రామ-లక్ష్మణుల మధ్య చిచ్చు పెట్టిందెవరు?

రామ-లక్ష్మణుల మధ్య చిచ్చు పెట్టిందెవరు?
x
రామ-లక్ష్మణుల మధ్య చిచ్చు పెట్టిందెవరు?
Highlights

వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. అన్న కోసం తమ్ముడు. తమ్ముని కోసం అన్న. ఇద్దరిదీ ఒకే మాట. ఒకే బాట. ఒకే పార్టీ. పాలిటిక్స్‌లో రాముడు-లక్ష్మణుడుల్లాంటి వారన్న...

వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. అన్న కోసం తమ్ముడు. తమ్ముని కోసం అన్న. ఇద్దరిదీ ఒకే మాట. ఒకే బాట. ఒకే పార్టీ. పాలిటిక్స్‌లో రాముడు-లక్ష్మణుడుల్లాంటి వారన్న మాట. కానీ ఇప్పుడు తమ్ముడొక పార్టీ, అన్నొక పార్టీ. ఇద్దరి బాటలూ వేరయ్యాయి. ఈ సోదరులు చెరో దారి ఎందుకు పట్టారు? ఈ పరిణామాలు కార్యకర్తలు, అనుచరులకు ఇబ్బందిగా మారా‍యా? ఇంతకీ ఎవరా అన్నదమ్ములు?

తెలంగాణ రాష్ట్రంలో మాజీమంత్రి వెంకట స్వామి కుమారులుగా మాజీ ఎంపి వివేక్, వినోద్‌లు మంచి గుర్తింపు పొందారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన అన్నదమ్ములు, ఇద్దరిది ఒకే మాట, ఒకే బాటగా సాగారు. అలాంటి అన్నదమ్ములు ప్రస్తుతం పార్టీల వారిగా విడిపోవడం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివేక్‌కు పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపి టికెట్ ఇవ్వవలేదు టీఆర్‌ఎస్‌. దాంతో ఎన్నికల్లో పోటీ చెయ్యలేకపోయారాయన. ఆ తరువాత బిజెపిలో చేరారు. ఆ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అన్న మాత్రం, కాంగ్రెస్‌లో వుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీమంత్రి వినోద్‌కు చెన్నూర్ టికెట్ ఇవ్వలేదు గులాబీ దళం. దాంతో బెల్లంపల్లి నుంచి బిఎస్పీ తరపున పోటీ చేశారు వినోద్. పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, అన్న వినోద్‌కు టికెట్ దక్కకున్నా, గులాబీ పార్టీలోనే కొనసాగారు వివేక్. అయితే పరాజయం పాలయ్యారు వినోద్. కాని అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో, పార్టీకి వ్యతిరేకంగా, అన్న వినోద్‌కు అనుకూలంగా పనిచేశారని, వివేక్‌కు ఎంపి టికెట్ దక్కలేదన్న ప్రచారం ఉంది.

దళిత నాయకుడినైన తనపై గులాబీ అధిష్టానం వివక్ష ప్రదర్శిస్తోందంటూ, టీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పి, అనూహ్యంగా బీజేపీలో చేరారు వివేక్. అయితే వివేక్ బిజెపిలో చేరిన తర్వాత, వినోద్ కూడా అదేబాటలో పయనిస్తారని అందరూ భావించారు. కాని అందుకు భిన్నంగా తమ్ముడు వివేక్‌ షాక్‌నిస్తూ, ఢిల్లీలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమ్ముడి బాటలోనే అన్న వినోద్ బీజేపీలో చేరతాడనుకుంటే, అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తూ ఘర్‌ వాపసీలా, కాంగ్రెస్‌లో చేరారు వినోద్. దీంతో అన్నదమ్ముల మధ్య విభేధాలు బయట పడ్డాయన్న చర్చ మొదలైంది. కాకా వారసులు, చెరోపార్టీలో కొనసాగడంతో కాక అభిమానులు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. ఇది వినోద్, వివేక్ అనుచరుల మధ్య చిచ్చు కూడా రేపుతోంది. దీంతో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో కార్యకర్తలు సైతం చీలిపోతున్నారు.

తెలంగాణ బీజేపీలో దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వివేక్‌కు, అన్న వినోద్ హస్తం పార్టీలో చేరడం పెద్ద ఎదురుదెబ్బ. పైగా దీనితో అన్నదమ్ముల కుటుంబాల్లోనూ విభేదాలు ఉన్నాయనడానికి ఇది సంకేతంగా కనపడుతోంది. కాకా వారసులు ఇద్దరూ, చెరో పార్టీలో ఉండటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ చీలిక రాబోయే రోజుల్లో మరింత ముదురుతుందని కాకా అభిమానుల టెన్షన్. యాభై ఏళ్లకుపైగా అనుబంధమున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోనే ఎన్నడూ లేని విధంగా, బ్రదర్స్ చీలిపోయారు. వినోద్ కాంగ్రెస్‌లో చేరడం, ‌మున్సిపల్ ఎన్నికల్లో సత్తాను చాటాలనుకుంటున్న వివేక్‌కు, ఇబ్బందిగా మారుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే, పెద్దపల్లిలో వివేక్‌ ద్వారా బలపడాలని బీజేపీ ఒకవైపు వ్యూహాలు వేస్తుంటే, తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వినోద్‌ ద్వారా స్ట్రాటజీలు వేస్తోంది కాంగ్రెస్. అందుకే రెండు జాతీయ పార్టీల మధ్య కంటే, ఇద్దరు అన్నదమ్ముల మధ్య కురుక్షేత్రంలా మారుతున్నట్టు కనిపిస్తోంది పెద్దపల్లి. అదే అభిమానుల ఆందోళన కూడా.

మరి వ్యూహాత్మకంగా ఇద్దరూ చెరో పార్టీలో కంటిన్యూ అవుతున్నారా, లేదంటే విభేదాలతోనే చెరోపక్షం చేరి యుద్ధానికి సిద్దమవుతున్నారా అన్నది రానున్న కాలమే తేల్చాలి. అయితే, విభేదాలే అయితే, పెద్దపల్లి వేదికగా కాకా కుటుంబంలో ఇంకెన్ని ప్రకంపనలు చెలరేగుతాయోనని, ఊహించడానికే పరేషాన్ అవుతున్నారు కాకా ఫ్యాన్స్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories