకువెళతారనే చర్చ జరుగుతోంది. ఆర్కేతో పాటు ఉద్యమంలో కీలకంగా ఉన్న ఒక సీనీయర్ దళ నాయకుడికి కానీ, ఒక మహిళా నాయకురాలికి కానీ ఆర్కే స్థానం దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా ఎన్నికయ్యే దళ నాయకుడిని బట్టి తమ వ్యూహాలు మార్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories