కసితో రగిలిపోతున్న వివేక్‌.. మరి టార్గెట్‌ ఆ ఇద్దరు ఎవరు?

కసితో రగిలిపోతున్న వివేక్‌.. మరి టార్గెట్‌ ఆ ఇద్దరు ఎవరు?
x
Highlights

కోల్ బెల్ట్ కోట కాక కుటుంబానికి కంచుకోట అలాంటి కోటలో ఆధిపత్యం వారిదే. కాకా తర్వాత కాకా కుమారుడు వివేక్ కనుసన్నల్లో, అక్కడ డామినేషన్ సాగింది.

కోల్ బెల్ట్ కోట కాక కుటుంబానికి కంచుకోట అలాంటి కోటలో ఆధిపత్యం వారిదే. కాకా తర్వాత కాకా కుమారుడు వివేక్ కనుసన్నల్లో, అక్కడ డామినేషన్ సాగింది. కాని దశాబ్ద కాలంగా దశ తిరగడం లేదు. పార్టీల మీద పార్టీలు మారినా ఫేట్‌ మారడం లేదు. ఏకంగా టికెట్లు ఇప్పించే స్థితి నుంచి టికెట్ తెచ్చుకోలేని స్థితి. ఆఖరిపోరాటంగా కమలం పార్టీలో చేరిపోయారు వివేక్. మరి కాషాయదళంలో వివేక్‌కు పూర్వవైభం వస్తుందా? ఎంపి టికెట్ రాకుండా అడ్డుకున్న వారిపై ప్రతీకారానికి, వివేక్ రగిలిపోతున్నారా? ఆ ఇద్దరిపై కసితో కత్తులు నూరుతున్నారా?

మంచిర్యాల జిల్లా. కాక వెంకటస్వామికి రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం. చెన్నూర్ నియోజకవర్గం నుంచి, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగారు వెంకట స్వామి. ఆ తర్వాత కాకా కుమారుడు వివేక్, పదిహేనవ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు ఎంపీగా కొనసాగారు. ఆ తరువాత టీఆర్ఎస్‌‌లో చేరారు వివేక్, వినోద్. టీఆర్‌ఎస్‌లో చేరిన‌ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు వివేక్. 2014 ఎన్నికల్లో పోటీ చేసినా, టీఆర్‌ఎస్ అభ్యర్థి సుమన్ చేతిలో ఓడిపోయారు.

ఓటమి తరువాత మళ్లీ వివేక్ బ్రదర్స్, గులాబీ గూటికే చేరారు. అయినప్పటికీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, టీఆర్‌ఎస్‌ టికెట్ దక్కకపోవడంతో, పోటీకి దూరంగా ఉన్నారు వివేక్. ఒకప్పుడు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో, అసెంబ్లీ టిక్కెట్లను ఇప్పించే కాకా వారసులు, టిక్కెట్ తెచ్చుకోలేని స్థితికి చేరారని, కాకా అభిమానుల ఆవేదన. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాకా వారసులు, రాజకీయ భవిష్యత్తు కోసం తహతహలాడాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. దీనిలో భాగంగా వివేక్ తాజాగా బిజెపి పార్టీలో చేరారు.

దేశవ్యాప్తంగా కమలం గాలి వీస్తోందని, రాజకీయ భవిష్యత్తు కోసం వివేక్ పార్టీ మారాడని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీని వల్ల పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బిజెపికి బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ కాకా అభిమానులు, మాజీ కాంగ్రెస్ నాయకులు బిజెపి గూటికి చేరడానికి సిద్దమవుతున్నారు

. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాదని టీఆర్‌ఎస్‌లో చేరితే, తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని కసితో ఉన్నారు వివేక్. తనకు టికెట్ దక్కకుండా చేసిన వారిలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుమన్, దుర్గం చిన్నయ్య. కీలక పాత్ర వహించారని వివేక్ రగిలిపోతున్నారట. ఈ ఇద్దరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి వ్యూహలు రచిస్తున్నారని ప్రచారం.

బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యను, చెన్నూర్‌లో ఎమ్మెల్యే సుమన్‌ వర్గాన్ని, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని వ్యూహాలు రచిస్తున్నారట వివేక్. ‌ఇప్పటికే బెల్లంపల్లిలో మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రూప్ చేరికతో, దుర్గం చిన్నయ్యకు షాక్ ఇచ్చారు వివేక్. అదే వర్గంతో ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలని స్కెచ్ వేస్తున్నారట. ఆరునూరైనా సుమన్‌పై వివేక్ ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన అనుచరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనే, సుమన్ పతనం ప్రారంభమవుతుందని, వివేక్‌ వర్గీయులు శాపనార్థాలు పెడుతున్నారు. అలాగే మంచిర్యాల నియోజకవర్గంలో పట్టుసాధించాలని వివేక్ స్ట్రాటజీలు వేస్తున్నారట. టీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యేను, బిజెపీలో చేర్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని తీవ్రమైన చర్చ సాగుతోంది.

ఏది ఏమైనా ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే పరువు, పలుకుబడి దక్కించుకోవాలని వివేక్ ప్రయత్నిస్తున్నారట. దాంతో టీఆర్‌ఎస్‌లో, ఎవరు ఉంటారో, ఎవరు ఊడుతారోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారట. అయితే వివేక్‌తో ఎవరు వెళ్లిపోతారోనని, టీఆర్‌ఎస్ నాయకులు అంచనా వేయడం అప్పుడే ప్రారంభించారు. కాకా కుటుంబానికి ఈ జిల్లాలో ఎనలేని అభిమానముంది. కాని గెస్ట్ పాలిటిక్స్ చేస్తారని, అప్పుడప్పుడు మాత్రమే వస్తారని, వివేక్ బలాన్ని తేలిగ్గా తీసుకుంటోంది టీఆర్‌ఎస్. నాయకులతో తప్ప ప్రజలతో వివేక్‌కు ప్రత్యక్ష సంబంధాల్లేవని, దాంతో మున్సిపల్ ఎన్నికల్లో, వివేక్ ప్రభావం ఉండదని గులాబీ నాయకులు భావిస్తున్నారట. అదే విధంగా తాము అధికార పార్టీ కావడంతో పెద్దగా టీఆర్‌ఎస్ నాయకులు వివేక్‌తో వెళ్లే అవకాశాలు ఉండవని అనుకుంటున్నారట. అయితే, కొందరైనా ఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో కొందరు వెళ్తారని ఆందోళన చెందుతున్నారట గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని ఒకవైపు వివేక్ స్కెచ్ వేస్తుంటే, అటు బిజెపిని దెబ్బ తీయాలని టీఆర్‌ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వివేక్ ప్రభావం లేదని నిరూపిస్తే, భవిష్యత్తులో మరింతగా వివేక్ బలహీనం అవుతాడని, ఆవిధంగా ఎత్తుగడలు వేస్తోంది గులాబీ పార్టీ. దీనికి ధీటుగా కార్మిక సమస్యలపై పోరాటం చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించడానికి సిద్దమవుతున్నారట. మొత్తానికి మంచిర్యాల జిల్లాలో బిజెపి పార్టీని వివేక్ ఎలా పటిష్ఠం చేస్తారో, వివేక్ ప్రయత్నాలను టీఆర్ఎస్‌ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories