పీసీసీ కోసం ఆ ముగ్గురి మధ్య యుద్ధమా?

పీసీసీ కోసం ఆ ముగ్గురి మధ్య యుద్ధమా?
x
Highlights

కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ కోసం ఎవరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్‌...

కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ కోసం ఎవరి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో, ముగ్గురు నేతలు మాత్రం, మూడు వర్గాలుగా విడిపోయి, గాంధీభవన్‌ మెయిన్‌ ఛైర్‌ కోసం, కత్తులు నూరుతున్నారు. ఇంతకీ ఎవరా ముగ్గురు?

ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌ ప్రక్షాళన అతిత్వరలో ఉంటుందన్న ఊహానాగాల నేపథ్యంలో, తెలంగాణ పీసీసీకి కూడా కొత్త సారథి రాబోతున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా సీనియర్‌ నేతలు, అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్న అనేకమంది ఉద్దండ నాయకులు, గాంధీభవన్‌ మెయిన్‌ ఛైర్‌లో కూర్చుకునేందుకు ఓ రేంజ్‌లో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కొందరు నేతలు, ముందువరుసలో ఉన్నది తామేనంటూ పావులు కదుపుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల్లో ఒకరికి కీలకమైన పదవి వస్తుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. మరోవైపు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పిసిసి పదవికి జిల్లా నుంచి ఇద్దరు నేతల పేర్లు కూడా వినబడటంతో, ఆ కీలకమైన పదవి తమకే వస్తుందంటూ కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలకమైన నాయకులు ఉన్నారు. స్టేట్‌ లెవల్‌లో ఎదిగిన నేతలకు కొదువలేదు. ఇప్పటికే పలు కీలకమైన పదవుల్లో ఉన్న నేతలకు, పీసీసీ చీఫ్ పదవి రావొచ్చన్న ఆశలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిల పేర్లు, ఇప్పుడు టిపీసీసీ రేస్‌లో వినిపిస్తున్నాయి. వీరితోపాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా తాను సైతం పోటీ ఉన్నానంటూ అధిష్టానానికి సిగ్నల్స్ పంపుతున్నారు.

ఈ ముగ్గురు నేతలు పీసీసీ కోసం పావులు కదుపుతుండటంతో, ముగ్గురూ మూడు వర్గాలుగా డివైడ్‌ అయ్యారు. ఒకరిపై మరొకరు తామే బెటర్‌ అన్నట్టుగా హైకమాండ్‌ దగ్గర ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు కూడా మూడు వర్గాలుగా విడిపోయి తమ నాయకుడికే పీసీసీ వరించే అవకాశం ఎక్కువుందంటూ ఎవరికివారు ప్రచారం చేసుకుంటున్నారు.

మరోవైపు రాహుల్ గాంధీ రాజీనామా వ్యవహారంతో సీనియర్ నేతలు సైతం రాజీనామా బాట పట్టడంతో, పీసీసీ చీఫ్ పదవిలో మార్పు ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా సాగుతోంది. బీసీలకు కనక పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పొన్నం ప్రభాకర్‌కి వస్తుందని కూడా సమీకరణాల చర్చ సాగుతోంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌లో మొదటి నుంచి బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మరోసారి పట్టం కడితే జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని ఆయన వర్గం కార్యకర్తలు గట్టిగా నమ్ముతున్నారు.

మరోవైపు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉన్న శ్రీధర్ బాబుకి సైతం, పీసీసీ వస్తుందని ఆయన కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ ముగ్గుర నాయకుల్లో ఎవరికి రాష్ట్ర కాంగ్రెస్ సింహాసనం దక్కుతుంది అసలు వీరు ముగ్గురు కాకుండా రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి‌ వంటి మిగతా పవర్‌ఫుల్‌ లీడర్లను వరిస్తుందా అన్నది చాలా ఆసక్తి కలిగిస్తోంది.

మొత్తానికి నేతల పీసీసీ పోరాటం వర్గపోరుకు సైతం తెరలేపడం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది. ఎవరికిచ్చినా, మిగతా ఆశావహులు ఎర్రజెండా ఎగరేస్తారని, రాష్ట్ర కాంగ్రెస్‌ నిట్టనిలువునా చీలుతుందని, కొందరు నేతలు కొత్త గూడు కూడా వెతుక్కునే ప్రమాదముందన్న సంకేతాలు కూడా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. చూడాలి. కర్ర విరగకుండా పాము చావకుండా ఢిల్లీ హైకమాండ్‌ ఎలాంటి వ్యూహంతో రాష్ట్ర సారథులను నియమిస్తుందో బక్కచిక్కిపోతున్న కాంగ్రెస్‌కు ఎలాంటి బూస్టప్‌ ఇస్తుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories