Kaushik Reddy: టీఆర్‌ఎస్‌లోకి కౌశిక్‌రెడ్డిని ఆ నాయకుడే పంపించారా?
Kaushik Reddy: ఊహించని విధంగా ఆ లీడర్‌కు అంత ప్రయారిటీ ఎందుకు దక్కింది?
Kaushik Reddy: ఊహించని విధంగా ఆ లీడర్‌కు అంత ప్రయారిటీ ఎందుకు దక్కింది? ఏ లీడర్ గులాబీ గ్యాంగ్‌లోకి వచ్చినా తాను గడప దాటని కేసీఆర్, ఆయన్నే ఎందుకు ఏరికోరి తెచ్చుకున్నారు? చుట్టుముట్టిన వివాదల మధ్య ఆ నాయకుడి పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందనుకున్న సమయంలో కేసీఆరే స్వయంగా ముందుకొచ్చి ఆయనకు కండువా ఎందుకు కప్పారు? తనకు పరిచయం లేకున్నా ఎవరి ఇన్‌ఫ్లూయిన్స్ మీద ఆయన్ను తన శిబిరంలో కలుపుకున్నారు? కచ్చితంగా అక్కున చేర్చుకోవాల్సిందే టికెట్ ఇవ్వాల్సిందేనని కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చారా? అలా ప్రెజర్ తెచ్చింది ఎవరు? ఒత్తిడి పెంచింది ఎవరు?
ఉన్నఫళంగా కౌశిక్‌రెడ్డికి సీఎం కేసీఆర్ అంత ప్రయారిటీ ఎందుకిచ్చారన్నదే పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. బడాబడా నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్న సందర్భంలో ప్రగతిభవన్, ఫామ్‌హౌస్ గడప దాటని కేసీఆర్ ఆ లీడర్‌ను ఏరికోరి ఎందుకు తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. అనేక వివాదాలు, విమర్శలు, ఆరోపణలు చుట్టిముట్టిన వేళ ఇక కౌశిక్ పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందని అనుకుంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి, గులాబీ కండువా కప్పడంలో ఆంతర్యమేమిటన్న వ్యూహంపై స్వపక్ష, విపక్షాలు కూడా తలలు పట్టుకంటున్నాయి. కేసీఆర్‌కు కౌశిక్ నేరుగా పరిచయం లేకపోయినా వారిద్దరి మధ్య బంధం వేసింది ఎవరన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌశిక్‌ను కచ్చితంగా టీఆర్ఎస్‌లో చేర్చుకోవాల్సిందే, అవసరమైతే హుజూరాబాద్ టికెట్ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌లోని ఓ ముఖ్య నాయకుడు ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు, జిల్లా నేతలు కౌశిక్‌ని చేర్చుకోవద్దని సీఎంకు విన్నవించినా అవేమీ పట్టించుకోకుండా విపక్ష లీడర్‌కు గౌరవం ఇచ్చే, గులాబీ కండువా కప్పి ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
తెలంగాణ భవన్ వేదికగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ కాంగ్రెస్‌లోని ఓ సీనియర్ సలహాతోనే గులాబీ గూటికి చేరారన్న ప్రచారం జరుగుతోంది. తనకు స్వయాన బంధువైన నాయకుడి సూచనతోనే కౌశిక్ తెలంగాణ భవన్ మెట్లెక్కారని చెప్పుకుంటున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కౌశిక్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్ కోసం, ముందుచూపుతోనే గులాబీ తీర్ధం పుచ్చుకున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే హుజురాబాద్ ఉపఎన్నిక తరుముకొస్తున్న వేళ అక్కడి రాజకీయాలు రోజురోజుకూ మారుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఈటల రాజేందర్‌పై పోటీ చేసి ఓడిపోయిన నాటి నుంచి ఆయన ఈటల టార్గెట్‌గా చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కౌశిక్ తన ఆరోపణలకు మరింత పదును పెట్టారు. పొలిటికల్ అటాక్ పెంచారు. ఇంకా చెప్పాలంటే ఈటల ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి అధికార పార్టీ నేతల కంటే కూడా తానే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఇదంతా గులాబీ పార్టీ పెద్దల ఆశ్వీర్వాదంతోనే జరిగిందన్న ప్రచారం ఉంది. అదీగాక, కౌశిక్‌రెడ్డిపై ఈటల రాజేందర్ కూడా రాజకీయ దాడి చేశారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించడానికి టీఆర్ఎస్ పెద్దలే కౌశిక్‌రెడ్డిని ప్రోత్సహించారని ఈటల ఆరోపించారు.
ఇంతలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో పరిస్థితులు మారిపోయాయి. పూలమ్మిన చోట కట్టెలు అమ్ముకోని ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా పీసీసీ చీఫ్ కూడా మారిపోయారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో రేవంత్‌రెడ్డి కొత్త బాస్ అయ్యారు. ఇది కాంగ్రెస్‌లో కౌశిక్ ప్రస్థానానికి బ్రేక్ వేసిందన్న చర్చకు ప్రధాన కారణమైంది. అటు, హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు అంటకాగుతున్న కౌశిక్‌రెడ్డికి కాదని, కాంగ్రెస్ నాయకత్వం కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారంతో కౌశిక్ తన ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ నుంచే తనకు టికెట్ కన్ఫామ్ అంటూ కౌశిక్ మాట్లాడిన ఆడియో కలకలం రేపింది. ఇది బయటపడగానే తనకు హస్తం హ్యాండివ్వడం ఖాయమన్న అంచనాకు వచ్చిన కౌశిక్ రేవంత్ టీమ్ ఎదురుదాడికి చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేశారు. ఇదంతా కాంగ్రెస్ సీనియర్ నాయకుడి సలహాతోనే జరిగిందని కొందరు ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. అంతేగాక, ఆడియో లీక్ కావడంతో గులాబీ టీమ్ కూడా కౌశిక్ రాకను అడ్డుకుంటుందని, తెలంగాణ భవన్ గేట్లు మూసేస్తుందన్న చర్చా జరిగింది.
ఈ డిస్కషన్ ఇలా కంటిన్యూ అవుతుండగానే, కౌశిక్‌రెడ్డి రాజకీయ జీవితం హుజూరాబాద్ చౌరస్తాలో దిక్కులు చూస్తుందన్న టాక్ వినిపించింది. పొలిటికల్ ఫ్యూచర్ గందరగోళంలో పడిందన్న ప్రచారం మొదలైన, రోజుల వ్యవధిలోనే కౌశిక్‌రెడ్డి అనూహ్యంగా కారెక్కారు. అదీ సీఎం కేసీఆర్ చేతులు మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో ఇతర పార్టీల నుంచి చాలా మంది సీనియర్లు గులాబీ పార్టీలో చేరినా బయటకు రాని సీఎం కేసీఆర్ కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డితో ఉన్న రాజకీయ అనుబంధంతో పాటు కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకుడి విజ్ఞప్తి మేరకు కౌశిక్‌ను ఆహ్వానించారన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి ఆ హస్తం పార్టీ ముఖ్య నేత అడుగు జాడల్లో నడిచిన కౌశిక్‌రెడ్డి హుజురాబాద్ టికెట్ తనకు రాకుండా రేవంత్ టీమ్ అడ్డుకుంటుందన్న టాక్‌తో వ్యూహం మార్చుకొని కారు ఎక్కారని విశ్లేషకులు అంటున్నారు.
ఏమైనా, మొత్తానికి హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్‌పై గులాబీ బాస్ నుంచి ఎలాంటి హామీ రాకున్నా రాజకీయంగా తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, భవిష్యత్‌లో ఉపయోగపడుతుందనే ముందస్తు ఆలోచనతో కౌశిక్‌రెడ్డి కారెక్కరానే ప్రచారం జరుగుతోంది. అయితే, కౌశిక్‌ను కేసీఆర్ అలా వదిలేయరని, పార్టీలోనో, లేక ఏదైన కీలక నామినేటెడ్ పదవిలోనూ కూచోబెడుతారన్న చర్చ నడుస్తోంది. మరి కౌశిక్ విషయంలో గులాబీ అధినేత ఆలోచన ఏంటో కాలమే సమాధానం చెప్పాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire