నాగర్‌ కర్నూల్‌లో ఓ కొడుకు పెట్టిన చిచ్చు?

నాగర్‌ కర్నూల్‌లో ఓ కొడుకు పెట్టిన చిచ్చు?
x
Highlights

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికార పార్టీలో మరో ఇద్దరు నాయకుల మధ్య సమరం మొదలైంది. ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్-ఎమ్మెల్సీ...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికార పార్టీలో మరో ఇద్దరు నాయకుల మధ్య సమరం మొదలైంది. ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్-ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అదే స్థాయిలో మరో నియోజకవర్గంలో ఇలాంటి వైరానికే బీజం పడింది. ప్రత్యర్థిని ఓడించేందకు చేతులు కలిపిన ఇరువురూ, ఇప్పుడు బద్ద శత్రువులుగా కత్తులు దూస్తున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నేతలు?

నాగర్ కర్నూల్ నియోజకవర్గం అధికార పార్టీలో రాజకీయం, సెగలు కక్కుతోంది. ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థిని ఓడించేందుకు టీఆర్ఎస్ లో చేరారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. నాగం జనార్దన్ రెడ్డిని ఓడించేందుకు మర్రి జనార్దన్ రెడ్డితో దోస్తీ కట్టారు. గత ఎన్నికల్లో ఆయన అనుకున్నది సాధించారు. అయితే, ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ కూచుకుళ్లకు ప్రాధాన్యత తగ్గించారట ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మధ్య, పగల సెగల రాజకీయం సాగుతోంది.

ఐతే ఈ నేతలిద్దరి మద్య దూరం పెరగడానికి కారణం, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడేనన్న పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చినప్పుడు, కార్యకర్తలు ఆయనకు సమస్యలను చెప్పడం, ఇతర పనుల నిమిత్తం ఆయన అధికారులకు ఫోన్ చెయ్యడం లాంటివి, ఎంఎల్ఏ మర్రి జనార్దన్ రెడ్డికి అసలు నచ్చడం లేదట. దాంతో అతన్ని ఎందుకు కలుస్తున్నారని పలుమార్లు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, కావాలనే నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు, కొడుకును పురమాయిస్తున్నాడని అంటున్నారట ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో తన టికెట్‌ లాక్కునేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్ చేస్తున్నారని ఫైర్‌ అవుతున్నారట. ఈ విషయం ఎమ్మెల్సీ కూచకుళ్లకు తెలియడంతో లోలోపల తీవ్రంగా రగిలిపోతున్నారట ఆయన. అంతేకాదు, తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో కూచుకుళ్ల జెండా ఎగురవేయడంతో, తనకు ప్రాధాన్యత తక్కువైందని ఎమ్మెల్యే మర్రి అసహనమట. ఈ విషయంపై కేటిఆర్‌తో సైతం చర్చించినట్టు సమాచారం. తనకు ఉద్దేశ పూర్వకంగానే ప్రాధాన్యత తగ్గిస్తున్నారని, ఇందుకు ఎమ్మెల్సీనే కారణమని ఎమ్మెల్యే తన కార్యకర్తలతో వాపోయినట్టు తెలుస్తోంది.

ఆగస్టు 15న జెండా ఆవిష్కరణకు ప్రభుత్వ విప్ గా దామోదర్ రెడ్డిని గద్వాలకు పంపించి, అచ్చంపేట ఎంఎల్ఏ గువ్వల బాలరాజును తీసుకొచ్చి జెండా ఎగురవేయించేలా చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. తనను కావాలనే గద్వాలకు పంపించారన్న విషయం తెలుసుకున్న దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకోవాలి సిద్దమయ్యారట. ఇలాంటి నేపథ్యాలే ఎమ్మల్యే మర్రి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల మధ్య దూరం పెరగడానికి కారణాలయ్యాయని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

మరోవైపు ఎంఎల్ఏ మర్రి జనార్ధన్ రెడ్డి సొంత ఎజెండాతోనే, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని దూరం పెట్టారని, అవతలి వర్గం నేతలు రగిలిపోతున్నారు. ఎమ్మెల్సీ వద్దకు, అధికారులు వెళ్ళినా, ఏదైనా సమస్య చెప్పినా, ఆఫీసర్లపై ఎమ్మెల్యే చిందులేస్తున్నారట. అధికారులను టార్గెట్ చేయడం వంటివి కొనసాగిస్తున్నారట. నేను లేనా...? నాకు చెప్పే అవసరం లేదా...? అని వారిపై మండిపడుతున్నారట. దీంతో అనేక సందర్బాల్లో అధికారులు ఎంఎల్సీ వద్దకు వెళ్ళాలంటేనే హడలిపోతున్నారట. అన్నీ తానై ఎన్నికల్లో మర్రిని ఎంఎల్ఏ గా గెలిపిస్తే, ఇవాళ ఏకపక్షంగా ఎంఎల్ఏ మర్రి వెళుతున్నారని దామోదర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామాలతో ఎవరివద్దకు వెళ్ళాలో అర్థంకాక కారు గుర్తు కార్యకర్తలు అయోమయంలో పడ్డారట.

ఇప్పటికే కల్వకుర్తి, కొల్లాపూర్‌లో కారు గుర్తు నేతల మధ్య తీవ్రస్థాయిలో వైరం కొనసాగుతోంది. ఇప్పుడు అదే వరుసలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం కూడా చేరింది. వర్గ విభేదాలు పార్టీకి నష్టమని, కలిసి పని చెయ్యాలని అధిష్టాన పెద్దలు సైతం చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారట. మాట వినకుంటే, సరైన సమయంలో సరైన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు చేశారట. చూడాలి, నాగర్‌ కర్నూల్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వైరం సమసిపోతుందో, మరింత ముదురుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories