Huzurabad: తెలంగాణలో మూడు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తుందా రాదా అనే ప్రచారానికి తెరపడింది.
Huzurabad: తెలంగాణలో మూడు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తుందా రాదా అనే ప్రచారానికి తెరపడింది. షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. పార్టీలన్నీ ప్రచారం కోసం సన్నద్ధం అవుతున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ వెనకబడింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు వేదిక కాబోతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపై HMTV స్పెషల్ ఫోకస్.
హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణలో రాజకీయంగా ఎన్నడూ లేనంత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో ఊహించని పరిణామాలు సంభవిస్తాయని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. రెండేళ్ళ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిహార్సల్స్‌లా హుజురాబాద్ ఉప ఎన్నికను భావిస్తున్నారు. అధికార టిఆర్ఎస్‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యే. సియం కేసిఆర్ కోరి తెచ్చుకున్న ఎన్నిక కావడంతో గులాబీ సేన ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే దాదాపు రాష్ట్ర పార్టీ నేతలంతా హుజూరాబాద్ లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఈ గెలుపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా తిరిగి అధికారంలోకి రావచ్చని టీఆర్‌ఎస్ భావిస్తోంది. మూడు ప్రధాన పార్టీలతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన పార్టీలు కూడా బరిలోకి దిగుతాయనే ప్రచారం సాగుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలోని బీఎస్‌పీ, వైఎస్ కుమార్తె షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌టీపీల వైఖరి జనసేన ఎవరికి మద్దతిస్తుందనే చర్చలు కూడా సాగుతున్నాయి.
ఎట్టకేలకు హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రావడంతో బిజేపి ఊపిరి పీల్చుకుందని చెప్పవచ్చు. హైదరాబద్ నుండి హుజూరాబాద్ వరకు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలయ్యేనాటికి పాదయాత్ర హుజూరాబాద్‌కు చేరుకునే విధంగా పార్టీ ప్లాన్ చేసుకుంటోంది. పాదయాత్ర ముగింపు సభనే ఉప ఎన్నికల శంఖారావ సభగా మల్చుకోవడానికి కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పాదయాత్ర పూర్తి కాగానే మొత్తం నేతలంతా అక్కడే మకాం వేసి ప్రచారం చేయబోతోంది. హుజురాబాద్ విజయంపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టిఆర్ఎస్వీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించిన టిఆర్ఎస్ ఓ రౌండ్ ప్రచారాన్ని కూడా కంప్లీట్ చేసింది. ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి హుజురాబాద్ లో టిఆర్ఎస్ గెలుపు కోసం సర్వశక్తులు పెట్టి పనిచేస్తున్నారు. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలను ఇంఛార్జీలుగా నియమించడంతో వారంతా ఇప్పటికే సామాజిక వర్గాల వారిగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వారిగా సమావేశాలు పెట్టి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాలపైనే టీఆర్‌ఎస్ గట్టి నమ్మకం పెట్టుకుంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో టిఆర్ఎస్ పార్టీ మొత్తం అక్కడే దృష్టిపెట్టింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మాదిరిగా సునాయాసంగా విజయం సాధించడానికి కేసిఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. దసరా పండగ నాటికి భారీ బహింరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలపై గులాబీసేన విమర్శల ధాటిని పెంచింది. టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు ఒకిరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
హుజూరాబాద్ ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీ దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థినే ప్రకటించలేకపోయింది. ప్రచారం ఇంకా ప్రారంభించనట్లే. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని నాయకులు చెబుతున్నారు. దీంతో స్థానిక కార్యకర్తలు డీలా పడుతున్నారు. గౌరవప్రదమైన ఓటమి కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్సు గానే ఉంది. ఉప ఎన్నిక ఇప్పట్లో జరగదని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే హఠాత్తుగా షెడ్యూల్ ప్రకటించడంతో అభ్యర్థి కోసం కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ నేతృత్వంలో అభ్యర్థి ఎంపిక కోసం కమిటీ వేశారు. ఈ కమిటీ ముగ్గురు పేర్లను సూచిస్తూ పీసీసీకి, ఏఐసీసీకి నివేదిక పంపింది. కొండా సురేఖ , మాజీ ఎంపీపీ సదానందం, కరీంనగర్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణా రెడ్డి పేర్లను కమిటీ సూచించింది. కొండా సురేఖకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో స్థానిక నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలతో పీసీసీ మరో కమిటీ వేసింది. ఈ కమిటీ ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. మరోవైపు పోటీపట్ల ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామంటున్నారు నాయకులు.
హుజురాబాద్‌లో దళిత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం పట్టుపడుతోంది. మరో వర్గం కొండ సురేఖ బలమైన అభ్యర్థి అవుతారని అంటోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖను బరిలోకి దించుతారా లేక ఇతరులకు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. అభ్యర్థిని ప్రకటించి కలిసివచ్చేవారందరి మద్దతు కోరతామంటున్నారు రేవంత్‌రెడ్డి. మొత్తం మీద హుజురాబాద్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఓటరు ఎవరిని కరుణిస్తాడో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire