ఆ ఒక్క సీటు రేసులో ఎవరు...?

Who is in the Race for Rajya Sabha by-election From TRS
x

ఆ ఒక్క సీటు రేసులో ఎవరు...?

Highlights

Rajya Sabha: తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభకు పోటీ పడుతున్న నేతలెవరూ.

Rajya Sabha: తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభకు పోటీ పడుతున్న నేతలెవరూ. బండ ప్రకాష్ స్థానంలో పెద్దల సభలో అడగు పెట్టబోతున్న ఆ ఒక్క అదృష్ట వంతుడెవరు. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఒక్క సీటుకు గులాబీ బాస్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా బండ ప్రకాష్ ఎన్నిక కావడంతో రాజ్యసభ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. 19న నామినేషన్లకు చివరితేదీ కాగా మే 30న పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుంది.

కేసీఆర్ రాజకీయంగా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు అంచనా వేయలేని విధంగా వ్యూహాత్మక అగుడులు వేస్తారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడుగా ఉన్న బండ ప్రకాష్‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికకు నోటిఫికేషన్ రానుండడంతో బండ ప్రకాష్ స్థానంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎవరిని రాజ్య సభకు పంపిస్తారన్న చర్చ జరుగుతోంది. రాజ్యసభ స్థానానికి టీఆర్ఎస్ లో ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాష్ స్థానంలో ఆ సామాజిక వర్గానికే ఇస్తారా లేక ఇతరులకు ఛాన్స్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక హుజూరాబాద్ ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి వచ్చిన సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సైతం రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. సీనియారిటి పరిగణలోనికి తీసుకొని అవకాశం ఇస్తే పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తానని కేసీఆర్‌ను మోత్కుపల్లి కోరుతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తోన్న కెసిఆర్ తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి కేసీఆర్‌కు చేదోడు వాదోడుగా ఉన్న దామోదర రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గతంలో రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్న కేసీఆర్ బండ ప్రకాష్ ముదిరాజ్, బడుగు లింగయ్య యాదవ్‌లకు అవకాశం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈసారి కూడా సామాజికవర్గాల సమీకరణల ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి ఖాళీ అవుతున్న ఒక్క రాజ్యసభ స్థానంపై ఆశావహులు చాలా మంది ఉన్నా చివరి నిమిషం వరకు గులాబీ బాస్ ఎవరికి ఛాన్స్ ఇస్తారోనన్న ఉత్కంఠ పార్టీలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories