ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయిందా?

Whats Going on In Narsapur pink party?
x

ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయిందా?

Highlights

Narsapur: ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయిందా?

Narsapur: ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయిందా? ఆ ఎమ్మెల్యేకి, స్థానిక నేతలకు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతుందా? స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వహించే అధికారక కార్యక్రమాల్లో ఆ ఎమ్మెల్యే తన సొంత కోటరీని ప్రమోట్ చేస్తున్నారా? ఇదే లోకల్‌ లీడర్లకు అసహనం తెప్పిస్తోందా? ఇంతకీ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆ నియోజకవర్గం ఏది? కోటరీతో క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు?

మెదక్ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలో రోజు రోజుకి అధిపత్య పోరు పెరుగుతోందన్న ప్రచారం జోరు మీద సాగుతోంది. అక్కడి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేరు చెబితేనే సొంత పార్టీ నేతలు కొందరు ఒంటి కాలుపై లేస్తున్నారట. నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే‌గా మదన్‌రెడ్డి వరుసగా రెండోసారి టీఆర్ఎస్ తరుఫున గెలుపొందారు. ఆయన పెద్దనాన్న ఇదే నియోజకవర్గం నుంచి గతంలో సీపీఐ తరుపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన నుంచే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నర్సాపూర్‌లో మంచి పట్టే సాధించారు.

ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తాజాగా మదన్‌రెడ్డి పెద్దనాన్న మనవుడు శేషసాయి ఇదే నియోజకవర్గానికి చెందిన చిలిపిచెడు మండల జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. శేషసాయి ఫ్యామిలీ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉంది. అయితే, తాజాగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి, శేషసాయి కుటుంబానికి గ్యాప్ రావడంతో శేషసాయి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో ఉన్న మదన్‌రెడ్డి సడన్‌గా కారెక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిందట. అదీగాక, 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు జాయిన అయిన మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డితో పాటు టీఆర్ఎస్‌లోకి వచ్చిన కాంగ్రెస్ క్యాడర్‌తో కలిపి అధికార పార్టీ ఇప్పుడంతా కలగూర గంపలా తయారు అయిందట.

అంతేగాకుండా, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీయాదవ్‌కి కూడా ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో విబేధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. గతంలో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన మురళీయాదవ్‌ భార్య జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పని చేశారు, 2014 ఎన్నికల్లో మురళీయాదవ్‌కే నర్సాపూర్‌ నుంచి టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్‌ అనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో టీడీపీ నుంచి మదన్‌రెడ్డి రావడంతో మురళీకి బ్రేక్‌పడింది. ఇది ఒకరకమైన అసహనానికి కారణంగా చెబుతోంది క్యాడర్‌.

ఇక నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఏడు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. ఇందులో మెజార్టీ జడ్పీటీసీలు ఎంపీపీలతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి అస్సలు పొసగడం లేదట. ప్రతి మండలంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారన్న వదంతుల మధ్య ఎవరు ఎవరి వాళ్లో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోందట. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా ఒక మండలానికి మదన్‌రెడ్డిని ఇన్‌ఛార్జిగా నియమించింది అధిష్టానం. అయితే అక్కడ కూడా తన వర్గానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే గుసగుసలు వినిపించాయి. అంతెందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఒక డివిజన్ బాధ్యతలను కూడా మదన్‌రెడ్డికి అప్పగించింది. అక్కడ కూడా తన వర్గానికి ప్రయారిటీ ఇవ్వడంతో మెజార్టీ నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న చర్చ జరుగుతోంది.

అభివృద్ధి కార్యక్రమాలు, చెక్కులు పంపిణీ వంటి వాటిల్లో కూడా తన వర్గాన్ని పెంచి పోషిస్తుండటంతో పాటు, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయట. స్థానిక నేతలకి కనీసం సమాచారం ఇవ్వకుండా తన వర్గం నేతలతో ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తుండటంపై కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాల నేతలు పోస్టింగ్‌లతో తెగ హల్‌చల్ చేస్తున్నారట. ఆఖరికి ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలతో అధికారులకు కూడా తలనొప్పులు వస్తున్నాయట. ఏమైనా మొత్తానికి నర్సాపూర్ గులాబీ పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్న మాట నిజమంటున్నారు కార్యకర్తలు. రోజురోజుకు బహిరంగ విమర్శలు ఎక్కువ అయితే ప్రతిపక్షాలకు చాన్స్‌ ఇచ్చినట్టు అవుతుందంటున్నారు. మరి ఇంటి తగువును కారు పార్టీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories